ఫోన్ ట్యాపింగ్ కేసు : మీ నోటీసు చట్టవిరుద్ధం… అయినా విచారణకు వస్తా..! సిట్ కు KCR లేఖ
ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు జారీ చేసిన నోటీసులు చట్టవిరుద్ధమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సిట్ కు లేఖ రాశారు. అయినప్పటికీ దర్యాప్తునకు సహకరిస్తామని స్పష్టం చేశారు. ఆదివారం నందినగర్ లోని నివాసంలో అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
సిట్ నోటీసులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. సిట్ అధికారులు వ్యవహరించిన తీరు చట్టాలకి వ్యతిరేకమన్నారు. సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ… కీలక అంశాలను ప్రస్తావించారు. సిట్ అధికారులకి నోటీసు ఇచ్చే అధికారమే లేదని…. నా రాజ్యాంగ హక్కులను కాలరాయడమే అని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సిట్ కు ఓ లేఖను పంపారు.

“మీరు ఇచ్చిన మొదటి నోటీసుకు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉండటం వల్ల వేరే రోజు విచారణకు తేదీ ఇవ్వాలని చెప్పాను. దాంతో పాటు 65 ఏళ్ల పైబడిన వ్యక్తులను వారు నివసించే చోటనే విచారించాలని చెప్పే సెక్షన్ 160 CrPC నిబంధనలను మీ దృష్టికి తెచ్చాను. దాంతో పాటు తదుపరి నోటీసులన్నీ కూడా ఎర్రవల్లిలోని నా నివాసానికే పంపాలని చెప్పాను. కానీ, ఇది చెప్పిన తర్వాత కూడా గుర్తుతెలియని వ్యక్తులు మీ సంతకంతో ఉన్న లేఖను రాత్రి 9 గంటలకు నందినగర్ నివాసంలోని మా ఇంటి గోడకు అతికించినట్లు తెలుస్తోంది. ఆ లేఖ మీరే పంపినట్లయితే, మీ సూచనల మేరకే అతికించినట్లయితే, ఆ లేఖను తీవ్రంగా ఆక్షేపిస్తున్నాను” అని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.
“ఇది భారత రాజ్యాంగం, చట్టం మరియు గౌరవ సుప్రీంకోర్టుల పట్ల మీకు ఏమాత్రం గౌరవం లేదు అనే విషయాన్ని సూచిస్తుంది. గతంలో సుప్రీంకోర్టు 'సతేంద్ర కుమార్ యాంటిల్ వర్సెస్ సీబీఐ' అనే కేసులో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వాట్సాప్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా నోటీసులు పంపడం చట్టబద్ధమైన పద్ధతి కాదని, చట్టం నిర్దేశించిన రీతిలోనే నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. CRPC 160 నోటీసులను వ్యక్తిగతంగా అందజేయాలి కానీ మీరు కావాలనే చట్టాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు.. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది”అని కేసీఆర్ తెలిపారు.
“భవిష్యత్తు నోటీసులన్నీ ఎర్రవల్లికే పంపాలని చెప్పినప్పటికీ మీరు దాన్ని విస్మరించారు. కాబట్టి మీరు ఇచ్చిన రెండవ నోటీసు చట్టబద్ధంగా అందలేదు, అది చెల్లదు. మీరు ఇచ్చిన నోటీసు నా రాజ్యాంగబద్ధ హక్కులను ఉల్లంఘించడమే. నేను మీ పోలీస్ స్టేషన్ పరిధిలో గానీ, పొరుగు పోలీస్ స్టేషన్ పరిధిలో గానీ నివసించడం లేదు.కాబట్టి మీకు నోటీసు ఇచ్చే అధికార పరిధి లేదు.. ఈ నోటీసు నన్ను కట్టడి చేసే అధికారం లేదు. ఎలక్షన్ అఫిడవిట్‌లో, అసెంబ్లీ రికార్డులో ఉన్న అడ్రస్ ఆధారంగా ఎర్రవల్లిలో విచారించలేమని మీరు చెప్పడం సరికాదు. నోటీసు ఇచ్చే సమయానికి వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నారు అన్నదే ముఖ్యం. నేను కొన్ని సంవత్సరాలుగా ఎర్రవల్లిలో నివసిస్తున్నాను అన్నది నిర్వివాద అంశం. అక్కడే నా స్టేట్మెంట్ రికార్డ్ చేయవలసిన బాధ్యత మీపై ఉన్నది.హరీష్ రావు అఫిడవిట్‌లో సిద్దిపేట అని చిరునామా ఉన్నప్పటికీ హైదరాబాద్‌లో నోటీసు ఇచ్చారు. ఇది మీ ద్వంద్వ ప్రమాణాలను సూచిస్తోంది” అంటూ సిట్ తీరును కేసీఆర్ ఎత్తిచూపే ప్రయత్నం చేశారు.
“మీరు నాకు ఇచ్చిన నోటీసును గోడకు అతికించడం చట్టవిరుద్ధం. మీరు నాకు నోటీసు ఇచ్చే అధికార పరిధి లేదు. చట్టం ప్రకారం నా స్టేట్మెంట్‌ను ఎర్రవల్లిలోనే రికార్డ్ చేయాలి. అయితే చట్టపరమైన అంశాలు ఎలా ఉన్నప్పటికీ, మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడిగా, బాధ్యతాయుతమైన భారత పౌరుడిగా దర్యాప్తుకు సహకరించాలని నిర్ణయించుకున్నాను. ఆదివారం(ఫిబ్రవరి 1) 3 గంటలకి నందినగర్‌లో అందుబాటులో ఉంటాను. మీరు నందినగర్ నివాసంలోనే స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని పట్టుబట్టినందున అక్కడే అందుబాటులో ఉంటాను”అని కేసీఆర్ స్పష్టం చేశారు.
)
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

