Karimnagar : దంపతుల వలపు వల...! పర్సనల్ వీడియోలతో వసూళ్ల దందా..! చివరికి ఇలా దొరికిపోయారు
సోషల్ మీడియాను వేదికగా చేసుకొని 'హనీ ట్రాప్' చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్న భార్యాభర్తల బాగోతాన్ని కరీంనగర్ రూరల్ పోలీసులు బట్టబయలు చేశారు. కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అప్పులు తీర్చుకోవడానికి ఆ దంపతులు అడ్డదారి తొక్కారు. ఏకంగా సామాజిక మాధ్యమాల వేదికగా 'హనీ ట్రాప్' (వలపు వల) పేరుతో… చాలా మందిని బ్లాక్ మెయిల్ చేయటం మొదలుపెట్టారు. భారీ సంఖ్యలో డబ్బులు వసూలు చేశారు. వీరి వలలో చిక్కిపోయిన పలువురు బయటికి రాలేకపోయారు. అయితే ఎట్టకేలకు ఓ వ్యాపారి పోలీసులను ఆశ్రయించటంతో అసలు విషయం బయటపడింది. తీగ లాగితే డొంక కదిలినట్లు సంచలన విషయాలు బయటికి వచ్చాయి.
ఆకర్షించేలా పోస్టులు…
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కరీంనగర్ రూరల్ మండలం ఆరేపల్లిలోని ఓ అపార్ట్ మెంట్ లో దంపతులు నివాసం ఉంటున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఆకర్షించేలా వ్యక్తిగత ఫోటోలను పోస్ట్ చేస్తారు. వాటిని చూసి కొంతమంది వ్యక్తులు చూసి ఆమెను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. ఇదే అదునుగా కొందరు ఆమె నెంబర్ తీసుకొని సంప్రదించారు. ఇదే అదనుగా భావించిన దంపతులు… సదరు వ్యక్తులను హానీ ట్రాప్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఇలా వంద మంది వరకు ఆమెతో టచ్ లోకి వెళ్లినట్లు తెలిసింది. ఇందులో బడా వ్యాపారస్తులున్నారని సమాచారం. సదరు మహిళతో ప్రైవేట్ గా గడిపిన సమయంలో భర్త వీడియోలు తీసేవాడు. మరోవైపు ఇంటికి వచ్చే వారి నుంచి వసూలు చేసే డబ్బులతో లగ్జరీ లైఫ్ ను గడపటం మొదలుపెట్టారు.
సీన్ కట్ చేస్తే సదరు భార్య భర్తలు మరో దారుణానికి తెగబడ్డారు. రహస్యంగా తీసిన వీడియోలతో సదరు వ్యక్తులకు పంపి బెదిరింపులకు పాల్పడ్డారు. నగ్నంగా ఉన్న వీడియోలు తమ వద్ద ఉన్నాయని…. డబ్బులు ఇవ్వకపోతే వైరల్ చేస్తామని బెదిరించేవారు. ఇలా డబ్బులు దండుకునే పనిలో పడ్డారు.
ఏడాది కిందట వీరి వలలో చిక్కిన ఓ స్థానిక వ్యాపారి నుంచి ఈ దంపతులు ఏకంగా రూ. 14 లక్షలు వసూలు చేశారు. అంతటితో ఆగకుండా మరో రూ. 5 లక్షలు కావాలని…. లేదంటే చంపేస్తామని బెదిరించారు. బాధితుడు భయపడి మరో రూ. లక్ష ఇచ్చినా వేధింపులు తగ్గకపోవడంతో.. చివరకు ధైర్యం చేసి కుటుంబ సభ్యుల సహాయంతో పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వీరి అసలు బాగోతంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. దీంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఏసీపీ విజయ్ కుమార్ ఆదేశాలతో సీఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఓ దాబా వద్ద ఆగి ఉన్న భార్య భర్తను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా అసలు విషయాలను బయటపెట్టారు. కోర్టులో హాజరుపర్చగా… 14 రోజుల పాటు రిమాండ్ విధించటం జరిగింది.
నిందితులది మంచిర్యాల జిల్లాగా గుర్తించారు. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో రుణంతో కొన్న ప్లాటు ఈఎంఐలు కట్టడం ఇబ్బందిగా మారడంతో సామాజిక మధ్యమాల ద్వారా మగవాళ్లను ఆకర్షించేలా పోస్టులు పెట్టడం ప్రారంభించినట్లు దర్యాప్తులో తేలింది. గత కొంతకాలంగా కరీంనగర్లో ఉంటూ ఈ వ్యవహారం నడిపిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

