కోడి పోయింది... కథ మిగిలింది! బోనాల వేళ ఇంట్రస్టింగ్ స్టోరీ
హైదరాబాద్‌లో బోనాల సందడి మొదలైందంటే చాలు... డప్పుల మోతతో పాటు రికార్డింగ్ పాటలు దద్దరిల్లిపోతాయి. ఆ పాటల్లో ఎప్పటి నుంచో వినిపిస్తున్న ఓ పల్లవి.. మీకోసం
ఈ పాట వినగానే ఒక ప్రశ్న మాత్రం వెంటాడుతుంది. అసలు లచ్చమ్మ ఏ ఊరి మనిషి? ఒక కోడి పోయిందని బాధపడిన లచ్చమ్మ తన గోడును ఎవరికీ చెప్పుకుంది? ఎలా చెప్పుకుంది? ఆ మాట ఎవరినుంచి ఎవరికి చేరింది? చివరకు పాటగా మారి తెలంగాణ అంతటా ఎలా మారుమోగింది?
కోడి పాయే లచ్చమ్మది పాట వెనక కథ
సోషల్ మీడియా లేదు. టీవీ చానళ్లు లేవు. చివరికి ఊరూరికీ వార్త తీసుకెళ్లే మీడియా కూడా లేదు. అయినా లచ్చమ్మ కోడి కథ మాత్రం తరతరాలుగా ప్రజల నోట నిలిచిపోయింది.
అదే జానపదం ప్రత్యేకత
నిజానికి తెలంగాణ బతుకులో కోడికి ఉన్న స్థానం చిన్నది కాదు. ఇంటి పెరట్లో తిరిగే కోడి నుంచి బోనాల మొక్కులోని కోడి పుంజు వరకు... తెలంగాణ సంస్కృతిలో అది ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంటుంది. బోనాల సందర్భంగా కోడి పుంజులను మొక్కుగా సమర్పించే ఆనవాయితీ కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.
కానీ కోడి అంటే కేవలం మొక్కు కాదు. కోడి చుట్టూ పుట్టిన కథలు, సామెతలు, పాటలు, సరదా ముచ్చట్లు కూడా తెలంగాణ పల్లె జీవితంలో భాగమే.
లచ్చమ్మ కోడి... ఎవరిదీ ఈ కథ?
“కోడి పాయే లచ్చమ్మది...” అనే పల్లవి పాత జానపద గేయాల్లో నమోదై ఉంది. ఆ పాటలో కోడి మాత్రమే కాదు... ఎడ్లు, గొడ్లు, దూడలు, పోతులు ఇలా గ్రామీణ జీవితంలో కనిపించే ఎన్నో వస్తువులు, జంతువులు పోయిన సందర్భాలను లచ్చమ్మ పేరుతో పాడుతారు.
అంటే ఇది ఒక లచ్చమ్మకు జరిగిన నిజ సంఘటనా? లేక ఒక జానపద పాత్రనా? ఎవరికీ ఖచ్చితంగా తెలియదు.
అదే ఈ పాటకు ఉన్న అసలు అందం.
ఎవరో ఒకరి కోడి పోయింది. ఆ బాధ ఒకరి దగ్గర ఆగలేదు. ఒకరి నోట మరోకరికి, అక్కడి నుంచి మరో ఊరికి... చివరకు పాటగా మారింది. మీడియా లేని కాలంలో ఒక సాధారణ మనిషి బాధ ప్రజలందరికీ చేరడానికి జానపదమే మీడియా అయింది.
“అందరూ షావుకార్లే... గంప కింద కోడి ఎక్కడిది?”
తెలంగాణ పల్లెల్లో వినిపించే మరో సరదా ముచ్చట...
ఒక కాలనీ అంతా పెద్ద షావుకార్లదేనట. అందరూ తాము శాఖాహారులమని గొప్పగా చెప్పుకుంటారట. మాంసం ముట్టుకోమని, కోడి కూర వాసన కూడా తమకు తెలియదని చెబుతుంటారట.
అంతలో ఓ ఇంటి దగ్గర గంప కింద పెట్టిన కోడి కనిపించకుండా పోయిందట!
అక్కడే మొదలైంది అసలు ముచ్చట.
“కోడి ఎవరు తీసుకున్నారు?”
ఎవరిని అడిగినా...
“మాకేం తెలుసు బాబూ! మేము వెజిటేరియన్లం!”
అంతా శాఖాహారులే అయితే... గంప కింద ఉన్న కోడి మాత్రం ఎలా మాయమైంది?
ఇలాంటి కథలు నిజంగా జరిగాయా? ఎక్కడ జరిగాయి? అనేది పక్కన పెడితే, తెలంగాణ జానపద హాస్యంలో ఇలాంటి ముచ్చట్లు ఎందుకు నిలిచిపోయాయో మాత్రం అర్థమవుతుంది. కోడిని కథలో పెట్టి మనుషుల స్వభావాలను ఎండగట్టడం!
రజాకార్‌కు కనిపించిన కొవ్వెక్కిన కోడి
తెలంగాణ చరిత్రలో రజాకార్ల కాలం ఓ చేదు అధ్యాయం. గ్రామాలపై దాడులు, దోపిడీలు, భయాందోళనల కథలు ఆ తరానికి చెందినవారి జ్ఞాపకాల్లో ఇప్పటికీ ఉన్నాయి.
ఆ కాలానికి సంబంధించిన జానపద ముచ్చట్లలో ఒకటి... ఓ ఊరికి ఏదో పని మీద వచ్చిన రజాకార్ పోలీసుకు ఓ పిక్కబలిసిన, కొవ్వెక్కిన కోడి కనిపించిందట.
