...
...
Next Story

తిరుపతి సమీపంలో ఉన్న ఈ శివాలయం గురించి మీకు తెలుసా?

చిత్తూరు జిల్లా రేణిగుంటకు 11 కి.మీ. దూరంలోను, తిరుపతి నుంచి 22 కి.మీ. దూరంలో గుడిమల్లం శివాలయం సువర్ణముఖీ నది తీరంలో నెలకొని ఉంది. ఆలయంలోని శివలింగాకారం చిత్రంగా ఉంటుంది. ఈ ఆకారం ప్రపంచంలో అరుదుగా కనిపిస్తుందని ఘంటాపథంగా చెప్పవచ్చు అని చిలకమర్తి తెలిపారు.

Published on: May 28, 2025, 07:00:04 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని గుడిమల్లం అనే కుగ్రామంలో శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవాలయంలో గుడిమల్లం శివలింగం ఉంది. చిత్తూరు జిల్లా రేణిగుంటకు 11 కి.మీ. దూరంలోను, తిరుపతి నుంచి 22 కి.మీ. దూరంలో గుడిమల్లం శివాలయంసువర్ణముఖీ నది తీరంలో నెలకొని ఉంది అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పురావస్తుశాఖ పరిశోధనల ప్రకారం ఇది క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన ఆలయంగా గుర్తించగా, 1908 నాటికే బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఆలయాన్ని గుర్తించింది. చోళ, పల్లవ, గంగపల్లవ, రాయల కాలంలో నిత్యం ధూప, దీప, నైవేద్యాలతో కళకళలాడిన ఈ ఆలయాన్ని1954లో గుడిమల్లం గ్రామస్తుల నుండి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకుంది అని బ్రహ్మశ్రీ చిలకమర్తి తెలిపారు.

వింత ఆకారం

ఆలయంలోని శివలింగాకారం చిత్రంగా ఉంటుంది. ఈ ఆకారం ప్రపంచంలో అరుదుగా కనిపిస్తుందని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఈ శివలింగం దాదాపు 7 అడుగుల ఎత్తు, ఒక అడుగు వెడల్పుతో ఉండటం విశేషం. దానిపై రాక్షసుడి భుజాలపై నిలుచున్న శివమూర్తి ఉంటుంది. ఈ శివాలయంలోని శివుడుపరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నారు. ఇక్కడి శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది.

ఈ ఆలయంలోని గర్భాలయం, అంతరాలయం, ముఖ మండపాల కన్నా లోతులో ఉంటుంది. గర్భగృహంలో ప్రతిష్ఠించిన శివలింగం లింగరూపంలో కాకుండా, శివుడు మానవరూపంలో మహావీరుడైన వేటగాడిలా కనిపిస్తాడు. లింగాన్ని ముదురు కాఫీ రంగులో ఉన్న రాతితో శిల్పీకరించారు. ఈ వర్ణాన్ని ముదురు గోధుమవర్ణం అని కూడా చెప్పవచ్చు. లింగంముందువైపు ఉబ్బెత్తుగానూ, లింగం ఉండి బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా చెక్కిన శివుడు, అపస్మారపురుషుని భుజాలపై నిలబడిన (స్థానకమూర్తి) రూపంలో అతి సుందరంగా ఉన్నాడు.

ఆంధ్రశాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయంగా భావిస్తున్న ఈ ఆలయం, శాతవాహన నిర్మాణ శైలిని పోలి ఉంది. తవ్వకాల్లో లభించిన శాసనాల ద్వారా 12వ శతాబ్దంలో విక్రమచోళుల కాలంలో ఆలయంపునర్నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. ఇందుకు సంబంధించిన విశేషాలు చంద్రగిరి కోటలోని మ్యూజియంలో లభ్యమవుతున్నాయి అని చిలకమర్తి తెలిపారు.

వస్త్రధారణ ఋగ్వేదకాలం నాటిది

ఈ లింగంపై ఒక చేత్తో పరుశువును, మరో చేత్తో గొర్రెను పట్టుకుని ఒక యక్షుడి భుజాలపై నిలబడిన రుద్రుడిని ధ్యాన ప్రతిమఖంగా చూపడం ఈ శిల్ప విశేషం. అలాగే తలపాగా ధోవతి ధరించిన ఈ రుద్రుడి వస్త్రధారణ ఋగ్వేదకాలం నాటిదని చరిత్రకారులు అంచనా వేశారు. ప్రాచీన శైవ జీవన విధానాన్ని సవివరంగా తెలిపే ఈ అద్భుతాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి ఎటువంటి సమాచారం లేదు. ఆలయంలో దొరికిన శాసనాల్లో దీన్ని పరమేశ్వరఆలయంగానూ, దీని యజమాని, అధికారి రుద్రుడిగా పేర్కొన్నారు.

తాళం ఆకారం

శివుని అనేక రూపాలను ఏకలింగంపై నాటి శిల్పకారులు నైపుణ్యతతో మలచడం విశేషం. ఈ లింగం కింద 350 అడుగుల లోతులోని వాటర్ టేబుల్పై నీటి ఒత్తిడి పెరిగితే, ఆ నీరు లింగాన్ని అభిషేకించేలా ఇంజనీరింగ్ పనితనంతో ఎంతో నైపుణ్యంతో నిర్మాణ చాతుర్యాన్ని చూపారు. ఈ లింగం తాళం ఆకారంలో ప్రతిష్ఠించినందు వల్ల దీన్ని ఏ మాత్రం కదిలించినా, గజపృష్ఠ (ఏనుగు వెనుకవైపు) ఆకారంలో ఉండే గుడి మొత్తం కూలిపోతుందని కొందరి వాదన.

ఆనందకుమార్ స్వామి, జితేంద్రనాథ్ బెనర్జీ వంటి అనేకమంది పురాతత్వవేత్తలు, చరిత్రకారులు, శాస్త్రవేత్తలు శిల్ప చరిత్రలో అపురూపమైన ఈ శివలింగాన్ని తమ రచనల్లో అభిమానించి, ఆరాధించి, ప్రేమించారు. పురావస్తుశాస్త్రవేత్తలు తమకు అందుబాటులోని పరిజ్ఞానంతో ఈ శివలింగం క్రీస్తుపూర్వం 1 లేదా 2వ శతాబ్దానికి చెందిందని తేల్చారు. అలనాటి సాంచి, అమరావతి శిల్పాల వలే ఈ శివలింగాన్ని వృక్ష, చైత్య ఆరాధన ప్రకారం బహిరంగ ప్రదేశంలోనే పూజలు చేసినట్లు తెలుస్తుంది. తదనంతర కాలంలో జరిగిన నిర్మాణాలలో భాగంగా వాస్తుశైలి అమరావతి, మధురవాస్తుశైలిని పోలి ఉందని తేల్చారు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

మధురలో కూడా

ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఉన్న మ్యూజియంలో క్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్దానికి చెందిన శివలింగం ఉంది. అది ఈ గుడిమల్లం శివలింగాన్ని పోలి ఉంది. అలాగే ఉజ్జయినిలో జరిపిన పురావస్తు తవ్వకాలలో క్రీస్తుపూర్వం 2–3వ శతాబ్దానికి చెందినవిగా భావించే కొన్ని రాగి నాణేలుదొరికాయి అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. వాటిపై ఉన్న చిత్రం అచ్చం గుడిమల్లం శివలింగమే. నెల్లూరు చెరువులో కూడా ఇటువంటి లింగం ఆరుబయటే ఉందని కొందరు చెబుతున్నారు.

రుద్రలింగం

మధురై మ్యూజియంలో ఇటువంటి లింగాన్ని పోలిన ఆకృతి ఉంది. శ్రీకాళహస్తికి దగ్గరలో ఉండే ఈ ఆలయం, భారతదేశంలో శివారాధన ప్రాచీనత తెలిపే ఒక అపురూప సాక్ష్యం. ప్రముఖ పురాతత్వవేత్త ఇంగువ కార్తికేయశర్మ తన రచనల్లో అనేక ఆధారాలతో సహా, మొత్తం భారతదేశంలోనే ఇది ప్రాచీన రుద్రలింగంగా తగిన ఆధారాలతో నిరూపించారు. ఏకశిలపై శివుని అనేక రూపాలు చెక్కడం, నాటి శిల్పుల విశిష్టతను చాటుతోంది.

భూగర్భ జల మట్టం ఈ లింగం కింద 350 అడుగుల లోతులో ఉన్నప్పటికీ, ఒత్తిడి పెరిగిన సమయంలో ఆ నీళ్లు లింగంపై పడుతుంటాయి. ఈ నిర్మాణం వెనుక అద్భుతమైన ఆర్కిటెక్చర్ పరిజ్ఞానం దాగి ఉంది. 2005 డిసెంబర్ 5న అలా నీళ్లు శివుడిని అభిషేకించాయి. తిరిగి 60 ఏళ్లకు అంటే 2065కు అలా వచ్చే వరద నీటితో ఈ ఆలయం నిండి పోతుందని భక్తుల నమ్మకం. శిల్ప చరిత్రలోనే అపురూపమైనదని అంతర్జాతీయ పురాతత్వవేత్తల రచనలు కూడా స్పష్టం చేస్తున్నాయి.

స్థానికుల సహకారంతో దేవాదాయ శాఖవారు 7 రోజులపాటు మహాశివరాత్రి ఉత్సవాలను ఇక్కడ నిర్వహిస్తారు. గుడిమల్లంలోని శ్రీ పరశురామేశ్వరుని ఆలయం శైవం, వైష్ణవం రెండింటినీ ప్రతిబింబిస్తున్న ఆలయం అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ 9494981000

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe