...
...
Next Story

కృష్ణా జలాల వాటాలో మరణ శాసనం రాసిందే కాంగ్రెస్.... సీఎం రేవంత్ పై హరీశ్ రావ్ ఫైర్

రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే కృష్ణా జలాల వినియోగం అత్యంత తక్కువగా జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఏపీకి గురుదక్షిణ చెల్లించేందుకే పల్నాడు, కుప్పం ప్రాజెక్టులపై మౌనం వహించారని ఆరోపించారు.

Published on: Nov 24, 2026, 21:56:45 IST
Advertisement

కృష్ణా నదీ జలాల వాటాలు, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా జలాల అతి తక్కువ వినియోగం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణ చెల్లించుకునేందుకే రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు.

మాజీ మంత్రి హరీశ్ రావ్
మాజీ మంత్రి హరీశ్ రావ్

కృష్ణా జలాల వినియోగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి తెలివితేటలు ప్రదర్శిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. “2024-25 ఆర్థిక సంవత్సరంలో కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ 718 టీఎంసీల నీటిని వాడుకుంటే, తెలంగాణ కేవలం 286 టీఎంసీలు మాత్రమే వాడింది. అంటే తెలంగాణకు ఉన్న 34 శాతం తాత్కాలిక కేటాయింపులో కేవలం 28 శాతం నీళ్లను మాత్రమే వాడుకున్నారు” అని హరీశ్ రావ్ పేర్కొన్నారు.

"ఇక 2025-26లో ఏపీ 771 టీఎంసీలు వాడుకుంటే, తెలంగాణ 267 టీఎంసీలకు పరిమితమైంది. అంటే కేవలం 25 శాతం మాత్రమే వినియోగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే అత్యంత తక్కువ వినియోగం" అని హరీష్ రావు వివరించారు.

తెలంగాణ నీటి హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని హరీష్ రావు మండిపడ్డారు. "ఏడేళ్లయినా కృష్ణా ట్రిబ్యునల్ వేయడం లేదని నాడు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర మంత్రిని కేసీఆర్ నిలదీశారు. కానీ నేడు ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్‌కు పొక్కగొట్టి నీళ్లు తీసుకుపోతుంటే రేవంత్ రెడ్డి కుంభకర్ణుడిలా నిద్రపోయారు. కల్వకుర్తిలో, శ్రీశైలంలో పుష్కలంగా నీళ్లు ఉన్నా 24 గంటల పాటు మోటార్లు నడపకుండా, 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం నియోజకవర్గానికి నీళ్లు పంపించారు. దేవాదులలో నీళ్లు ఉన్నా ఎత్తిపోయకుండా ఏపీకి గురుదక్షిణ చెల్లించి, వరంగల్ జిల్లాను కరువులోకి నెట్టారు. నిజానికి ఉరి వేయాల్సింది రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని" అని హరీష్ రావు ఘాటుగా వ్యాఖ్యానించారు.

పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై అబద్ధాలు

"చంద్రబాబుకు గురుదక్షిణ కింద రేవంత్ రెడ్డి పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును వదిలేశారు. నిన్న జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో కనీసం పల్నాడు ప్రాజెక్టు గురించి చర్చ కూడా జరగలేదు. ఆ అక్రమ ప్రాజెక్టును ఆపేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం అడగలేదు. పైగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే 2022లో ఆ ప్రాజెక్టుకు జీవో వచ్చిందని రేవంత్ అబద్ధాలు ఆడుతున్నారు. అసలు 2022లో ఇచ్చిన జీవో 56లో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుంటామని ఎక్కడా లేదు. ఈ ఏడాది జనవరిలో ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచి, నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుంటామని ఏప్రిల్ నెలలో జీవో ఇచ్చింది. కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు ఈ విషయాన్ని బయటపెట్టిన తర్వాత మీరు బ్యాక్‌డేట్‌లో ఉత్తరం రాసి నాటకాలు ఆడుతున్నారు," అని హరీష్ రావు ఆరోపించారు.

మరణ శాసనం రాసిందే కాంగ్రెస్…

కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ అని హరీష్ రావు గుర్తుచేశారు. "ఆంధ్రాకు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు అనే తాత్కాలిక వాటా ఒప్పందానికి కర్త, కర్మ, క్రియ కాంగ్రెస్ పార్టీనే. నాడు తెలంగాణకు 299 టీఎంసీల నీళ్లు చాలని ఒప్పుకున్నది అప్పటి కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ మంత్రులే. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 42 రోజులకే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి, ఆ 299 టీఎంసీలు సరిపోవని, మాకు 580 టీఎంసీల నీళ్లు కావాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు" అని ఆయన స్పష్టం చేశారు.

పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి, నేడు పాలమూరు జిల్లాకు క్రాప్ హాలిడే ఇచ్చే దుస్థితి తీసుకొచ్చారని హరీష్ రావు విమర్శించారు. "30 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో పాలమూరులో కేవలం 30 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇచ్చారు. కేసీఆర్ హయాంలో మేము ఏకంగా 10 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాం. ఒక్క పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపైనే రూ. 28 వేల కోట్లు ఖర్చు చేశాం. కానీ పాలమూరుకు కేసీఆర్ నీళ్లు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారు. మీరు ముఖ్యమంత్రి అయ్యాక 2024లో చంద్రబాబు జీవో ఇచ్చి 750 కిలోమీటర్ల దూరంలోని కుప్పం నియోజకవర్గానికి నీళ్లు తీసుకుపోయారు. ఆ జీవోలపై కేఆర్ఎంబీకి ఎందుకు ఫిర్యాదు చేయలేదు…? ఇది గురుదక్షిణలో భాగం కాదా…?" అని హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు.

 

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks