భూపాలపల్లిలో ఘోరం - వాహనాలు తనిఖీ చేస్తున్న DTOపైకి దూసుకెళ్లిన టిప్పర్, అక్కడికక్కడే మృతి!
Bhupalpally DTO Venkanna Road Accident : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వాహనాలు తనిఖీ చేస్తున్న జిల్లా రవాణా అధికారి (DTO) వెంకన్నపైకి బొగ్గు టిప్పర్ దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Bhupalpally DTO Venkanna Road Accident : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం అత్యంత విషాదకరమైన ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విధి నిర్వహణలో భాగంగా రోడ్డుపై వాహనాలను తనిఖీ చేస్తున్న జిల్లా రవాణా అధికారి (DTO) వెంకన్నను ఒక బొగ్గు టిప్పర్ బలితీసుకుంది. ఈ ప్రమాదంలో ఆయన శరీరం నుజ్జునుజ్జయి తీవ్ర క్షతగాత్రుడిగా మారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పరకాల - భూపాలపల్లి ప్రధాన రహదారిపై ఉన్న జిల్లా రవాణా అధికారి కార్యాలయం ముందే ఈ దారుణం జరిగింది. రవాణా శాఖకు చెందిన సిబ్బందితో కలిసి డీటీఓ వెంకన్న కార్యాలయం ముందు రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పరకాల వైపు నుంచి భూపాలపల్లి వైపు వస్తున్న ఒక బొగ్గు టిప్పర్ అతివేగంగా దూసుకొచ్చింది. అధికారులు ఆపేందుకు ప్రయత్నించే లోపే, అదుపుతప్పిన ఆ టిప్పర్ నేరుగా డీటీఓ వెంకన్నపైకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వేగానికి ఆయన శరీరం పూర్తిగా నలిగిపోయింది.
15 రోజుల క్రితమే బదిలీ……
మరణించిన డీటీఓ వెంకన్న కేవలం 15 రోజుల క్రితమే బదిలీపై భూపాలపల్లి జిల్లాకు బాధ్యతలు చేపట్టేందుకు వచ్చారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించి, జిల్లాలో రవాణా నిబంధనలను పటిష్టం చేసేందుకు క్షేత్రస్థాయిలోకి దిగిన కొద్దిరోజుల్లోనే ఇలా లారీ రూపంలో మృత్యువు దూసుకురావడం రవాణా శాఖ అధికారులను, సిబ్బందిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణవార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన తోటి సిబ్బంది, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి, వెంకన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బొగ్గు టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందా లేక బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్ల జరిగిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
విచారణకు ఆదేశించాం - మంత్రి పొన్నం
ఈ ప్రమాదంపై రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. “వెంకన్న భూపాలపల్లి రవాణా శాఖ కార్యాలయం వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో టిప్పర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు . ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించడం జరిగింది. వెంకన్న మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం . వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. విధినిర్వహణ లో మృతి చెందిన వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది” అని మంత్రి ప్రకటన చేశారు.
సమగ్ర విచారణ జరిపించాలి - హరీశ్ రావ్ డిమాండ్
ఈ ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావ్ స్పందించారు. “ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా? భూపాలపల్లి డీటీఓ వెంకన్న ప్రమాదం వెనుక దాగిన నిజాన్ని వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా వివరాలను బయటపెట్టాలి. డీటీఓ వెంకన్న మరణం వెనుక ఉన్న వాస్తవాలను ప్రజల ముందుంచాలి. సమగ్ర విచారణ జరిపి దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

