...
...
Next Story

విష్ణువుకు నిలయం, భక్తులకు మోక్షం.. మహిమాన్విత పూరీ క్షేత్రం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవిగో!

ఋగ్వేదం, మత్స్య, బ్రహ్మ, నారద, పద్మ, స్కంద, కపిల పురాణాలలో పూరీ క్షేత్ర ప్రస్తావన ఉంది. యుగాల క్రితం సాగరతీరాన జగన్నాథుడు నీలమాధవునిగా కొలువై ఉండేవారట. దివ్యకాంతులు వెదజల్లే ఆ అర్చనామూర్తి దర్శనంతోనే సకల పాపాలు తొలగిపోయేవి. మహిమాన్విత పూరీ క్షేత్రం గురించి చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

Published on: Jul 8, 2025, 07:00:04 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మన దేశం భిన్న సంస్కృతులకు, భిన్న సంప్రదాయాలకు నిలయం. మన భాష, వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు వేరువేరుగా ఉంటాయి. భగవంతుని ఆరాధించడంలో కూడా అదే కనిపిస్తుంది. చరాచర సృష్టికర్త, ఆద్యంతాలు లేని నిరాకారుడైన సర్వాంతర్యామికి వివిధ ప్రాంతాలలో ఆలయాలను నిర్మించి పూజించడం ఎన్నో వందల సంవత్సరాలుగా జరుగుతోందని పురాణగ్రంథాలు తెలుపుతున్నాయి.

ప్రతి ఒక్క ఆలయం తనదైన ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. అవి ఆలయ నిర్మాణం, క్షేత్ర ప్రాధాన్యం, వెలిసిన దేవరూపం, అక్కడ జరిగే ఉత్సవాలు, అవే పురాణాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత కలియుగంలో విగ్రహారాధనకు అగ్రస్థానం అందించారు. దానికి కారణాలు అనేకం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తిప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పురుష మందాన

ఋగ్వేదం, మత్స్య, బ్రహ్మ, నారద, పద్మ, స్కంద, కపిల పురాణాలలో పూరీ క్షేత్ర ప్రస్తావన ఉంది. ఋగ్వేదంలో “పురుష మందాన” అని పేర్కొనబడినట్లు తెలుస్తోంది. పురుష మందాన కాలక్రమంలో “పురుషోత్తమ పూరీ”గా మారి, ఇప్పుడు “పూరీ” అని పిలుస్తున్నారు. పురుషుడే పురుషోత్తముడయ్యారు, ఆయనే జగన్నాథుడు.

తొలి ఆలయంఎవరు నిర్మించారన్నదానికి స్పష్టమైన ఆధారాలు లేకపోయినా, పదకొండవ శతాబ్దంలో తూర్పు గంగ వంశ రాజులు ప్రస్తుత ఆలయాన్ని నిర్మించారని చరిత్రకారుల ఏకాభిప్రాయం. అగ్రజుడు, సోదరితో శ్రీ జగన్నాథుడు నీలాచలం అనే పర్వతంపై కొలువుతీరిన పూరీ మందిరం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు నిర్మించినట్లు తెలుస్తోంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

నీల మాధవుడు

యుగాల క్రితం సర్వలోక రక్షకుడైన శ్రీహరి సాగరతీరాన జగన్నాథుడు నీలమాధవునిగా కొలువై ఉండేవారట. దివ్యకాంతులు వెదజల్లే ఆ అర్చనామూర్తి దర్శనంతోనే సకల పాపాలు తొలగిపోయేవి, నరకం వెళ్లేవారు తగ్గిపోయారట. ఆందోళన చెందిన యమధర్మరాజు, వరమశివుని ప్రార్థించి ఆ దివ్య మంగళరూపాన్ని భూస్థాపితం చేశారట. ఆనంత కాలంలోనే అక్కడ ఒక పర్వతం ఏర్పడింది, అదే నీలాచలం.

