Kodad Road Accident : కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం - ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు, ఆరుగురు మృతి!
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై దొరకుంట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కంటైనర్ లారీని ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో వేగంగా వచ్చిన ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా… మరికొందరు గాయపడ్డారు.
కంటైనర్‌ను ఢీకొట్టడంతో….
ప్రాథమిక వివరాల ప్రకారం… ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ బస్సు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు వైపు వెళ్తుండగా దొరకుంట సమీపంలోకి రాగానే ఈ ప్రమాదం జరిగింది. బస్సు ముందు భాగం కంటైనర్‌ను ఢీకొట్టడంతో తీవ్రంగా ధ్వంసమైంది. సీట్లలో నిద్రిస్తున్న ప్రయాణికులు ఒకేసారి చెల్లాచెదురుగా పడిపోయారు.
ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురిలో ముగ్గురు పురుషులున్నారు. మృతదేహాలు బస్సు శిధిలాల్లో చిక్కుకుపోవడంతో స్థానికులు, పోలీసులు తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద ధాటికి జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ స్తంభించగా… పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
ఈ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

