ఓ గ్రామంలో ఆలయం ఉంది… అక్కడ పూజారి ఉంటాడు. అక్కడే ఉన్న ఖాళీ స్థలంలో పూలమొక్కలను పెంచాడు. కట్ చేస్తే అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే ఆశతో పూల మొక్కల మధ్యలో గంజాయిని కూడా సాగు చేశాడు. విషయం కాస్త పోలీసుల వరకు చేరటంతో…. ఎట్టకేలకు అయ్యగారి బాగోతం బయటపడింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది.

నారాయణకేడ్ మండలం పంచగావ్ గ్రామంలో నర్సయ్య మహారాజ్ అనే బాబా ఆలయంలో పూజారిగా పని చేస్తుంటాడు. ఆలయ ప్రాంగణంలో బంతి పూల సాగు చేస్తున్నట్లు నమ్మిస్తూ, వాటి మధ్యలో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా పూల మొక్కల మాటున ఈ అక్రమ దందాను సాగిస్తున్న నాగయ్యను టాస్క్ ఫోర్స్ బృందం అదుపులోకి తీసుకుంది. ఈ దాడుల్లో భారీగా గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.
సుమారు రూ.70 లక్షల విలువైన 17.741 కిలోల బరువు కలిగిన 685 గంజాయి మొక్కలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నర్సయ్య మహారాజ్ ను అరెస్ట్ చేయగా… పలువురు వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు వెల్లడించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఈ గంజాయిని ఎక్కడికి సరఫరా చేస్తున్నాడు…? దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూజారి ముసుగులో ఉంటే ఇలా చేయటంపై స్థానికులు విస్మయానికి గురవుతున్నారు.