ఈ మూడు రూపాలు, పరమాత్మ అయిన వాసుదేవునికి, ఆయన వ్యూహరూపమైన సంగర్షణ (బలరాముడు), ఆయన యోగమాయ అయిన సుభద్ర దేవి. నాల్గవది సుదర్శన చక్రం. శ్రీవారి వైభవానికి చిహ్నాలు అని విగ్రహాల రూప విశేషాల గురించి వివరించారట. క్షేత్రమహత్యాన్ని వివరించిన తరువాత, విధాత స్వయంగా విగ్రహ ప్రతిష్ఠ చేశారట. అలా హంసవాహనుని చేతుల మీదుగా ద్వాపరయుగ తొలినాళ్లలో పురుషోత్తమ పూరీ శంఖ స్థాపన జరిగినట్లుగా క్షేత్రగాథ తెలుపుతోందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఈ ప్రాంగణంలో సుమారు వందకు పైగా ఉపాలయాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి: శ్రీ కంచి గణేష్, శ్రీ సూర్య, శ్రీ మహాలక్ష్మి, శ్రీ నరసింహ, శ్రీరామ, శ్రీ హనుమాన్, శ్రీ విమల, శ్రీ శనేశ్వర సన్నిధులు. గజపతి పురుషోత్తమ దేవుడు కంచి రాజకుమారిని వివాహం చేసుకున్న సందర్భంలో, కంచి రాజు అల్లునికి గణపతి విగ్రహాన్ని బహుకరించారట. శ్రీ నరసింహస్వామిని ఇంద్రద్యుమ్న రాజు ద్వాపరయుగంలో ప్రతిష్ఠించారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

శక్తి పీఠాలుగా

మహాశక్తి పీఠం దక్షయాగంలో జరిగిన అవమానానికి యజ్ఞగుండంలో తనువు చాలించిన సతీదేవి శరీరాన్ని, శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఛేదించారు. ఆ శరీరఖండాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా ప్రసిద్ధికెక్కాయి. శ్రీ జగన్నాథ మందిరంలో ఉన్న శ్రీ విమలాదేవి కొలువైన ప్రదేశంలో సతీదేవి పాదభాగాలు పడటంవలన ఈ సన్నిధి మహాశక్తిపీఠంగా విరాజిల్లుతోంది.

అమ్మవారు శాంత ప్రసన్న వదనంతో దర్శనమిస్తారు. ఆశ్వీయుజ మాసంలో మహాలయ ప్రారంభానికి ఎనిమిది రోజుల ముందు విశేష పూజలు చేస్తారు. విజయదశమి ముగిసిన తరువాత జరిగే “పోడశ” దినాత్మకంగా పిలిచే పదహారు రోజుల పండుగ, శ్రీ విమలాదేవి సన్నిధిలో జరిగే మరో ప్రత్యేక ఉత్సవం. శ్రీ జగన్నాథఆలయ ప్రాంగణంలో వివిధ సాంస్కృతిక సమావేశాల కోసం, ఆలయ ఉత్సవాలు నిర్వహించడానికి అనేక మండపాలు నిర్మించారు. ఇవన్నీ చక్కని స్తంభాలతో, ఎత్తైన గద్దెతో నిర్మించబడ్డాయి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పాకశాల

ఈ ఆలయంలో మరో విశేష ప్రదేశం పాకశాల. జగన్నాయకుడు కొలువైన పూరీ సందర్శనం మనోభీష్టాలను నెరవేర్చేది. స్వామివారి అన్నప్రసాద సేవన సర్వపాపహరణం. “మేఘానంద ప్రాకారం” లో ఉన్న రసోయి ఘరో (ప్రాఠశాల) లో, నవనీత చోరుని నివేదన నిమిత్తం, నవకాయ పిండి వంటలు మందిరరాణి శ్రీ మహాలక్ష్మి ఆధ్వర్యంలో జరుగుతాయి. రోజులో అయిదు సార్లు, మూలవిరాట్టులకు, పరివార దేవతలకు నివేదనలు పెడతారు. వాటిలో మధ్యాహ్నం “కోతో భోగో” లేదా “అబద” ముఖ్యమైనది. అన్నం, కూరలు, పప్పు, పచ్చడి, పాయసం లాంటి పదార్థాలు నివేదనలో ఉంటాయి.

యాభై ఆరు రకాల వంటలు

మహాప్రసాదంగా పిలవబడే ఈ నివేదనలో సమర్పించే యాభై ఆరు రకాల వంటలను, ప్రాంగణంలో ఉన్న గంగా, యమున అని పిలిచే పవిత్ర బావుల నీటితో తయారు చేస్తారు. ఈ కార్యక్రమం ప్రపంచంలో మరెక్కడా చూడని విధానంలో ఉంటుంది. ఏడు కుండలను ఒకదాని మీద ఒకటి పేర్చి, పొయ్యి పైన ఉంచుతారు. చిత్రంగా అన్నిటికన్నా పైన ఉన్న చిన్న కుండలోని పదార్థాలు ముందుగా ఉడుకుతాయి.

