తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్ వచ్చేసింది. వచ్చే ఏడాది నిర్వహించబోయే ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. కీలకమైన ఇంజినీరింగ్ ప్రవేశాలతో సహా ఇతర ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

ఈ ప్రవేశ పరీక్షల ఆధారంగా 2026-27 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రవేశ పరీక్షల ద్వారానే రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఇంజినీరింగ్, వ్యవసాయం, వైద్యం, న్యాయశాస్త్రం వంటి వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
మే 4 నుంచి 11 వరకు టీజీ ఈఏపీసెట్ - 2026 పరీక్షలు జరుగుతాయి.మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన పరీక్షలు ఉండగా… మే 9 నుండి 11వ తేదీ వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈసారి కూడా హైదరాబాద్ జేఎన్టీయూనే ఈఏపీసెట్ ప్రవేశ పరీక్ష బాధ్యతలను చూడనుంది.
మే 13, 14 తేదీల్లో టీజీ ఐసెట్ పరీక్షను నిర్వహిస్తారు. మే 15న ఈసెట్ పరీక్ష జరుగుతుంది. మే 18న లాసెట్, పీజీ ఎల్ సెట్ పరీక్షలంటాయి. మే 28 నుండి 31 వరకు పీజీ ఈసెట్ నిర్వహిస్తారు. టీజీ పీఈసెట్ పరీక్షలు మే 31 నుంచి షురూ అవుతాయి.
పైన పేర్కొన్న ప్రవేశ పరీక్షలన్నీ సీబీటీ విధానంలోనే నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు, సిలబస్ వివరాలను వేర్వురుగా విడుదల చేస్తారు. ఈ పరీక్షల నిర్వహణను వేర్వురు యూనివర్శిటీలు నిర్వహించనున్నాయి.
ప్రవేశ పరీక్షలో వచ్చే ర్యాంకు ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. ముందుగా ఫలితాలను ప్రకటించి కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుంది.ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తుంటారు. సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తారు.