Hyderabad : అక్ర‌మ మైనింగ్‌పై హైడ్రా కొరడా - బడా బాబుల దందాకు చెక్..! ఒకేరోజు 6 ప్రాంతాల్లో భారీ కూల్చివేతలు!

Illegal Stone Crushing Hyderabad : హైదరాబాద్ శివార్లలో అక్రమంగా సాగుతున్న మైనింగ్, క్రషింగ్ యూనిట్లపై హైడ్రా (HYDRAA) చర్యలు చేపట్టింది.  మంగళవారం భారీ ఆపరేషన్ చేపట్టి రూ. వందల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమ ప్లాంట్లను నేలమట్టం చేసింది.

Published on: May 5, 2026, 12:58:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illegal Stone Crushing Hyderabad : నగర శివార్లలోని ప్రకృతిని, భూగర్భ జలాలను, ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్న అక్రమ మైనింగ్ మాఫియాపై హైడ్రా (HYDRAA) యుద్ధం ప్రకటించింది. బడా బాబుల అండదండలతో, ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా సాగుతున్న స్టోన్ క్రషింగ్, ఆర్ఎంసీ (RMC) ప్లాంట్లపై మంగళవారం ఉదయం ఒకేసారి మెరుపు దాడులు నిర్వహించింది.

హైడ్రా కూల్చివేతలు
హైడ్రా కూల్చివేతలు

12 ప్లాంట్ల తొలగింపు…

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (PCB), మైనింగ్ మరియు రెవెన్యూ శాఖల విజ్ఞప్తి మేరకు హైడ్రా కమిషనర్ రంగంలోకి దిగారు. రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలం వట్టినాగులపల్లి, శేరిలింగంపల్లి మండలం గౌలిదొడ్డి, శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ గ్రామాల్లో ఈ ఆపరేషన్ కొనసాగింది.

6 స్టోన్ క్రషింగ్ యూనిట్లు పూర్తిగా నేలమట్టం చేయబడ్డాయి.12 ఆర్ఎంసీ (Ready Mix Concrete) ప్లాంట్లను అధికారులు తొలగించారు. భవిష్యత్తులో ఇక్కడ మైనింగ్ చేయడానికి వీలు లేకుండా భారీ యంత్ర సామగ్రిని సీజ్ చేసి అక్కడి నుంచి తరలించారు.

అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వారిలో పేరున్న పెద్ద సంస్థలు ఉండటం గమనార్హం. గతంలో మైనింగ్ శాఖ హెచ్చరించినా బడా బాబుల రాజకీయ అండతో వీరు బేఖాతరు చేస్తూ వచ్చారు.

గౌలిదొడ్డిలో గ్రేట్ ఇండియా మైనింగ్ సంస్థ, వట్టినాగులపల్లిలో పరమేష్ సింగ్ స్టోన్ క్రషర్/శ్రీ లక్ష్మి కన్స్ట్రక్షన్స్, పృథ్వి స్టోన్ క్రషర్, కొత్వాల్‌గూడలో రాఘవ స్టోన్ క్రషర్, మక్తా భగత్ సింగ్ అనే వ్యక్తికి చెందిన యూనిట్లపై హైడ్రా కఠిన చర్యలు తీసుకుంది.

ప్రభుత్వ ఆదాయానికి గండి..

ఈ అక్రమ యూనిట్లు రూ. వందల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా, పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. యథేచ్ఛగా బండ రాళ్లను పేల్చడం వల్ల సమీపంలోని నివాస ప్రాంతాలు ప్రమాదంలో పడ్డాయి. క్రషింగ్ వల్ల వచ్చే విపరీతమైన దుమ్ముతో స్థానికులు శ్వాసకోస వ్యాధుల బారిన పడుతున్నారు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ యూనిట్లకు కోట్లాది రూపాయల విద్యుత్ బకాయిలు ఉండటంతో కనెక్షన్ కట్ చేసినా.. డీజిల్ జనరేటర్లతో అక్రమ దందాను కొనసాగిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లేఖతో కదిలిన హైడ్రా, కోర్ అర్బన్ రీజినల్ ఎకానమీ (CURE) పరిధిలో చేపట్టిన ఈ చర్యలతో పరిసర ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More