కేసు కొట్టేసేలా చేసేందుకు బేరసారాలు - ఏసీబీకి చిక్కిన పెద్దపల్లి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్

పెద్దపల్లి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దొంకెన రవీందర్, మధ్యవర్తి రాజయ్య రూ. 1.50 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ధర్మారం పోలీస్ స్టేషన్ కేసులో నిందితులకు అనుకూలంగా సాక్షులను విచారించేందుకు లంచం డిమాండ్ చేశారు.

Published on: Nov 18, 2026, 18:20:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

న్యాయస్థానంలో బాధితుల పక్షాన నిలబడి నిందితులకు శిక్ష పడేలా చేయాల్సిన ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. పెద్దపల్లి జిల్లా ప్రధాన, సెషన్స్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా (టెన్యూర్) పనిచేస్తున్న దొంకెన రవీందర్ (58)….. ఆయనకు సహకరించిన ప్రైవేట్ వ్యక్తి రెడ్డిరాజుల రాజయ్యలను కరీంనగర్ ఏసీబీ బృందం బుధవారం (నవంబర్ 18, 2026) అరెస్ట్ చేసింది. ఫిర్యాదుదారుడి నుంచి రూ. 1,50,000 లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా అధికారులు వీరిని పట్టుకున్నారు.

ఏసీబీ వలలో పెద్దపల్లి పబ్లిక్ ప్రాసిక్యూటర్
ఏసీబీ వలలో పెద్దపల్లి పబ్లిక్ ప్రాసిక్యూటర్

కేసు కొట్టేసేలా చేసేందుకు బేరసారాలు….

పెద్దపల్లి పట్టణంలోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ దొంకెన రవీందర్ నివాసంలో ఈ ట్రాప్ ఆపరేషన్ జరిగింది. ధర్మారం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 12/2023 కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ దశలో ఉంది. ఈ కేసులో నిందితులకు అనుకూలంగా సాక్షులను విచారించి, చివరకు కేసు నిర్దోషిగా (అక్విట్టల్) ముగిసేలా అధికారిక సహాయం చేసేందుకు రవీందర్ లంచం డిమాండ్ చేశారు. మొదట ఈ పని చేసిపెట్టేందుకు రవీందర్ రూ. 2,00,000 లంచం అడిగారు. అంత మొత్తం ఇచ్చుకోలేనని ఫిర్యాదుదారుడు ప్రాధేయపడటంతో, చివరకు రూ. 1,50,000 ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఈ డబ్బును ప్రైవేట్ వ్యక్తి రెడ్డిరాజుల రాజయ్య (ఏ-2) ద్వారా రవీందర్ స్వీకరిస్తుండగా కరీంనగర్ ఏసీబీ యూనిట్ అధికారులు దాడి చేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించగా, మధ్యవర్తి రాజయ్య ధరించిన ప్యాంటు ఎడమ వైపు జేబులో నుంచి రూ. 1,50,000 లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రాజయ్య కుడి, ఎడమ చేతి వేళ్లకు నిర్వహించిన రసాయన పరీక్షల్లో (కెమికల్ టెస్ట్) పాజిటివ్ ఫలితం వచ్చింది. తన అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ, అక్రమ లబ్ధి పొందేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిజాయితీ లేకుండా వ్యవహరించారని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

నిందితులు దొంకెన రవీందర్ (ఏ-1), రెడ్డిరాజుల రాజయ్య (ఏ-2)లను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన అధికారులు…. కరీంనగర్‌లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. చట్టప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా వాట్సాప్ నంబర్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@Telangana ACB) వేదికల ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన బహిరంగ ప్రదేశాల్లో ఏసీబీ క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేశామని, వాటిని స్కాన్ చేసి కూడా నేరుగా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల పేర్లు, ఇతర వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని తెలంగాణ ఏసీబీ స్పష్టం చేసింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More