సిద్దిపేటలో క్రైమ్ వెబ్ సిరీస్ సీన్ - ఒంటరి మహిళలే టార్గెట్‌గా తల్లి, కొడుకు దారుణాలు! వెలుగులోకి సంచలన విషయాలు

Siddipet Serial Murder Cases : సిద్దిపేట జిల్లాలో ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ హత్యలు, దోపిడీలకు పాల్పడుతున్న తల్లి, కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 10 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

Published on: Aug 18, 2026, 14:31:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Siddipet Serial Murder Cases : సిద్దిపేట జిల్లాలో సంచలనం సృష్టించిన వరుస హత్యలు, దోపిడీల కేసులను పోలీసులు ఛేదించారు. పక్కా ప్రణాళికతో ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ…. బంగారం, నగదు కోసం దారుణాలకు ఒడిగడుతున్న తల్లి, ఆమె మైనర్ కుమారుడిని అరెస్ట్ చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు.

కేసు వివరాలు వెల్లడించిన సిద్ధిపేట సీపీ
కేసు వివరాలు వెల్లడించిన సిద్ధిపేట సీపీ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూంపల్లి గ్రామానికి చెందిన దూబ్బయ్య, భార్య చకాలి రజిత (38)ను అరెస్టు చేసి జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించగా…. ఆమె మైనర్ కొడుకును జువైనల్ హోమ్‌కు పంపించినట్లు సీపీ తెలిపారు.

గుర్తుతెలియని మృతదేహంతో విచారణ మొదలు..

ఈ నెల ఆగస్టు 8న రామక్కపేట శివార్లలోని వ్యవసాయ పొలాల్లో సగం కాలిన స్థితిలో ఒక అనాథ మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసును సవాలుగా తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులకు, మృతురాలు భూంపల్లి గ్రామానికి చెందిన అతికం విజయ (45)గా గుర్తింపు లభించింది. బాధితురాలి గురించిన సమాచారం సేకరించిన అనంతరం…. కేసు మూలాలు రజిత కుటుంబం వైపు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

బాధితురాలు విజయను రజిత, ఆమె కొడుకు కలిసి తమ కిరాణా షాప్‌లోకి పిలిపించి, అక్కడ ఊపిరి ఆడకుండా చేసి దారుణంగా హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఆ తర్వాత శవాన్ని ఒక మోపెడ్‌పై ఎక్కించుకుని ఊరి వెలుపలకు తీసుకెళ్లి, పెట్రోల్ పోసి నిప్పంటించి ఆధారాలు దహనం చేసేందుకు యత్నించారు.

"విచారణలో మృతురాలి గుర్తింపును నిర్ధారించుకున్న తర్వాత, నిందితుల ఆచూకీ కనిపెట్టాం. ఈ తల్లి-కొడుకుల జంట ఒంటరిగా ఉండే మహిళల కదలికలు, వారి వద్ద ఉన్న ఆస్తులు, కుటుంబ తగాదాలను నిశితంగా పరిశీలించి టార్గెట్‌గా చేసుకునేవారు" అని సీపీ రష్మీ పెరుమాళ్ వివరించారు.

మరో హత్య, దోపిడీ కేసుల్లోనూ హస్తం….

విచారణను మరింత లోతుగా చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాదే మే 28న అచ్చమ్మయ్యపల్లి అటవీ ప్రాంతంలో కాలిన గాయాలతో శవమై కనిపించిన కుంట రేఖ హత్య కేసులో కూడా ఈ నిందితుల ప్రమేయమే ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా…. జూన్ 2025లో అన్నపూర్ణ అనే మహిళ నుంచి ఐదు తులాల బంగారు మంగళసూత్రాన్ని దోచుకెళ్లిన ఘటనలోనూ ఈ తల్లి, కొడుకులే నిందితులని విచారణకర్తలు అనుమానిస్తున్నారు.

కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల వద్ద నుంచి సుమారు రూ. 10 లక్షల విలువైన ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 5.61 తులాల బంగారం, 53 తులాల వెండి, రూ. 1.03 లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు మరియు నేరానికి ఉపయోగించిన మోపెడ్‌ను జప్తు చేశారు.

వెబ్ సిరీస్‌లు చూసి నేరాల స్కెచ్…

పోలీసుల విచారణలో నిందితులు సంచలన విషయాలు బయటపెట్టారు. క్రైమ్ ఆధారిత వెబ్ సిరీస్‌లను విపరీతంగా చూస్తూ నేరాలు ఎలా చేయాలో ప్లాన్ చేసుకునేవామని ఒప్పుకున్నారు. బాధితుల ఆస్తులు, వారి వ్యక్తిగత వివాదాలు, కదలికలను అధ్యయనం చేసిన తర్వాతే దాడులకు పాల్పడేవారని పోలీసులు స్పష్టం చేశారు.

ఈ ఘటనల నేపథ్యంలో స్థానిక ప్రజల భద్రతపై పోలీస్ కమిషనర్ ప్రత్యేక సూచనలు చేశారు. నేరాల నియంత్రణకు, భద్రతా చర్యలను పటిష్టం చేసేందుకు ప్రతీ ఒక్కరూ తమ ఇళ్లు, వ్యాపార సముదాయాల వద్ద సీసీటీవీ (CCTV) కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీపీ రష్మీ పెరుమాళ్ కోరారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More