8 గంటలు నిద్రపోయినా తల భారంగా ఉంటోందా? 'బ్రెయిన్ ఫాగ్' ఎందుకు వస్తుంది?
రాత్రంతా 8 గంటలు నిద్రపోయినా ఉదయం లేవగానే తల భారంగా, నీరసంగా అనిపిస్తోందా? చిన్న పనులపైనా ఏకాగ్రత కుదరక ఇబ్బంది పడుతున్నారా? వైద్య పరిభాషలో దీనిని 'బ్రెయిన్ ఫాగ్' అంటారు. దీనికి అసలు కారణాలు, పరిష్కార మార్గాలు ఇక్కడ తెలుసుకోండి..

రాత్రి సమయానికే పడుకుని, ఏకంగా ఎనిమిది గంటల పాటు నిద్రపోతారు! ఉదయం అలారం మోగగానే సమయానికే నిద్రలేస్తారు. అయినా సరే తలంతా ఏదో బరువు పెట్టినట్లు భారంగా అనిపిస్తుంది. ఆఫీసులో ఒక చిన్న ఈమెయిల్ రాయడానికి రెట్టింపు సమయం పడుతుంది. ఎవరితోనైనా మాట్లాడుతుండగా బాగా తెలిసిన పదం కూడా మధ్యలోనే మర్చిపోతుంటారు. ఏదో పని మీద ఒక గదిలోకి వెళ్లి, అసలు ఎందుకు వచ్చామో తెలియక అక్కడే నిలబడి ఆలోచిస్తుంటారు. మీ ఉదయాలు కూడా ఇలాగే మొదలవుతుంటే, అది మీ భ్రమ ఎంతమాత్రం కాదు. వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని 'బ్రెయిన్ ఫాగ్' అని పిలుస్తారు. నిజానికి బ్రెయిన్ ఫాగ్ అనేది ఒక ప్రత్యేక వ్యాధి కాదు. మెదడు మందగించినట్లు అనిపించే పలు లక్షణాల సముదాయాన్ని సాధారణ భాషలో ఇలా వ్యవహరిస్తారు. చాలామందిలో ఇది ఏదో ఒక అంతర్గత కారణాన్ని సూచిస్తుంది; ఆ కారణాన్ని గుర్తిస్తే సులభంగా పరిష్కరించుకోవచ్చు.

బ్రెయిన్ ఫాగ్ లక్షణాలు- రోజువారీ సాధారణ పనులపైనా ఏకాగ్రత నిలపలేకపోవడం, సాధారణంగా గుర్తుండే చిన్నచిన్న విషయాలను కూడా మర్చిపోవడం, ఆలోచనా వేగం తగ్గడం, ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం పట్టడం, సంభాషణ మధ్యలో సరైన పదాలు దొరక్కపోవడం, మాట్లాడుతున్న అంశాన్ని మర్చిపోవడం, శారీరకంగా పెద్దగా శ్రమ పడకపోయినా, మానసికంగా తీవ్ర అలసటగా అనిపించడం.

మంచి నిద్ర అంటే కేవలం మంచం మీద ఎన్ని గంటలు పడుకున్నామన్నది కాదు; ఆ నిద్ర ఎంత గాఢంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిందన్నదే అసలు విషయం1 మనం రాత్రి నిద్రపోతున్నప్పుడు మెదడు రోజంతా సేకరించిన జ్ఞాపకాలను క్రమబద్ధీకరిస్తుంది, అనవసరపు ఒత్తిడిని తొలగించి మరుసటి రోజు కోసం తనను తాను రీసెట్ చేసుకుంటుంది. ఒకవేళ మీ నిద్ర మధ్యలో చిన్నచిన్న విరామాలతో భంగం కలిగితే, మీరు మెలకువ వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోకపోవచ్చు; కానీ మెదడు మాత్రం తన మరమ్మతు పనిని పూర్తి చేయలేదు. ఫలితంగా గంటల లెక్క సరిపోయినా, శరీరానికి అవసరమైన విశ్రాంతి అందదు.

