Siddipet Car Accident : సిద్దిపేట జిల్లాలో అర్ధరాత్రి వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు, తిరిగి వస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పసిపిల్లలు కూడా ఉండటంతో స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.

దుబ్బాక మండలం బల్వంతాపూర్‌కు చెందిన దండుగుల రాజు (30) ఇసుక వ్యాపారం చేస్తున్నారు. ఆయన తన భార్య భాగ్య (25), కుమారుడు నిహాన్ష్ (4), కుమార్తె శాన్విక (2)తో కలసి సిద్దిపేటలో జరిగిన ఒక బంధువు దశ దినకర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అర్థరాత్రి వేళ స్వగ్రామానికి కారులో బయలుదేరారు.
వాహనం దుబ్బాక మండలం అప్పన్నపల్లి శివారుకు చేరుకోగానే ఊహించని ప్రమాదం జరిగింది. రాజు తోలుతున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న ఒక లోతైన బావిలోకి దూసుకెళ్లింది. అర్ధరాత్రి కావడం, ఆ ప్రాంతంలో జనసంచారం లేకపోవడంతో ప్రమాదం జరిగిన విషయాన్ని మొదట్లో ఎవరూ గుర్తించలేకపోయారు.
క్రేన్ సాయంతో కారు బయటకు….
కొంత సమయం తర్వాత గమనించిన స్థానిక గ్రామస్థులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది క్రేన్, జేసీబీ సాయంతో తీవ్ర శ్రమకోర్చి బావిలో మునిగిపోయిన కారును బయటకు తీశారు.
కారు లోపల ఉన్న రాజు, భాగ్యలతో పాటు వారిద్దరి చిన్నారులు నిహాన్ష్, శాన్వికలు నీటిలో మునిగి అక్కడికక్కడే ఊపిరాడక మరణించారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాకలోని 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు…. ముఖ్యంగా ఇద్దరు చిన్న పిల్లలు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో బల్వంతాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
{{/usCountry}}ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు…. ముఖ్యంగా ఇద్దరు చిన్న పిల్లలు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో బల్వంతాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
{{/usCountry}}