తెలంగాణలో నెమ్మదించిన ఖరీఫ్ సాగు.. జూలై 15 నుంచి ప్రత్యామ్నాయ ప్రణాళికలు

ప్రస్తుతం తెలంగాణలో 132.38 లక్షల ఎకరాల ఖరీఫ్ లక్ష్యానికి గాను 55.31 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగంది. దీంతో ప్రత్యామ్నాయ పంటల చర్యలు చేపట్టాల్సి వస్తోంది.

Published on: Jul 13, 2026, 10:19:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో ఖరీఫ్ సాగుపై ఆందోళన నెలకొంది. నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమై 40 రోజులు గడిచినా, విత్తనాలు చల్లేందుకు కేవలం 20 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో వ్యవసాయ పనులు మందగించాయి. ఎల్ నినో ప్రభావంతో సాగు పనుల్లో తీవ్ర ఆలస్యం జరుగుతోందని వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన క్షేత్రస్థాయి నివేదికలో స్పష్టం చేసింది.

తెలంగాణలో ఖరీఫ్ సాగు
తెలంగాణలో ఖరీఫ్ సాగు

జూలై 8వ తేదీ నాటికి రాష్ట్రంలోని సాధారణ ఖరీఫ్ సాగు విస్తీర్ణంలో కేవలం 41.79 శాతం మాత్రమే సాగులోకి వచ్చింది. 9 జిల్లాల్లో సాగు నమోదు 20 శాతం కంటే తక్కువగా ఉండగా, మరో 16 జిల్లాల్లో 50 శాతం లోపే నమోదైంది. సమయం వేగంగా ముగిసిపోతుండటంతో సాగులో వెనకబడిన జిల్లాల్లో జూలై 15 నుండి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా తక్కువ కాలపరిమితి గల పంట రకాలను ప్రోత్సహించడం, తగిన విత్తనాలను పంపిణీ చేయడం, రైతులకు సకాలంలో ఎరువులు, పురుగుమందులు అందేలా చూడటం ద్వారా పంట నష్టాన్ని తగ్గించాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది.

ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్రిశాట్ (ICRISAT) లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో అగ్రికల్చర్, హార్టికల్చర్ వర్సిటీల అధికారులు, ఇక్రిశాట్, IIOR, IIMR, CRIDA శాస్త్రవేత్తలతో పాటు ఐఎండీ, భూగర్భ జలాల శాఖల అధికారులు పాల్గొని, శాస్త్రవేత్తలు సిద్ధం చేసిన మూడు ప్రత్యామ్నాయ ప్రణాళికలను పరిశీలించి తుది కార్యాచరణను ఖరారు చేయనున్నారు.

తెలంగాణలోకి జూన్ 8న రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, అవి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టింది. జూన్ 1 నుండి జూలై 8 వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 177.9 మిమీ కాగా, 154.9 మిమీ నమోదైంది (13 శాతం లోటు). వాతావరణ శాఖ లెక్కల ప్రకారం ఇది సాధారణ కేటగిరీ కిందే వస్తున్నప్పటికీ, సమయానికి తగినంత పదును లేకపోవడంతో సాగు నత్తనడకన సాగుతోంది.

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, మిగిలిన 20 జిల్లాల్లో వర్షపాత లోటు ఉంది. ఆలస్యంగానైనా జూన్, జూలై మొదటి వారంలో పడిన వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా నిర్ణయించిన 132.38 లక్షల ఎకరాల ఖరీఫ్ లక్ష్యానికి గాను.. ఇప్పటివరకు 55.31 లక్షల ఎకరాల్లో సాగు ప్రారంభమైంది.

ప్రస్తుత సాగు గణాంకాలను పరిశీలిస్తే పత్తి, సోయాబీన్ పంటల సాగు మాత్రమే ఆశాజనకంగా ఉంది. ప్రధాన ఆహార పంట అయిన వరి సాగు అత్యంత నిమ్మదించింది. పత్తి 39.44 లక్షల ఎకరాలు (సాధారణ సాగులో 83.19 శాతం) సోయాబీన్ 3.35 లక్షల ఎకరాలు (సాధారణ సాగులో 80.29 శాతం). చెరకు 64.44శాతం, కందులు 58.63 శాతం, పెసలు 55.36 శాతం. మొక్కజొన్న 46.09 శాతం, జొన్నలు 41.67శాతం, ఆముదం 26.65 శాతం, పొద్దుతిరుగుడు 25.55 శాతంగా ఉంది. వరి సాధారణ సాగు లక్ష్యం 65.96 లక్షల ఎకరాలు కాగా కేవలం 4.22 లక్షల ఎకరాల్లో (6.40 శాతం) మాత్రమే నాట్లు పడ్డాయి.

వేరుశెనగ (9.79 శాతం), సజ్జలు (11.42శాతం), ఉలవలు (11 శాతం), రాగులు (14.85 శాతం), మినుములు (29.05 శాతం) సాగు వెనుకబడి ఉంది. నువ్వుల సాగు అసలు ప్రారంభమే కాలేదు. సాగు విస్తీర్ణంలో జిల్లాల మధ్య భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. పత్తి, సోయాబీన్ ఎక్కువగా పండించే ఉమ్మడి జిల్లాల్లో సాగు బాగుండగా, వరి ప్రధానంగా పండించే జిల్లాల్లో పరిస్థితి నిరాశాజనకంగా ఉంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More