Hyderabad : వరకట్న మృతి కేసు - సీజ్ చేసిన నగలు, డబ్బును కాజేసిన కానిస్టేబుల్!
వరకట్న వేధింపుల కేసులో సీజ్ చేసిన బంగారు ఆభరణాలను ఓ కానిస్టేబుల్ తాకట్టు పెట్టాడు. ఫోన్ ద్వారా రూ.1.70 లక్షలు కాజేసిన ఘటన వెలుగు చూసింది. ఈ మేరకు మీర్పేట్ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ నగరంలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. న్యాయాన్ని కాపాడాల్సిన కానిస్టేబుల్ అక్రమాలకు పాల్పడ్డాడు. వరకట్న హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీజ్ చేసిన విలువైన ఆస్తులు, నగదును స్వార్థం కోసం వాడుకున్నాడు. ఈ ఆరోపణలపై అతనిపై కేసు నమోదైంది.

కేసు వివరాలు ఇలా….
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గట్ల పద్మ అనే మహిళ తన కుమార్తె హేమ మృతిపై ఫిర్యాదు చేసింది. భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు వరకట్నం కోసం తీవ్ర వేధింపులకు గురిచేయడంతోనే తన కుమార్తె ఉరేసుకుని మృతి చెందిందని జులై 30న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
విచారణ సమయంలో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు ఆధారాల సేకరణలో భాగంగా పంచనామా నిర్వహించి నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, భారీగా బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సీజ్ చేసిన కేస్ ప్రాపర్టీని ఆగస్టు 22న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సమక్షంలో… స్టేషన్ హౌస్ ఆఫీసర్, సెక్టార్ ఎస్ఐ ఉమామహేశ్వరి సమక్షంలో సరైన రశీదుతో కానిస్టేబుల్ ఎన్. శ్రావణ్ కుమార్ కు భద్రపరచడం కోసం అప్పగించారు.
కేసు ప్రాపర్టీకి బాధ్యత వహించాల్సిన కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ తన చేతిలో ఉన్న ఆస్తులను దుర్వినియోగం చేసినట్లు తదుపరి విచారణలో బయటపడింది. ఏ1 నిందితుడి సీజ్ చేసిన మొబైల్ ఫోన్ ద్వారా యూపీఐ సహాయంతో అక్రమంగా రూ.1,70,000 నగదును బదిలీ చేసుకున్నాడు. ఇందులో రూ.1,37,000 నగదును తన భార్య ఖాతాకు, మిగిలిన మొత్తాన్ని మల్లకేడి శివాజీ అనే వ్యక్తి ఖాతాకు మళ్లించాడు.
ఇంతటితో ఆగకుండా…. కేసులో ఏ2 నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న 122.2 గ్రాముల బంగారు ఆభరణాలను బయట తాకట్టు పెట్టి రూ.12,37,000 సొమ్ము చేసుకున్నట్లు విచారణలో తేలింది. అంతేకాకుండా కేసులో నిందితుడిగా ఉన్న ఏ5 మొబైల్ ఫోన్‌ను నిందితుడికే తిరిగి ఇచ్చేసినట్లు తేలింది.
కానిస్టేబుల్ చేసిన ఈ అక్రమాలపై మీర్పేట్ ఇన్స్పెక్టర్ బి. శోభన్ అక్టోబర్ 27న ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ ఫిర్యాదు ఆధారంగా కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదైంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

