బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసు - ఆర్మీ మాజీ ఉద్యోగి అరెస్ట్! ఏం జరిగిందంటే..?

Bollarum Madras Regiment Theft Case : బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ బెటాలియన్ నుంచి ఆయుధాల చోరీ కేసును పోలీసులు చేధించారు. మాజీ హవిల్దార్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. రికవరీ చేసిన ఆయుధాల వివరాలు ఇవే.

Published on: Sep 11, 2026, 18:19:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bollarum Madras Regiment Theft Case : సికింద్రాబాద్ బొల్లారంలో ఉన్న 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ నుంచి భారీ స్థాయిలో తుపాకులు, మందుగుండు సామగ్రి చోరీకి గురైన కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. ఈ దొంగతనానికి పాల్పడిన విశ్రాంత ఆర్మీ హవిల్దార్‌ను సెప్టెంబర్ 11న ప్రత్యేక బృందాలు అరెస్ట్ చేశాయని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

స్వాధీనం చేసుకున్న ఆయుధాలు
స్వాధీనం చేసుకున్న ఆయుధాలు

బొల్లారం పోలీసులు, హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్, మల్కాజ్‌గిరి కమిషనరేట్ ఎస్‌ఓటీ (SOT) బలగాలు సంయుక్తంగా ఈ నిఘా ఆపరేషన్‌ను చేపట్టి నిందితుడిని పట్టుకున్నాయి. అరెస్ట్ అయిన నిందితుడిని నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం జంగం రెడ్డి పల్లికి చెందిన ఉప్పుతోళ్ల మల్లేష్ (37)గా పోలీసులు గుర్తించారు. నిందితుడు 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్‌లో హవిల్దార్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందాడు.

పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం... మల్లేష్ 2010లో భారతీయ సైన్యంలో చేరి దాదాపు 16 సంవత్సరాల పాటు వివిధ ప్రాంతాల్లో సేవలు అందించాడు. 2026 జూన్ 30న ఈయన ఉద్యోగ విరమణ పొందాడు. అయితే త్వరితగతిన సైన్యం నుండి పదవీ విరమణ పొందాల్సి రావడం, దానివల్ల ఏర్పడిన తీవ్ర అసంతృప్తి, కోపమే ఈ దొంగతనానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.

తన ప్లాన్ ప్రకారం ఆగస్టు 30, 31 మధ్యరాత్రి సమయంలో దాదాపు 11:00 గంటల ప్రాంతంలో బోల్లారంలోని 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆవరణలోకి మల్లేష్ ప్రవేశించాడు. అక్కడున్న 'కోట్' గది, మ్యాగజైన్ రూమ్ తాళాలు తొలగించి, అత్యంత ఆధునిక ఆయుధాలు, భారీగా తుపాకీ గుళ్లను దొంగిలించి పరారయ్యాడు.

చోరీకి గురైన ఆయుధాల వివరాలు:

కోట్-హెచ్‌క్యూ, మ్యాగజైన్ గదుల నుంచి నిందితుడు దొంగిలించిన ఆయుధాల జాబితాను పోలీసులు విడుదల చేశారు. ఆ వివరాలు కింది విధంగా ఉన్నాయి…

  • 5 మ్యాగజైన్‌లతో కూడిన నాలుగు ఏకే-203 (7.62x39mm) రైఫిళ్లు
  • 3 మ్యాగజైన్‌లతో కూడిన ఒక 5.56mm ఇన్సాస్ (INSAS 1B1) రైఫిల్
  • 12 మ్యాగజైన్‌లతో కూడిన ఆరు 9mm ఆటో 1A పిస్టళ్లు
  • మ్యాగజైన్‌తో కూడిన ఒక సివిలియన్ 6.35-బోర్ పిస్టల్
  • ఒక పాసివ్ నైట్-విజన్ బైనాక్యులర్ (రాత్రి వేళ చూసే దుర్భిణి)
  • 9mm ఆటో 1A పిస్టల్‌కు చెందిన 1,156 రౌండ్ల సజీవ మందుగుండు సామగ్రి
  • ఏకే-203 రైఫిళ్లకు చెందిన 720 రౌండ్ల తూటాలు
  • 5.56mm ఇన్సాస్ తుపాకీకి చెందిన 11 బాల్ రౌండ్లు, 5 ట్రేసర్ రౌండ్లు మరియు 20 బ్లాంక్ రౌండ్లు

ఈ ఘటనపై మద్రాస్ రెజిమెంట్ అధికారుల నుండి ఫిర్యాదు అందగానే బొల్లారం పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 331(4), 305 కింద కేసులు నమోదు చేశారు. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏసీపీ స్థాయి అధికారి విచారణ బాధ్యతలను స్వీకరించారు.

పక్కా సమాచారం ఆధారంగా… బొల్లారం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మరియు మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ బృందాలు సంయుక్తంగా దాడి చేసి నిందితుడు మల్లేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన ఆయుధాలను నిందితుడు యాప్రాల్‌లోని కౌకూర్ వద్ద ఉన్న తన నివాసంలో మరియు నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని స్థావరంలో దాచిపెట్టినట్లు పోలీసులు కనుగొన్నారు. ఆయుధాలన్నింటినీ స్వాధీనం చేసుకున్న పోలీసులు…. సెప్టెంబర్ 11న మల్లేష్‌ను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More