వికారాబాద్ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడితో ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదని ఓ కుమార్తె…. ఏకంగా తల్లిదండ్రులను హత్య చేసింది. అప్పుల బాధతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకుని ఉంటారని తొలుత భావించినా.. పోలీసుల విచారణలో కుమార్తె బండారం బట్టబయలైంది. ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు బయటికొచ్చాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన సురేఖ నర్సింగ్ హోంలో నర్స్‌గా విధులు నిర్వహిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకుడితో రెండేళ్లుగా ప్రేమలో ఉంది. అయితే వేర్వురు కులాలు కావటంతో… తల్లిదండ్రులు వివాహనికి అంగీకరించలేదు. ఈ క్రమంలోనే మరో యువకుడితో సురేఖకు పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. దీంతో తల్లిదండ్రులపై కుమార్తె సురేఖ కక్ష పెంచుకుంది. ఎలాగైనా వాళ్లను అడ్డు తొలగించుకోవాలని భావించింది.
తాను పనిచేస్తున్న నర్సింగ్ హోం నుంచి పలు రకాల ఇంజెక్షన్లు తీసుకొచ్చింది. ఒళ్లు నొప్పులకు మందు అని చెప్పి ఎక్కువ డోసేజ్ మత్తు మందు కలిగిన ఇంజెక్షన్లు తల్లిదండ్రులకు ఇచ్చింది. తల్లిదండ్రులు మరణించిన అనంతరం…. ఇద్దరినీ ఇంట్లో ఒకే చోట పడుకోబెట్టింది.ఆ తర్వాత ఏమీ తెలియనట్లు సోదరుడు అశోక్‌కు ఫోన్ చేసి తల్లిదండ్రులు స్పృహ తప్పి పడిపోయారని చెప్పింది.
ఈ విషయంపై అన్న అశోక్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు… అక్కడ కొన్ని ఇంజెక్షన్లు గుర్తించారు. వెంటనే కుమార్తె తీరుపై అనుమానాలు బలపడగా… తమదైన శైలిలో పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో తానే హత్య చేశానని సురేఖ అంగీకరించింది.కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. జనవరి 24వ తేదీన ఈ ఘటన జరగగా… కుమార్తెనే తల్లిదండ్రులను హత్య చేసినట్లు తేలటంతో స్థానికంగా సంచలనంగా మారింది.