ట్రాఫిక్ రూల్స్ పాటించండి లేదంటే లైసెన్స్ క్యాన్సిల్.. ఇక వేరే ఛాన్స్ లేదు!

ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొందరు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా కూడా ప్రమాదాలకు కారణం అవుతున్నారు. నిబంధనలు పాటించనివారిపై ఇకపై సీరియస్‌ యాక్షన్ ఉంటుంది. లైసెన్స్ రద్దు చేసేలా చర్యలు తీసుకుంటారు.

Published on: Nov 12, 2025 2:19 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో రాష్ట్ర పోలీసు శాఖ ట్రాఫిక్ ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు వేస్తోంది. పదే పదే ఉల్లంఘనలు చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే పాయింట్స్ సిస్టమ్‌ను కఠినంగా అమలు చేయడానికి అధికారులు ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఈ వ్యవస్థ కొంతకాలంగా అమలులో ఉన్నప్పటికీ చర్యలు పెద్గగా తీసుకున్నట్టుగా కనిపించ లేదు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఇప్పుడు ఈ విషయంపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు. పోలీసు, రవాణా శాఖలు డేటా భాగస్వామ్యం, సకాలంలో చర్య తీసుకునేలా ప్రణాళికలు వేస్తున్నారు. ఈ రెండు విభాగాలు సాంకేతిక సమన్వయాన్ని బలోపేతం చేయాలని అనుకుంటున్నాయి.

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలే ఎక్కువ ప్రాణాలను బలిగొంటున్నాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాలను అరికట్టడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, రాజీ లేకుండా ట్రాఫిక్ క్రమశిక్షణను అమలు చేయాలని ఆయన అధికారులకు చెప్పారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనే చాలా ప్రమాదాలకు ప్రధాన కారణమని అధికారులు గుర్తించారు. దీనిని పరిష్కరించడానికి కఠినమైన అమలుతో పాటు విస్తృత అవగాహన ప్రచారాలను ప్రారంభించాలని పోలీసులు భావిస్తున్నారు.

ఎప్పటికప్పుడూ తనిఖీలు, చలాన్లు ఉన్నప్పటికీ చాలా మంది నేరస్థులు జరిమానాలను తప్పించుకుంటున్నారు. దీని ఫలితంగా అమలును కఠినతరం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

పాయింట్ల వ్యవస్థ కింద నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ నిబంధనలు ఏంటో చూద్దాం.. పరిమితికి మించి ప్రయాణికులను ఓవర్‌లోడ్ చేయడం, హెల్మెట్ లేకుండా రైడింగ్, ఇన్సూరెన్స్ లేని వాహనాలను నడపడం, వస్తువుల తీసుకెళ్లే వాహనాల్లో ప్రయాణికులను తీసుకెళ్లడం, అతివేగం లేదా రాంగ్ రూట్ డ్రైవింగ్, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడకం, సిగ్నల్ జంపింగ్, మద్యం తాగి వాహనాలు నడపడం, చైన్ స్నాచింగ్ వంటివి ఈ లిస్టులో ఉన్నాయి.

ఒక డ్రైవర్‌కు రెండు సంవత్సరాలలోపు 12 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు వస్తే.. వారి డ్రైవింగ్ లైసెన్స్ ఒక సంవత్సరం పాటు సస్పెండ్ అవుతుంది. ప్రస్తుతం ఉల్లంఘన డేటాను పోలీసులు రవాణా శాఖకు ఫార్వార్డ్ చేస్తారు. ఇది పరిమితిని దాటిన లైసెన్స్‌లను ఆటోమెటిక్‌గా రద్దు చేస్తుంది. అయితే డేటా మార్పిడిలో కొంత జాప్యం జరుగుతుందనే వాదనలు ఉన్నాయి.

ఒక్క హైదరాబాద్ ప్రాంతంలోనే ఏటా కోటి ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదవుతున్నాయి. అయినప్పటికీ జనవరి నుంచి జూలై 2024 మధ్య, కేవలం 18,973 డ్రైవింగ్ లైసెన్స్‌లు మాత్రమే రద్దు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జవాబుదారీతనం నిర్ధారించడానికి, రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి పాయింట్ల వ్యవస్థను కఠినంగా అమలు చేయాలని అధికారులు ఇప్పుడు ప్రణాళికలు వేస్తున్నారు.

News/Telangana/ట్రాఫిక్ రూల్స్ పాటించండి లేదంటే లైసెన్స్ క్యాన్సిల్.. ఇక వేరే ఛాన్స్ లేదు!
News/Telangana/ట్రాఫిక్ రూల్స్ పాటించండి లేదంటే లైసెన్స్ క్యాన్సిల్.. ఇక వేరే ఛాన్స్ లేదు!