ఇంటి నెంబర్ కోసం లంచం డిమాండ్ - ఏసీబీకి దొరికిపోయిన ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్

ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు ఏసీబీకి చిక్కాడు. ఇంటి నెంబర్ కేటాయింపు కోసం రూ. 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు… విచారణ జరుపుతున్నారు.

Published on: Nov 27, 2025 10:02 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గత కొంతకాలంగా అవినీతి అధికారుల విషయంలో తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇటీవలే కాలంలో చాలా మంది అధికారులు పట్టుబడిన ఘటనలు వెలుగు చూశాయి. నిత్యం ఏదో ఒక చోట అవినీతి అధికారులు దొరికిపోతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా మున్సిపల్ కమిషనర్ రాజుతో అతని ప్రైవేట్ డ్రైవర్ అడ్డంగా దొరికిపోయారు.

తెలంగాణ ఏసీబీ
తెలంగాణ ఏసీబీ

ఇంటి నెంబర్ కోసం….

ఏసీబీ అధికారులు విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం…. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పురపాలక పరిధిలో ఓ వ్యక్తి బహుళ అంతస్తు ఇంటి నిర్మాణం చేసుకున్నాడు. ఇంటి నెంబర్ కోసం అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం కమిషనర్ రాజు రూ.20 వేలు డిమాండ్ చేయగా… దరఖాస్తుదారుడు ఏసీబీని ఆశ్రయించాడు.

పకడ్బందీగా రంగంలోకి దిగిన అధికారులు… ఫిర్యాదుదారుడి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా భూమేశ్ (కమిషనర్ ప్రైవేట్ డ్రైవర్) పట్టుబడ్డారు. లంచం డబ్బులతో పాటుగా భూమేష్ వద్ద లెక్కలు తెలుపని నగదు రూ.4,30,000/- కలిగి ఉన్నట్లు అనిశా అధికారులు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు… కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఏ ప్రభుత్వాధికారి అయినా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. అవినీతి నిరోధక శాఖ "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని తెలిపారు. అంతే కాకుండా వివిధ సామాజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) లేదా వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంచుతామని వివరించారు.

News/Telangana/ఇంటి నెంబర్ కోసం లంచం డిమాండ్ - ఏసీబీకి దొరికిపోయిన ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్
News/Telangana/ఇంటి నెంబర్ కోసం లంచం డిమాండ్ - ఏసీబీకి దొరికిపోయిన ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్