Hyderabad : నీట్‌ పరీక్షలో మాల్‌ప్రాక్టీస్‌ - వాష్ రూమ్ లో ఫోన్, జవాబులు వెతుకుతూ దొరికిపోయిన విద్యార్థి

హైదరాబాద్ లోని రాగన్నగూడ జెడ్‌పీహెచ్‌ఎస్ కేంద్రంలో నీట్ పరీక్ష రాస్తూ మాల్ ప్రాక్టీసింగ్ కు పాల్పడిన విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాష్ రూమ్ ఫ్లష్ ట్యాంక్‌లో దాచిన మొబైల్ ఫోన్ ద్వారా గూగుల్‌లో సమాధానాలు వెతుకుతుండగా గుర్తించారు.

Published on: Jun 22, 2026, 06:51:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నీట్ (NEET) ప్రవేశ పరీక్షలో మాల్ ప్రాక్టీసింగ్ కు పాల్పడిన తెలంగాణ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాగన్నగూడ జిల్లా పరిషత్ హైస్కూల్ (ZPHS) పరీక్షా కేంద్రంలో వెలుగు చూసింది. కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడిన 18 ఏళ్ల నీట్ అభ్యర్థిని హైదరాబాద్ సిటీ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన విద్యార్థిగా గుర్తించారు.

నీట్ పరీక్షలో చీటింగ్ - తెలంగాణ విద్యార్థి అరెస్ట్! representative image (pixel image)
నీట్ పరీక్షలో చీటింగ్ - తెలంగాణ విద్యార్థి అరెస్ట్! representative image (pixel image)

ముందే ప్లాన్..

ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం.. సదరు విద్యార్థి ఆదివారం ఉదయం 7 గంటలకే పరీక్షా కేంద్రమైన స్కూల్‌కు చేరుకున్నాడు. స్కూల్ కాంపౌండ్ వాల్‌కు ఆనుకుని ఉన్న వాష్ రూమ్ వెంటిలేటర్ ద్వారా లోపలికి చెయ్యి పెట్టి ఒక మొబైల్ ఫోన్‌ను అక్కడ దాచాడు. ఆ తర్వాత ఉదయం 11 గంటల సమయంలో మళ్లీ వాష్ రూమ్‌లోకి వెళ్లి, ఆ ఫోన్‌ పాడవకుండా ఉండేందుకు ఒక జిప్ లాక్ కవర్‌లో పెట్టి, ఏకంగా ఫ్లష్ ట్యాంక్ లోపల దాచిపెట్టాడు.

వాస్తవానికి పోలీసులు ఉదయం 6 గంటలకు ఒకసారి…. మళ్లీ 11 గంటలకు మరోసారి పరీక్షా కేంద్రాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అంతేకాకుండా కేంద్రంలోకి వచ్చే ప్రతి విద్యార్థిని గేటు వద్దే క్షుణ్ణంగా తనిఖీ (ఫ్రిస్కింగ్) చేసి లోపలికి పంపించారు. కానీ, ఫ్లష్ ట్యాంక్ లోపల ఫోన్ దాచారనే విషయాన్ని భద్రతా సిబ్బంది ప్రాథమిక తనిఖీల్లో గుర్తించలేకపోయారు.

అడ్డంగా దొరికిపోయాడు….

పరీక్ష ప్రారంభమైన తర్వాత నిందితుడు తనకు తీవ్రంగా కడుపునొప్పి వస్తోందని, అత్యవసరంగా రెస్ట్ రూమ్‌కు వెళ్లాలని ఇన్విజిలేటర్‌ను కోరాడు. ఈ పరీక్షా కేంద్రానికి సంబంధించి స్కూల్ భవనానికి కాస్త దూరంగా…. అందరికీ ఉమ్మడిగా ఒకే ఒక వాష్ రూమ్ సదుపాయం ఉంది. అయితే లోపలికి వెళ్లిన విద్యార్థి ఎంతసేపటికీ బయటకు రాకపోవడం, చాలా ఎక్కువ సమయం అక్కడే గడపడంతో ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చింది. వెంటనే ఆయన కొందరు సిబ్బందిని వాష్ రూమ్ వైపు పంపించారు. సిబ్బంది వెళ్లి లోపల చూడగా.. సదరు అభ్యర్థి తన మొబైల్ ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ…. ప్రశ్నలకు సమాధానాలు వెతకడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. దీంతో అతడిని సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులు

ఈ విషయంపై సిబ్బంది సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీస్ బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుంది. ఆ డివైజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించగా.. నిందితుడు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నట్లు తేలింది. ఆ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ మినహా అనుమానాస్పదంగా ఉన్న ఇతర యాప్‌లు ఏవీ యాక్టివ్‌గా లేవని పోలీసులు గుర్తించారు.

పోలీసుల విచారణలో నిందితుడు తన తప్పును ఒప్పేసుకున్నాడు. ప్రస్తుతం అతడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. స్కూల్ యాజమాన్యం ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 318(4)తో పాటు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్-2024లోని సెక్షన్ 10 రీడ్ విత్ 3 కింద క్రైమ్ నంబర్ 499/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More