...
...
Next Story

ఆన్ డ్యూటీ అని సంతకాలు.. ఫామ్‌హౌస్‌లో పోలీసుల మందు పార్టీ, వేటు వేసిన సీపీ!

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసుల నిర్వాకం కలకలం రేపింది. స్టేషన్ రికార్డుల్లో ఆన్ డ్యూటీ అని నమోదు చేసి, ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీలో చిందులేశారు. వీడియోలు వైరల్ కావడంతో 14 మందిపై సీపీ అంబర్ కిషోర్ ఝా చర్యలు తీసుకున్నారు.

Published on: Nov 18, 2026, 12:41:35 IST
Advertisement

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే విధులకు డుమ్మా కొట్టి ఫామ్‌హౌస్‌లో మద్యం మత్తులో చిందులేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపింది. స్టేషన్ రికార్డుల్లో తాము ఆన్‌డ్యూటీలో ఉన్నట్లు సంతకాలు చేసిన కొందరు కానిస్టేబుళ్లు, విధులకు హాజరు కాకుండా ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ ఆటపాటలతో పాటు మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంలో మొత్తం 14 మంది సిబ్బందిపై రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కొరడా ఝళిపించారు.

ఆన్ డ్యూటీ పేరుతో….

representative image (Image Pixel)
representative image (Image Pixel)

బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఒక కానిస్టేబుల్ పుట్టినరోజు వేడుకలు ఆదివారం (నవంబర్ 15) జరిగాయి. ఈ వేడుకలకు అదే స్టేషన్‌కు చెందిన 14 మంది పోలీసులు హాజరయ్యారు. అయితే, వీరిలో కొందరు సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. పోలీస్ స్టేషన్‌లోని రికార్డుల్లో తాము విధి నిర్వహణలో (ఆన్‌డ్యూటీ) ఉన్నట్లు సంతకాలు చేశారు. ఆ తర్వాత స్టేషన్ విధులకు దూరంగా, ఊరికి అవతల ఉన్న ఒక ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. అక్కడ సహచర కానిస్టేబుల్ బర్త్‌డే పార్టీలో భాగంగా ఆటపాటలతో చిందులు వేశారు. కొందరు మద్యం మత్తులో డ్యాన్సులు చేస్తూ హల్‌చల్ చేశారు.

ఫామ్‌హౌస్ పార్టీలో పోలీసులు ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలను అక్కడే ఉన్నవారు వీడియోలు తీశారు. అవి కాస్తా సామాజిక మాధ్యమాల్లో (సోషల్ మీడియా) పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయ్యాయి. శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన ఖాకీలే ఇలా విధులను గాలికొదిలేసి మందు పార్టీలు చేసుకోవడంపై స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన సిబ్బంది ఇలా ప్రవర్తించడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా దృష్టికి వెళ్లాయి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆయన…. తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించి, క్రమశిక్షణ ఉల్లంఘించిన ఐదుగురు కానిస్టేబుళ్లను తక్షణమే కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా, ఈ పార్టీలో పాల్గొన్న మరో తొమ్మిది మంది పోలీస్ సిబ్బందిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఈ చర్యల ద్వారా సీపీ గట్టి హెచ్చరిక పంపారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks