గిరిజన మహిళా హత్యాచారం కేసు : పాత కేసులో జీవితఖైదు ఖరారు..! ఎలాగూ శిక్ష పడుతుందని దారుణానికి పాల్పడ్డ పాత నేరస్థుడు..!
మెదక్ లో సంచలనం సృష్టించిన గిరిజన మహిళ హత్యాచారం కేసును పోలీసులు చేధించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రలోభపెట్టి నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. ఆపై రాళ్లతో కొట్టాడని జిల్లా ఎస్పీ వివరాలను వెల్లడించారు.
మెదక్ జిల్లాలో 33 ఏళ్ల గిరిజన మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈనెల 11వ తేదీన ఈ దారుణం వెలుగులోకి రాగా… తాజాగా ఈ కేసులోని నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక టీమ్స్ తో దర్యాప్తు జరపగా…. కీలక విషయాలు బయటికి వచ్చాయి. ఇందుకు సంబంధించిన వివరాలను మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు వెల్లడించారు.

మాటలతో నమ్మించి…
జిల్లా ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం…. నిజామాబాద్ జిల్లాలోని సేవాలాల్‌తండాకు చెందిన మెగావత్ ఫకీరానాయక్ సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఓ తండాలో నివాసం ఉంటున్నాడు. అత్తగారింట్లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న అతడు…. ఈ నెల 10న మెదక్ కోర్టుకు హాజరయ్యాడు. అక్కడ్నుంచి తిరిగి వచ్చే సమయంలో మెదక్ మండల పరిధికి చెందిన 33 ఏళ్ల గిరిజన మహిళ కనిపించింది. ఆమెను పరిచయం చేసుకుని మాటల్లో పెట్టాడు. తన మాటలతో నమ్మించి… పని ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఆ తర్వాత…. బస్సులో ఏడుపాయల ఆలయ సమీపంలోకి తీసుకెళ్లాడు.
ఆలయానికి సమీపంలో ఉన్న ఓ వెంచర్ లోకి ఆమెను తీసుకెళ్లి… బలవంతపెట్టాడు. చీరతో కాళ్లు, చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత… కర్రతో తలపై బలంగా కొట్టటంతో ఆమె ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమె ముక్కుపుడక తీసుకొని నిందితుడు ఫకీర్ నాయక్ పారిపోయాడు.
సదరు మహిళను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు… వెంటనే మెదక్ కు తరలించి చికిత్స అందించారు. అప్పటికి పరిస్థితి విషమించటంతో హైదరాబాద్ లోని గాంధీకి తరలించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఈనెల 11వ తేదీన మృతి చెందారు.
ఈ కేసుపై త్వరితగతిన విచారణ చేపట్టిన పోలీసులు… సీసీ కెమెరాల ఆధారంగా సమాచారం సేకరించారు. ఫకీరా నాయక్ ఆమెను తీసుకెళ్లినట్లు గుర్తించారు. అసలు నిందితుడు అతడే అని గుర్తించి… మంగళవారం మెదక్ లో అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించబడిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
13వ తేదీనే జీవితఖైదు విధించిన కోర్టు
36 ఏళ్ల ఫకీరానాయక్‌పై ఇది వరకే దొంగతనం, హత్యలకు సంబంధించి పలు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. 2020 నవంబరులో మెదక్‌లో ఓ మహిళపై హత్యాచారానికి పాల్పడిన కేసులో అతడిపై నేరం రుజువైంది. సోమవారమే(అక్టోబర్ 13,2025) జిల్లా న్యాయమూర్తి జీవితఖైదు విధించారు. ఆ మరుసటి రోజే అతడిని మెదక్ గిరిజన మహిళపై హత్యాచార కేసులో అరెస్టు చేసి రిమాండుకు పంపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

