Raidurgam Hit and Run Case : హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ - ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్!

Raidurgam Hit and Run Case : హైదరాబాద్‌లోని రాయదుర్గం వద్ద జరిగిన హిట్ అండ్ రన్ కేసులో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు.

Published on: Sep 1, 2026, 18:34:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Raidurgam Hit and Run Case : హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన హిట్ అండ్ రన్ కేసులో సైబరాబాద్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు రోటరీ సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ప్రముఖ టాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను రాయదుర్గం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వేగంగా వచ్చిన ఆటోమొబైల్ వాహనంతో ఢీకొట్టడంతో…. ఒకరి మృతితో పాటు మరొకరు తీవ్రంగా గాయపడటానికి కారణమైనందుకు సందీప్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు.

హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్: ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడి అరెస్ట్!
హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్: ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడి అరెస్ట్!

అసలేం జరిగింది…?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 31, 2026 నాడు తెల్లవారుజామున 4:15 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఖాజాగూడలోని అంకుర ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఈ సంఘటన చోటుచేసుకుంది.

సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక గుర్తుతెలియని పాదాచారి (బాటసారి) అంకుర ఆసుపత్రి వైపుగా రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో నానక్‌రామ్‌గూడ ఓఆర్ఆర్ రోటరీ వైపు నుంచి ఖాజాగూడ దిశగా అతివేగంగా… నిర్లక్ష్యంగా వచ్చిన ఇన్నోవా క్రిస్టా వాహనం (నంబర్ TS09EW7700) ఆ పదాచారిని బలంగా ఢీకొట్టింది.

ప్రమాదం జరిగిన వెంటనే, మానవత్వంతో స్పందించిన ఇన్నోవా డ్రైవర్ జైద్‌షా ఖాద్రీ (21), మరొక వ్యక్తి కలిసి… తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే సరిగ్గా అదే సమయంలో ఖాజాగూడ వైపు నుంచి నానక్‌రామ్‌గూడ ఓఆర్ఆర్ రోటరీ వైపు అతివేగంగా దూసుకొచ్చిన రెండు వేర్వేరు కార్లు…. రోడ్డుపై ఉన్న పాదాచారితో పాటు అతనికి సాయం చేస్తున్న ఇన్నోవా డ్రైవర్ జైద్‌షా ఖాద్రీని కూడా బలంగా ఢీకొట్టి ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాయి.

ఈ ప్రమాదంలో పాదాచారి తీవ్రమైన శరీర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇన్నోవా డ్రైవర్ జైద్‌షా ఖాద్రీ కుడి కాలు విరిగిపోవడంతో పాటు శరీరమంతా తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న రాయదుర్గం పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పరారైన వాహనాలను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో ఈ ఘోర ప్రమాదానికి కారణమైన వాహన చోదకుడిని ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌గా గుర్తించారు.

"ప్రమాదానికి కారణమైన నిందితుడు సందీప్‌ను మేము అదుపులోకి తీసుకున్నాం. ఆయన వినియోగించిన మహీంద్రా XUV ఎలక్ట్రిక్ కారును కూడా సీజ్ చేశాం. ఈ హిట్ అండ్ రన్ వ్యవహారంపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతున్నాం," అని రాయదుర్గం పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి న్యాయపరమైన చర్యలు చేపడుతున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More