కేసీఆర్, కేటీఆర్ అవినీతిపై చర్చించి వారిని కిషన్ రెడ్డి జైల్లో పెట్టించాలి : రేవంత్ రెడ్డి

పదేళ్లు బీజేపీ - బీఆర్ఎస్ కలిసి చేయలేని అభివృద్ధి నేడు ప్రజా పాలనతో సాధ్యం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ర రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ మాదిరిగా జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు.

Published on: Nov 6, 2025, 05:55:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా యూసుఫ్‌గూడ, మలక్‌పేటలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు. చెక్ పోస్టు వద్ద కార్నర్ మీటింగ్‌‌లో మాట్లాడారు. నాటి పాలకులు సినీ ప్రముఖులతో సావాసం చేస్తే... నేను సినీ కార్మికుల సంక్షేమం ఆలోచిస్తున్నానని చెప్పారు. మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను సంక్షేమ రాజ్యంతో నెరవేర్చుతున్నామన్నారు. పదేళ్లు బీజేపీ - బీఆర్ఎస్ కలిసి చేయలేని అభివృద్ధి నేడు ప్రజా పాలనతో సాధ్యం చేస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ మాదిరిగానే జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు..

ప్రచారంలో రేవంత్ రెడ్డి
ప్రచారంలో రేవంత్ రెడ్డి

'మైనారిటీల పక్షపాతి కాంగ్రెస్ అన్న సత్యాన్ని గుర్తు చేశాను. ఈ దేశంలో లౌకిక, ప్రజాస్వామ్య వాతావరణాన్ని ప్రతిష్ఠించి, దానిని శాశ్వతంగా నిలబెట్టింది కాంగ్రెస్. రాహుల్ గాంధీ, నేనూ ఒక వైపు... మోదీ, కేసీఆర్ ఒక వైపు ఉన్నాం. ఈ ఎన్నిక ఉప ఎన్నికే కావచ్చు. కానీ, బీజేపీ - బీఆర్ఎస్ చీకటి స్నేహాలు, మైనారిటీలపై కుట్రలను ఛేదించేందుకు ఇది ఒక అవకాశం. నగరాభివృద్ధికి, అన్నీ వర్గాల గౌరవానికి, సమాన అవకాశాల కల్పనకు ప్రజా ప్రభుత్వం చేపట్టిన బృహత్తర ప్రణాళికల అమలుకు జూబ్లీహిల్స్ గెలుపు ఒక ప్రోత్సాహకం కావాలి. కుల, మతాలకు అతీతంగా జూబ్లిహిల్స్ నిర్ణయం తీసుకోవాలి.' అని రేవంత్ రెడ్డి అన్నారు.

షేక్‌పేటలో కూడా రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్‌లో మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు కట్టకూడదో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి అడిగారు. సవాల్ విసిరితే కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే.. బీజేపీకి, కిషన్ రెడ్డి వచ్చిన ఇబ్బంది ఏంటని అడిగారు. మోదీ, కేసీఆర్ ఒక్కటేనని.. ముస్లింలను బీఆర్ఎస్ మోసం చేస్తోందన్నారు.

'కేసీఆర్, కేటీఆర్ అవినీతిపై మాట్లాడితే.. ఆరు గ్యారంటీలపై చర్చకు రావాలని కిషన్ రెడ్డి కోరుతున్నారు. నా వద్దకు కాదు. దిల్లీకి వెళ్లి కాళేశ్వరం అవకతవకలపై మోదీ, అమిత్ షాలతో చర్చించి.. కేసీఆర్, కేటీఆర్‌ను జైల్లో పెట్టించాలి. గుజరాత్‌లోని సబర్మతి నదిలా మూసీ అభివృద్ధి కావొద్దా? మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి, రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లకు నిధులు రాకుండా కిషన్ రెడ్డి ఎందుకు అడ్డు పడుతున్నారు.' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీకి హిందువులు, ముస్లింలు రెండు కళ్లు అని రేవంత్ రెడ్డి అన్నారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఎన్నికలు వచ్చాయయని ఇవ్వలేదు.., ఆయన సమర్థత ఆధారంగానే ఇచ్చామన్నారు. క్రీడాకారులు సిరాజ్, నిఖత్ జరీన్‌లకు డీఎస్పీ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. ముస్లిం మైనార్టీలను అక్కున చేర్చుకున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More