చివరగా, అన్నిటికన్నా కింద ఉన్న పెద్ద కుండలోని పదార్థాలు ఉడుకుతాయి. వంటలో ఏ విధమైన అపవిత్రత తొంగిచూసినా, వంటశాల వెలుపల కుక్క తాలూకు నీడ కనిపిస్తుందట. దాంతో శ్రీ మహాలక్ష్మిఆగ్రహిస్తారని భావించి, వండిన పదార్థాలను భూస్థాపితం చేసి, తిరిగి వంట చేస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

సుదర్శన చక్రం

శ్రీ జగన్నాథుడు కొలువైన శ్రీమందిరం అనేక ప్రత్యేకతలకు, విశేషాలకు కేంద్రం. ఆలయ విమాన శిఖరంపై కనిపించే అష్టధాతువులతో చేసిన వెయ్యి కిలోల బరువు కలిగిన “నీల చక్ర” (సుదర్శన చక్రం), ఆ రోజులలో అంత పైకి ఎలా చేర్చారో తెలియడం ఆశ్చర్యం కలిగిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

గుండిచా మందిరం:

శ్రీమందిరం నుండి శ్రీ జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవతలు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా మందిరానికి వెళతారు. అక్కడ తొమ్మిది రోజులు గడిపి తిరిగి శ్రీక్షేత్రం చేరుకుంటారని తెలిపారు.

నంది ఘోష:

శ్రీ జగన్నాథుడు ప్రయాణించే రథాన్ని “నంది ఘోష” అని పిలుస్తారు. ఇది నలభై నాలుగున్నర అడుగుల ఎత్తు, పదహారు చక్రాలతో ఉంటుంది. ఎరుపు, పసుపు వస్త్రాలతో అలంకరిస్తారు.

తాళధ్వజ:

నలభై మూడు అడుగుల ఎత్తు కలిగిన తాళధ్వజ రథాన్ని ఎరుపు, నీలి వస్త్రాలతో అలంకరిస్తారు.

దర్పదళన:

సుభద్రా దేవి ప్రయాణించే రథాన్ని “దర్పదళన” అని పిలుస్తారు. దీనిని నలుపు, ఎరుపు వస్త్రాలతో అలంకరిస్తారు. దర్పదళన చివరగా బయలుదేరుతుంది.

రత్నబేది నుండి బలభద్ర, జగన్నాథ, సుభద్ర విగ్రహాలను సబర రాజు విశ్వావసు వంశానికి చెందినవారే వెలుపలికి తీసుకువచ్చే అధికారం కలిగి ఉంటారు. సుమారు వందమంది చొప్పున, అంచెలంచెలుగా ఒక విగ్రహాన్ని నిర్దేశిత రథాలపై చేర్చేటప్పటికి సాయంత్రం అవుతుంది. దేశ విదేశాల నుండి వచ్చిన లక్షలాది భక్తులతో కిటకిటలాడుతుంది.

భక్తిగీతాలు, నామసంకీర్తనలు, భజనలు ప్రాంతమంతా హోరెత్తిస్తాయి. నాలుగు దిశలకీ ఆధ్యాత్మిక పరిమళం వ్యాపిస్తుంది. ముగ్గురు ఆర్చామూర్తులు ఉపస్థితులైన తరువాత పూరీ రాజు విచ్చేస్తారు. స్వర్ణపిడి కలిగిన చీపురుతో శుభ్రం చేసి, కస్తూరి కళ్ళాపి జల్లిస్తారు. హారతి ఇచ్చాక రథాలు గుండిచా మందిరానికి బయలుదేరుతాయి.

మొదట నందిఘోష కదిలినా, అగ్రస్థానం అగ్రజునిదే. ముందు తాళధ్వజ, వెనుక దర్పదళన, చివరగా నందిఘోష భక్తుల జయజయధ్వానాల మధ్య బయలుదేరిన రథాలు, మూడుకిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా మందిరానికి చేరేటప్పటికి మరుసటి రోజు తెల్లవారుతుంది. అప్పటికీ భక్తుల కోలాహలం రెండింతలు అవుతుంది. జగన్నాథుడు గుండిచా మందిరంలో బస చేసే సమయంలో వంటశాల కూడా అక్కడికి చేరుకుపోతుంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ -9494981000

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe