సత్యమే నారాయణ స్వరూపం.. శ్రీ సత్య నారాయణ స్వామి వ్రత మహిమ తెలుసుకోండి!

ఏ శుభకార్యం జరిగినా సత్యనారాయణ వ్రతం ఆచరించడం మన ఆనవాయితీ. ఇది దేశమంతటా ఉంది. దక్షిణాదిలోనే కాదు, ఉత్తరాదిలో కూడా ఇది ప్రసిద్ధి. సత్యనారాయణ వ్రతం సర్వదేవతా సమన్వయాన్ని సూచించేది. శ్రీ సత్య నారాయణ స్వామి వ్రత మహిమ గురించి తెలుసుకోండి. 

Published on: May 30, 2025, 16:30:04 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link
ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం అత్యంత ప్రాచీనం. స్కాందపురాణ రేవాఖండంలో ఉంది. ప్రతి ఇంటా ఇది సంప్రదాయం. ఏ శుభకార్యం జరిగినా సత్యనారాయణ వ్రతం ఆచరించడం మన ఆనవాయితీ. ఇది దేశమంతటా ఉంది. దక్షిణాదిలోనే కాదు, ఉత్తరాదిలో కూడా ఇది ప్రసిద్ధి.

ఇంత ప్రసిద్ధమైన స్వామి అన్నవర క్షేత్రంలో తరువాత వెలిశారు. క్షేత్రానికి పూర్వమే స్వామి అర్చన ఉంది. సత్యమే నారాయణ స్వరూపం. 'సత్యం' అంటే త్రికాలాల్లోనూ నశించని పరబ్రహ్మ. ఆ బ్రహ్మమే నారాయణుడు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తిప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

సత్యనారాణయ స్వామి వ్రతం

'సత్యనారాయణుని'కి హారతులు హిందీ భాషలో గానం చేస్తుంటారు. అక్కడ ఈ వ్రతం చాలా ప్రముఖంగా ఆచరిస్తున్నారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. సత్యనారాయణ వ్రతం సర్వదేవతా సమన్వయాన్ని సూచించేది. సత్యనారాయణ వ్రతం వైదిక పరంపరను అనుసరిస్తోంది.

సకల జగత్కారణమైన సచ్చిదానంద పరబ్రహ్మగా అభీష్టదేవతను ఆరాధిస్తూ, ఇతర దేవతలు కూడా ఆ ఇష్టదేవతకు భిన్నులు (వేరు) కావని భావించి అర్చించడం సనాతన వైదిక పరంపర. అలా ఆ పరబ్రహ్మను లక్ష్మీనారాయణ స్వరూపంగా భావిస్తూ, ఆయన కేంద్రంగా ఈ విశ్వచక్రం నిర్వహించబడుతోందని ఆరాధించే వ్రత విశేషం ఈ సత్యనారాయణ వ్రతం. సర్వదేవతలూ ఆయన శక్తి విశేషాలే అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

విశ్వచక్ర విజ్ఞానమంతా సత్యనారాయణ వ్రతంలో

సూర్యుని కిరణాలకూ, సూర్యునికీ భేదం లేనట్లే, పరబ్రహ్మ, సృష్టి, స్థితి, విశ్వవ్యవహారాలకై దాల్చిన పలు రూపాలు (దేవతలు) ఆయనకు భిన్నాలు కావు. అన్నీ ఆయన శక్తి విశేషాలే కనుక వాటికి నమస్కరించాలి. ఆ పరబ్రహ్మయే త్రిమూర్తులుగా, అష్టదిక్పాలకులుగా, నవ గ్రహాలుగా, వాటి అధిదేవతా ప్రత్యధిదేవతా స్వరూపాలుగా వ్యక్తమై ఈ విశ్వనిర్వహణ చేస్తున్నాడు. ఈ విశ్వచక్ర విజ్ఞానమంతా ఈ సత్యనారాయణ వ్రతంలో నిక్షిప్తం చేశారు.

తద్వారా మన సనాతన ధర్మ స్వరూపం, వైదిక విశ్వ విజ్ఞానం సామాన్యునికి కూడా అవగతం కావాలని పెద్దల ఉద్దేశ్యం. మనం ఒక్కసారి ఈ వ్రతాన్ని గమనిస్తే, పురాణకర్త అయిన వేదవ్యాసుడు అతి సామాన్యునికి కూడా మన దేవతా విజ్ఞానాన్ని, ప్రపంచ స్వరూపాన్ని అవగాహనలోకి అందించడంలో ఎంతటి చక్కని విధానాన్ని కల్పించాడో అర్థమౌతుంది.

