Telugu Techie Killed USA : అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణ హత్య

అమెరికాలోని ఫిలడెల్ఫియాలో పార్ట్ టైమ్ పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న తెలంగాణకు చెందిన అన్షుల్ కుంచా దారుణ హత్యకు గురయ్యాడు.  నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించి దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.

Published on: Jun 7, 2026, 10:22:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telugu Techie Killed USA : అమెరికా వెళ్లిన తెలంగాణ యువకుడు అక్కడ దారుణ హత్యకు గురయ్యాడు. ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగం చేస్తూ…. అదనపు ఆదాయం కోసం పార్ట్ టైమ్ పని చేస్తున్న ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను దుండగులు దారుణంగా కాల్చిచంపారు.

అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణ హత్య  (representative image ) (image pixabay)
అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణ హత్య (representative image ) (image pixabay)

తెలంగాణలోని మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన అన్షుల్ కుంచా(28) అమెరికాలో ఓ ఎంఎన్సీ కంపెనీలో) ఉద్యోగం చేస్తున్నాడు. వీకెండ్స్ లో అదనపు సంపాదన కోసం ఆయన పార్ట్ టైమ్ పిజ్జా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసేవాడు. శనివారం రాత్రి అన్షుల్‌కు ఒక పిజ్జా డెలివరీ ఆర్డర్ వచ్చింది. అయితే అది ఒక పక్కా ప్లాన్ ప్రకారం వేసిన ఫేక్ ఆర్డర్ అని ఆయన ఊహించలేకపోయాడు.

ఆర్డర్ వచ్చిన అడ్రస్ ప్రకారం ఆయన ఒక నిర్మానుష్య ప్రాంతానికి పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లాడు. అన్షుల్ అక్కడికి చేరుకోగానే… అక్కడ ఉన్న గుర్తు తెలియని దుండగుడు ఒక్కసారిగా ఆయనపైకి కాల్పులు జరిపాడు. అన్షుల్ తలపైనే లక్ష్యంగా చేసుకుని ముఖంపై పలుమార్లు కాల్పులు జరిపి ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అన్షుల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

మిస్టరీగా హత్య…

అన్షుల్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… ఈ దాడిలో నిందితులు ఆయన దగ్గర ఉన్న ఎలాంటి వస్తువులను గానీ, నగదును గానీ దొంగిలించలేదు. అన్షుల్ ఒంటిపై ఉన్న బంగారు చైన్, ఫోన్, పర్సు అన్నీ అలాగే ఉన్నాయి. దీంతో ఈ హత్య వెనుక అసలు కారణాలు ఏంటనే దానిపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దాడి జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో వెనుక బ్యాగ్‌లు తగిలించుకుని, ముఖానికి మాస్క్‌లు ధరించిన ఇద్దరు సాయుధ గన్‌మెన్లు తిరుగుతున్నట్లు స్థానిక నివేదికల ద్వారా తెలిసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గతంలో కూడా అన్షుల్‌పై అమెరికాలో ఒకసారి దొంగతనం జరిగింది. అప్పట్లో కొందరు దుండగులు ఆయన చైన్, ఫోన్, నగదును లాక్కెళ్లారు. కానీ అప్పట్లో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. ఈసారి మాత్రం ప్రాణాలు తీయడమే లక్ష్యంగా ఈ దాడి జరగడం కలకలం రేపుతోంది.

చంపడానికే ట్రాప్ చేశారు: సోదరి తన్వి ఆవేదన

"మా తమ్ముడిని చంపడానికే ఆ పిజ్జా డెలివరీని ఒక వలగా ఉపయోగించారు. ఒక పాడుబడిన, నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్లి పిజ్జా ఇవ్వాలని అతనికి చెప్పారు. కానీ అది ఓ ఫేక్ ఆర్డర్ అని తర్వాత తెలిసింది. అక్కడ అసలు ఎవరూ లేరు. కేవలం మా తమ్ముడిని ప్రాణాలతో ముగించాలనే ఉద్దేశంతోనే ఈ ప్లాన్ చేశారు. అతడిని చంపి వాళ్లు ఏం సాధించారో, వాళ్ల ఉద్దేశం ఏంటో మాకు అర్థం కావడం లేదు. మా తమ్ముడిని మాకు కాకుండా చేశారు," అని అన్షుల్ సోదరి తన్వి కన్నీరుమున్నీరైంది.

తన సోదరుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకురావాలని ఆమె ప్రభుత్వ అధికారులను వేడుకుంది. "మా తమ్ముడు అందరితో ఎంతో ప్రేమగా, సంతోషంగా ఉండేవాడు. అమెరికాకు వెళ్లి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. ఒక నకిలీ పిజ్జా డెలివరీ రిక్వెస్ట్ ద్వారా అతడిని ట్రాప్ చేసి కాల్చిచంపారని తెలిసి మేము తట్టుకోలేకపోతున్నాము. మా ఒకే ఒక్క అభ్యర్థన ఏంటంటే, అతని మృతదేహాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇండియాకు రప్పించేలా చూడాలి," అని ఆమె విజ్ఞప్తి చేసింది.

సోమవారం నాటికి మృతదేహాన్ని అప్పగించే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెప్పారని…. అయితే ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, అంత్యక్రియలు జాప్యం లేకుండా నిర్వహించుకునేలా సాయం చేయాలని కోరింది. తమకు ఎవరిపైనా వ్యక్తిగత అనుమానాలు లేవని, కానీ ఈ ఘాతుకానికి ఒడిగట్టిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేసింది.

ఈ దారుణ ఘటనపై న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ స్పందించింది. స్థానిక అమెరికన్ అధికారులు మరియు బాధిత కుటుంబంతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని… కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్నామని ప్రకటించింది. "

ఫిలడెల్ఫియాలో భారత పౌరుడైన అన్షుల్ కుంచా అకాల మరణం చెందడం మాకు తీవ్ర విచారాన్ని కలిగించింది. ఈ కష్టసమయంలో అతని కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. భారత కాన్సులేట్ అన్షుల్ కుటుంబంతో టచ్‌లో ఉంది, అన్ని విధాలా అండగా ఉంటుంది," అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (X) లో భారత రాయబార కార్యాలయం పేర్కొంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More