ఎల్‌ నినో ఎఫెక్ట్: ప్రత్యామ్నాయ పంటలే వైపు రైతులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం!

El Nino Effect : ఎల్ నినో ప్రభావంతో రుతుపవనాల అవకాశాలు బలహీనపడటంతో వర్షాలు కురుస్తాయన్న రైతుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. తగినంత వర్షపాతం లేకపోవడం, భూగర్భ జలమట్టాలు తగ్గిపోవడం వంటి కారణాలతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్తున్నారు.

Published on: Jul 19, 2026, 15:00:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో ఎల్‌ నినో ప్రభావం కారణంగా రుతుపవనాలు బలహీనపడటంతో ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో సకాలంలో భారీ వర్షాలు పడతాయని ఆశించిన రైతన్నల్లో ఆందోళన మొదలైంది. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు వేగంగా పడిపోతున్న భూగర్భ జలాల మట్టాలు రైతులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తక్కువ నీటితో ఎక్కువ లాభాలను ఆర్జించే స్థిరమైన, లాభదాయకమైన సాగు పద్ధతుల వైపు మళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఎల్ నినో ఎఫెక్ట్
ఎల్ నినో ఎఫెక్ట్

ఈ తీవ్ర నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రైతులను ఆదుకునేందుకు సరికొత్త ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రంగంలోకి దించింది. తక్కువ నీటి వినియోగంతో పాటు నాణ్యమైన, అధిక దిగుబడులను ఇచ్చే పంటలను ఎంచుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తోంది. ముఖ్యంగా ప్రతి ఏటా భారీగా నీటిని వినియోగించి వరి సాగు చేసే రైతులు.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తమ పంటల సరళిని మార్చుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే మొక్కజొన్న, సోయాబీన్, పత్తి పంటలను రైతులు విస్తృతంగా సాగు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బోరుబావులు, చెరువుల కింద వరి పండించే రైతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వరికి బదులుగా తక్కువ నీరు అవసరమయ్యే క్రాప్స్ వైపు మొగ్గు చూపాలని అధికారులు కోరుతున్నారు.

జూలై చివరి నాటికి ఒకవేళ పొలాల్లో లేదా బోరుబావుల్లో నీటి లభ్యత ఓ మోస్తరుగా ఉంటే, వరికి బదులు మొక్కజొన్న సాగు చేపట్టాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఆగస్టు నెలలో కూడా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదైతే.. నీటి ఎద్దడిని తట్టుకునే పప్పుధాన్యాల సాగు వైపు వెళ్లడం ఉత్తమమని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా పెసర్లు, కందులు, మినుములు వంటి పంటలను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాలని కోరుతున్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు నేరుగా గ్రామాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో రైతులను కలిసి ప్రస్తుత వాతావరణ పరిస్థితులను వివరిస్తున్నారు. తక్కువ నీటితో లాభాలు తెచ్చిపెట్టే పంటల మార్పిడి వ్యూహాలపై రైతులకు పూర్తిస్థాయిలో మార్గదర్శకత్వం అందిస్తున్నారు. ప్రకృతి సవాలు విసురుతున్న వేళ, రైతులు మొండిగా వరి సాగు వైపు వెళ్లకుండా, ప్రభుత్వ సూచనలు పాటించి ప్రత్యామ్నాయ పంటలతో ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More