మండప ఆరాధన ఎంతో విశిష్టమైనది

సత్యనారాయణవ్రతంలో 'మండప ఆరాధన' చాలా విశిష్టం. మధ్యలో కలశ స్థాపన. ఇది మన అచ్చమైన సంప్రదాయం. పాత్ర, జలం, పల్లవాలు, పూర్ణకలశం దేవతా విష్కరణకు, పంచభూతమయ ప్రకృతికి కేంద్రంగా ఉన్న పరమాత్మ శక్తికి సంకేతం. కేంద్రం నుంచి విస్తరించిన శక్తి వృత్తంగా (చక్రంగా) మారుతుంది. అలాగే పరబ్రహ్మశక్తి విశ్వచక్రంగా విస్తరించింది.

ఆ శక్తిశక్తులుగా బహువిధాలైంది. ఆ శక్తులే దిక్పాలక, గ్రహాది శక్తులుగా మనల్ని నడుపుతున్నాయి. విశ్వాన్ని నడిపే ఈ దేవతల వల్లనే మన జీవితచక్రం ప్రభావితమౌతోంది. వారందరినీ విడిగా చూడడం కాకుండా, ఏకపరతత్త్వం యొక్క అభివ్యక్తులుగా దర్శించాలని మహర్షుల ఉద్దేశ్యం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పరతత్త్వాన్ని 'సత్యనారాయణునిగా' (నారాయణః పరః – నారాయణ పరం బ్రహ్మ తత్త్వం) ప్రతిష్ఠిస్తారు. కలశ రూపంలో, ఒక తుండుగుడ్డ పరచి, దానిపై మంగళకరమైన బియ్యం, తమలపాకులు, పసుపు, కుంకుమలు ఏర్పరచి విశ్వచక్ర భావనను మన ముందు ప్రదర్శించే అద్భుత విజ్ఞాన ప్రక్రియ ఇది. దీని ద్వారా భావింపబడిన గ్రహదేవతలు, దిగ్దేవతలు వ్రతాచరణ చేసిన వారిని అనుగ్రహిస్తారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ప్రపంచమంతా మేధావులే ఉండరు. సామాన్య జనులలో శ్రద్ధను పుట్టించడానికే కథ. అంతేకాక, కథా సన్నివేశాల్లో మనకు తెలియని యజ్ఞ సంకేతాలు చాలా ఉన్నాయి. నోముల కథల్లో కూడా యజ్ఞ రహస్యాలుంటాయి. ఈ యుగంలో యజ్ఞాచరణకు కావలసిన దేశకాల పరిస్థితులు లేవు కనుక, సులభంగా యజ్ఞఫలం రావడానికి, సాధారణ మానవులు కూడా దేవతానుగ్రహం పొందడానికి పురాణాలలో ఆ సంకేతాలను నిక్షిప్తం చేశారు.

పురాణ కథలు కొన్ని యథాతథాలు, కొన్ని సంకేతాలు, కొన్ని గుణపాఠాల కోసం కల్పించిన ఉదాహరణలు. వాటి తేడాలను వివేకంతో, విచక్షణతో, పూర్వపరసంబంధ జ్ఞానంతో గమనించి సమన్వయించుకోవాలి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

సంకల్పంతో

ఈ కథలో నాలుగువర్ణాల వారూ ఉన్నారు. అందులో శ్రద్ధా లోపం ఉంటే భగవంతుడు క్షమించడన్నది గుణపాఠం. 'సత్యం' నారాయణ స్వరూపం. సంకల్పించుకున్న దానికి 'నిబద్ధత' ఉండాలి. దైవానుగ్రహం కోసం ఒక సంకల్పం చేసుకున్నాక, దాన్ని ఆచరించకపోతే సృష్టిలో ఉన్న విశ్వ నియమం ప్రకారం విపరీత ఫలితాలు ఏర్పడడం సహజం.

అది సత్యానికి ఏర్పడ్డ విఘాతానికి ఫలం. అదే కోపంగా ప్రతీకగా చెప్పారు. ఇది ఏ వ్రతంలోనైనా తప్పదు. మొక్కు తీర్చకపోతే శిక్షించేది ఆ దేవుడు కాదు. మనం నిర్లక్ష్యం చేసిన 'సత్యం'లోని శక్తి. ఆ సత్యమే భగవత్ స్వరూపం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ -9494981000

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More