Hyderabad : జూబ్లీహిల్స్‌లోని పబ్‌లో అర్ధరాత్రి రచ్చ - రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ, సీన్ లో ఎంపీ సోదరుడు..!
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఒక పబ్‌లో ఆదివారం అర్ధరాత్రి రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కుర్చీలు, బాటిళ్లతో దాడులు చేసుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సోదరుడు అక్కడ ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ లో ఆదివారం రాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మద్యం మత్తులో ఇరువర్గాల వారు పరస్పరం కుర్చీలు, బీరు బాటిళ్లతో దాడులు చేసుకోవడంతో పబ్ వాతావరణం ఒక్కసారిగా భయానకంగా మారింది. ఈ ఘర్షణ ఘటనపై జుబ్లీహిల్స్ పోలీసులు మొత్తం మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం… కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సోదరుడు అరవింద్ కుమార్ యాదవ్ కూడా ఈ ఘటన జరిగిన సమయంలో అదే పబ్‌లో ఉన్నారు. ఎంపీ సోదరుడి సమక్షంలోనే ఇరువర్గాలు మాటమాటా పెరిగి భౌతిక దాడులకు దిగడం నగరంలో తీవ్ర కలకలం రేపింది. పబ్‌లో ఉన్న మిగతా కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. ఈ దాడులకు సంబంధించిన దృశ్యాలను అక్కడున్న కొందరు తమ ఫోన్లలో చిత్రీకరించగా, ఆ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
మూడు కేసులు నమోదు….
ఈ ఘటనపై జుబ్లీహిల్స్ పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. రచ్చ సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు గాను రెండు వర్గాలపైనా పోలీసులు సుమోటోగా మొదటి కేసు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశంలో ఘర్షణకు దిగడం, గొడవ సృష్టించడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద వీరిపై చర్యలు తీసుకుంటున్నారు.
రెండో కేసు ఒక బాధితుడి ఫిర్యాదు ఆధారంగా నమోదైంది. గొడవ జరిగిన అనంతరం వసీమ్ ఖాన్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి కారులో ఇంటికి బయలుదేరుతుండగా, పబ్ పార్కింగ్ ప్రాంతంలో కొంతమంది వారి వాహనాన్ని అడ్డుకున్నారు. వారిపై తీవ్రస్థాయిలో దాడి చేయడమే కాకుండా, కారును ధ్వంసం చేశారని వసీమ్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై దాడి, ఆస్తి నష్టం కింద మరో కేసు నమోదు చేశారు.
ఇక మూడో కేసును సదరు పబ్ యాజమాన్యంపై పోలీసులు నమోదు చేశారు. అనుమతించిన వేళల కంటే మించి పబ్‌ను నిర్వహించడమే కాకుండా, వేళల పొడిగింపునకు ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదని అధికారులు గుర్తించారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా వ్యాపారం సాగించిన 'కారా కారా పబ్' (Cara Cara Pub) యాజమాన్యంపై ప్రత్యేకంగా కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీస్ అధికారి వెల్లడించారు.
ఘటనకు సంబంధించిన దృశ్యాలను, సీసీటీవీ ఫుటేజీని సేకరిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

