‘ఇంత మంది ఖాళీగా ఉన్నారా?’ హైదరాబాద్​ మాల్​ ఓపెనింగ్​కి ఎగబడ్డ ప్రజలు..

హైదరాబాద్​ కూకట్​పల్లి వై జంక్షన్​ వద్ద లేక్​షోర్​ మాల్​ ప్రారంభమైంది. మొదటి రోజున ఈ మాల్​ని సందర్శించేందుకు ప్రజలు భారీ సంఖ్యలో ఎగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

Published on: Dec 13, 2025, 06:36:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2023 సెప్టెంబర్​లో హైదరాబాద్​ లులూ మాల్​ ఓపెనింగ్​లో కనిపించిన గందరగోళం గుర్తుందా? నాడు.. ఓపెనింగ్​ రోజే మాల్​ని చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో ఎగబడ్డారు. అప్పట్లో ఆ వీడియోలు తెగ వైరల్​ అయ్యాయి. కాగా హైదరాబాద్​లో ఇప్పుడు అదే సీన్​ మరోసారి రిపీట్​ అయ్యింది! కూకట్​పల్లి వై జంక్షన్​ వద్ద శుక్రవారం “లేక్​షోర్​ మాల్​” ప్రారంభం అవ్వగా.. దానిని చూసేందుకు మొదటి రోజే ప్రజలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. దాదాపు తొక్కిసలాట జరిగేంత రేంజ్​లో, ఒకరి మీద ఒకరు పడుతూ మాల్​ లోపలికి దూసుకెళ్లారు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు కూడా చేస్తున్నారు.

లేక్​షోర్​ మాల్​ వద్ద భారీ రద్దీ..
లేక్​షోర్​ మాల్​ వద్ద భారీ రద్దీ..

లేక్​షోర్​ మాల్​ ఓపెనింగ్​- అసలేం జరిగింది?

కూకట్​పల్లి వై జంక్షన్​ వద్ద చాలా కాలంగా లేక్​షోర్​ మాల్​ నిర్మాణం జరిగింది. మాల్​ ఎప్పుడెప్పుడు ఓపెన్​ అవుతుందా, ఎప్పుడెప్పుడు లోపలికి వెళదామా అని నగరవాసులు చాలా కాలం ఎదురుచూశారు. చివరికి శుక్రవారం ఈ మాల్​ ఓపెన్​ అయ్యింది.

అయితే, ఓపెనింగ్​ రోజున మాల్​ సిబ్బంది ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిందని తెలుస్తోంది. మొదటి 1000 మందికి డిస్కౌంట్​ వోచర్లు లేదా ఉచిత కూపన్లు ఇస్తామని సిబ్బంది చెప్పినట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ఉదయం నుంచే మాల్​ వద్ద భారీ సంఖ్యలో బారులుతీరారు. ఇక మాల్​ ఓపెన్​ చేసిన వెంటనే, అందరు కలిసి ఒకేసారి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ కారణంగా మాల్​లో గందరగోళ పరిస్థితి నెలకొంది. లోపల, బయట రద్దీని నియంత్రించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించింది.

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి:

లేక్​షోర్​ మాల్​ ఓపెనింగ్​- నెటిజన్ల స్పందన ఇలా..

లేక్​షోర్​ మాల్​ వద్ద భారీ రద్దీకి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు వైరల్​ అయ్యాయి. నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.

“దేనికిరా బాబు ఇంత కంగారు.. వాడేమైనా ఫ్రీ బోర్డు పెట్టాడా?” అని ఒక వ్యక్తి కామెంట్​ చేయగా.. “పిచ్చోళ్ల గురించి వినడమే కానీ లైవ్​లో ఇదే చూడటం,” అని ఇంకొకరు రాసుకొచ్చారు.

“ఆ మాల్​ ఎక్కడికీ పోదురా సామీ. లైఫ్​ కంటే ఏదీ ముఖ్యం కాదు,” అని మరొకరు అభిప్రాయపడ్డారు.

“ఇందులో కూడా లులూ మాల్ ఓపెనింగ్ రోజు ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోదాం అని పోయారేమో?” అని ఇంకొకరు రాశారు. గతంలో లులూ మాల్​ ఓపెనింగ్​ రోజున చాలా మంది ఫుడ్​ కౌంటర్లలోని ఆహారాన్ని ఎత్తుకెళ్లిపోయిన సంఘటను ఈ వ్యక్తి గుర్తు చేశారు.

“మరీ ఇంత ఖాళీగా ఉన్నారేంట్రా బాబు,” అని మరొకరు సెటైర్​ వేశారు.

“ఇంత మంది ఖాళీగా ఉన్నారా?” అని ఇంకొకరు రాసుకొచ్చారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More