నిద్ర సరిపోయినా మెదడు మొద్దుబారడానికి ప్రధాన కారణాలు- నిద్రలో ఉన్నప్పుడు శ్వాస పదేపదే ఆగిపోతూ తిరిగి మొదలయ్యే సమస్య ఇది. దీనివల్ల గాఢ నిద్రకు ఆటంకం కలుగుతుంది. బిగ్గరగా గురక పెట్టడం, ఉదయం లేవగానే నోరు ఎండిపోవడం లేదా గొంతు నొప్పిగా ఉండటం, ఉదయపు తలనొప్పి, పగటిపూట నిద్రమత్తు దీని సంకేతాలు. మీ గదిలో నిద్రించే వారిని మీ శ్వాస మధ్యలో ఆగుతుందో లేదో గమనించమని అడగండి. దీనికి చికిత్స అందుబాటులో ఉంది. వారాంతాల్లో ఆలస్యంగా పడుకోవడం, ఆలస్యంగా లేవడం సహా ప్రతిరోజూ వేర్వేరు సమయాల్లో నిద్రించడం వల్ల శరీర అంతర్గత గడియారం (బాడీ క్లాక్) గందరగోళానికి గురవుతుంది. సాయంత్రం పూట తాగే ఒక కప్పు కాఫీ లేదా టీ వల్ల నిద్ర పట్టినట్లు అనిపించినా, అది గాఢ నిద్రను రానివ్వదు. అలాగే మద్యం మొదట్లో మత్తును కలిగించినా, అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రకు తీవ్ర ఆటంకం కలిగిస్తుంది.

శరీరం నిశ్చలంగా పడుకున్నా, ఆందోళనతో నిండిన మనసు నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. దీర్ఘకాలిక మానసిక కుంగుబాటు కూడా నిద్రపోయిన తర్వాత తీవ్ర అలసటకు దారితీస్తుంది. శరీరంలో ఐరన్ లేదా విటమిన్ బీ12 తగ్గినప్పుడు నీరసం, ఏకాగ్రత లోపం, మతిమరుపు వస్తాయి. సొంతంగా విటమిన్ మాత్రలు వేసుకోకుండా, ఒక సాధారణ రక్త పరీక్ష చేయించుకుంటే అసలు ఏ పోషకం తగ్గిందో స్పష్టంగా తెలుస్తుంది.

థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగించడం వల్ల అలసట, మతిమరుపు, చలిని తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని రకాల అలర్జీ మాత్రలు, నిద్ర మాత్రలు, యాంటీ డిప్రెసెంట్ మందులు మరుసటి రోజు మత్తుగా ఉండేలా చేస్తాయి. అయితే వైద్యుల సలహా లేకుండా మీరు వాడుతున్న మందులను సొంతంగా ఆపకూడదు. సమయానికి భోజనం చేయకపోవడం, తగినంత నీరు తాగకపోవడం, గంటల తరబడి స్క్రీన్లు చూడటం, మహిళల్లో మెనోపాజ్, గర్భధారణ దశలు, కోవిడ్-19 వంటి వ్యాధుల నుంచి కోలుకునే సమయాల్లోనూ ఆలోచనా శక్తి మందగిస్తుంది.

ఇంట్లోనే పాటించగల సులభమైన మార్పులు- వారాంతాల్లో కూడా ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రలేవండి, రాత్రిపూట కనీసం ఏడు గంటల పాటు నిద్రపోయేలా ప్రణాళిక వేసుకోండి, మధ్యాహ్నం దాటిన తర్వాత కాఫీ, టీలకు, పడుకునే ముందు మద్యానికి దూరంగా ఉండండి, పడకగదిలోకి మొబైల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లను అనుమతించకండి.

సమయానికి పౌష్టికాహారం తీసుకుంటూ, రోజంతా తగినంత నీరు తాగండి, వారంలో చాలా రోజులు నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయండి, ప్రతి విషయాన్ని మెదడుపైనే ఆధారపడకుండా డైరీలో రాసుకునే అలవాటు చేసుకోండి.

E-Paper