అంతే...
“ఈ కోడిని నాకు వండి పెట్టాలి” అని ఆదేశించాడట. కోడి యజమాని పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఒకవైపు ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కోడి పోతుందన్న బాధ. మరోవైపు ఎదురు చెప్పే పరిస్థితి లేదు. చివరకు తన చేతులతోనే కోడిని కోసి వండి పెట్టాల్సి వచ్చిందట.
కానీ మనసులోని కసి మాత్రం తగ్గలేదు.
కూరలో వేయాల్సిన చెంచెడు మసాలా కంటే గంటెడు మసాలా వేసి వడ్డించాడట! తిన్న రజాకార్‌కు నాలుగు రోజులు కడుపు మంట. చేతిలో చెంబు. చివరికి దిక్కుమాలిన కోడి దొంగలా తిరిగాడట!
ఇది చరిత్ర పుస్తకాల్లో కనిపించే కథ కాదు. జనం మధ్య తరతరాలుగా తిరిగిన జానపద ముచ్చట. దోపిడీదారుడిపై నేరుగా తిరగబడలేని సమయంలో కూడా, ఒక సాధారణ మనిషి తన కోపాన్ని ఎలా వ్యంగ్యంగా బయటపెట్టాడో చెప్పే కథగా ఇది మిగిలిపోయింది.
షావుకారు బాకీకి కోడి కూడా తప్పించుకోలేదు!
కోడి కథల్లో ఇంకో రకం కూడా ఉంది. ఇంట్లో కోడి చచ్చిపోయింది. కానీ అది ఎవరిది అన్నదానిపై మామకోడలు మధ్య గొడవ మొదలైంది.
చచ్చిపోయిన కోడికి కూడా విలువ చెప్పుకుంటూ ఇద్దరూ తమ తమ లెక్కలు వేసుకుంటుంటారు. చివరకు ఆ కోడికి యాభై రూపాయలు అడుగుతున్న సమయంలో షావుకారు వచ్చి...
“బాకీ ఉంది కదా... కోడిని నేనే తీసుకెళ్తా. మిగతాది తర్వాత ఇస్తా!”
అంటూ కోడిని ఎత్తుకుపోతాడట. కోడి చచ్చిపోయింది. కానీ దాని మీద కూడా అప్పు హక్కు వదలని షావుకారు!
ఇది కేవలం హాస్యకథ కాదు. గ్రామీణ సమాజంలో అప్పు, షావుకారు, పేదరికం, కుటుంబ తగాదాలు ఎలా ఉండేవో కూడా ఇలాంటి చిన్న కథలు చెబుతాయి.
కోడి అంటే కోడే కాదు... ఓ ఇంటి ఆస్తి!
ఈ కథలన్నింటిలో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.
ఒకప్పుడు కోడి అంటే ఇంటి పెరట్లో తిరిగే పక్షి మాత్రమే కాదు. అది ఆస్తి. గుడ్లు పెడుతుంది. పిల్లలను పెంచుతుంది. పొద్దున విడిచిపోతే.. సాయంకాలం దాకా తిరిగి ఇంటికొచ్చి పడుకుంటుంది. గూగుల్ మ్యాప్స్ అవసరం లేకుండా.. తనకు నచ్చినంత దూరం తిరుగుతుంది. సమయానికి ఇంటికి తిరిగి వస్తుంది. అంతే కాదు.. ఇంటి యజమానికి అవసరమైతే పండుగకు పనికొస్తుంది. మొక్కు తీర్చడానికి ఉపయోగపడుతుంది. అతిథి వస్తే విందులో భాగమవుతుంది.
అందుకే కోడి పోతే లచ్చమ్మకు బాధ.
కోడి కనిపిస్తే రజాకార్‌కు ఆశ.
కోడి కనిపించకపోతే కాలనీకి అనుమానం.
కోడి చచ్చిపోతే మామకోడళ్లకు గొడవ.
కోడి మీద అప్పు ఉంటే షావుకారు కన్ను!
ఒక్క కోడి... ఎన్ని కథలు!
బోనాలు వచ్చాయంటే మళ్లీ కోడి కథలే...
ఇప్పుడు హైదరాబాద్ మారిపోయింది. పాత పల్లెలు కాలనీలయ్యాయి. గంపలు కనిపించడం తగ్గింది. ఇంటి పెరట్లో కోళ్లు పెంచే రోజులు కూడా చాలా వరకు తగ్గిపోయాయి.
కానీ బోనాలు మాత్రం వచ్చినప్పుడు ఆ పాత తెలంగాణ మళ్లీ ఒక్కసారిగా మేల్కొంటుంది.
డప్పుల మోత... పోతురాజుల విన్యాసాలు... బోనం మోసే ఆడబిడ్డలు... అమ్మవారి గుడి దగ్గర సందడి... వాటి మధ్యలో ఎక్కడో ఒకచోట కోడి పుంజు కూడా కనిపిస్తుంది.
అప్పుడు మనకు తెలియకుండానే పాత పాట గుర్తొస్తుంది...
శ్రీనాథ్ గొల్లపల్లి ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ, ఆరోగ్య, రాజకీయ తదితర ప్రధాన అంశాలపై 25 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి ఉన్నారు. అమెరికా, కెనడా సహా ఐదు దేశాల్లో పర్యటించి అంతర్జాతీయ అంశాలపై అవగాహన పెంపొందించుకున్నారు.
హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More