Avocado : రోజూ అవకాడో తింటే ఏమవుతుంది? డాక్టర్ చెప్పిన 5 లాభాలు..
అవకాడో టోస్ట్, సలాడ్ల రూపంలో మనసు దోచుకుంటున్న ఈ పండుతో ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజూ అవకాడో తినడం వల్ల గుండె, జీర్ణవ్యవస్థ, రక్తపోటుపై ఎలాంటి ప్రభావం పడుతుందో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథీ వివరించారు. ఆ ఐదు కీలక లాభాలు ఇక్కడ చూడండి..

అవకాడోలు కేవలం ట్రెండీ అల్పాహారాలకు, ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలకు మాత్రమే పరిమితం కాలేదు; వాటి వెనుక అద్భుతమైన పోషక విలువలు దాగి ఉన్నాయి. అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు (బీపీ), మలబద్ధకం వంటి జీవనశైలి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో రోజూ అవకాడో తింటే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథీ ఒక వీడియో ద్వారా స్పష్టంగా వివరించారు. మెరుగైన జీర్ణక్రియ, సాఫీగా మలవిసర్జన, ఆరోగ్యకరమైన రక్తపోటు సహా ఐదు ప్రధాన ప్రయోజనాలను ఆయన పంచుకున్నారు.

అవకాడోలలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు (Monounsaturated fats) పుష్కలంగా ఉంటాయని, ఇవి శరీరంలోని ఎల్‌డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని డాక్టర్ సేథీ తెలిపారు. గుండెకు మేలు చేసే ఆహార ప్రణాళికలో ఇది ఒక చక్కటి ఎంపిక అని ఆయన పేర్కొన్నారు. "ఆహారంలో ఉండే సాచ్యురేటెడ్ ఫ్యాట్ బదులుగా అవకాడోలను తీసుకున్నప్పుడు, వాటిలోని ఆరోగ్యకరమైన మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్‌డీఎల్‌ను తగ్గించడంలో తోడ్పడతాయి," అని డాక్టర్ సేథీ వివరించారు. మన రోజువారీ వంటల్లో వాడే నెయ్యి, వెన్న లేదా నూనెల ద్వారా వచ్చే హానికర కొవ్వులను తగ్గించుకోవాలనుకునే వారికి అవకాడో చక్కటి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.

గుండెతో పాటు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలోనూ అవకాడో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్థం (ఫైబర్) పేగులలో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడుతుందని, తద్వారా ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌ను కాపాడుతుందని డాక్టర్ సేథీ చెప్పారు. "అవకాడోలలో ఉండే ఫైబర్ ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియాకు, ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌కు అండగా నిలుస్తుంది," అని డాక్టర్ సేథీ స్పష్టం చేశారు.

క్రమరహిత మలవిసర్జన, మలబద్ధకం సమస్యలతో ఇబ్బంది పడేవారికి కూడా ఈ పండు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. "ఒక మధ్యస్థాయి అవకాడోలో సుమారు 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది," అని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సేథీ వెల్లడించారు. ఇంత పెద్ద మొత్తంలో ఫైబర్ లభించడం వల్ల జీర్ణక్రియ వేగవంతమై మలవిసర్జన సాఫీగా, క్రమం తప్పకుండా జరుగుతుంది.

రోజువారీ భోజనంలో అవకాడోను చేర్చుకోవడానికి మరో బలమైన కారణం ఉంది. దీనిని తిన్న తర్వాత ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. అవకాడోలోని ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వుల కలయిక ఆకలిని అదుపులో ఉంచుతుంది; దీనివల్ల మధ్యమధ్యలో అనారోగ్యకరమైన చిరుతిళ్లు తినాలన్న కోరిక తగ్గుతుంది. బరువు నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

ఇక ఐదో ప్రయోజనంగా అవకాడోలోని పొటాషియం విలువలను డాక్టర్ సేథీ ప్రస్తావించారు. శరీరంలో రక్తపోటును సాధారణ స్థాయిలో ఉంచడంలో పొటాషియం కీలక పాత్ర పోషిస్తుంది. "రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే పొటాషియం ఖనిజం అవకాడోల్లో సమృద్ధిగా ఉంటుంది," అని ఆయన పేర్కొన్నారు. ఉదయం తీసుకునే బ్రెడ్ టోస్ట్ నుంచి మధ్యాహ్న భోజనంలోని సలాడ్ వరకు ఏ రూపంలోనైనా అవకాడోను సులభంగా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఈ పండు ద్వారా రోజువారీ డైట్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌ను సులువుగా జతచేసుకోవచ్చు.

E-Paper

