జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం వద్ద విషాదం - కొత్త కారు పూజ వేళ తప్పుగా ఎక్సలేటర్ తొక్కిన మేనల్లుడు.. మామ మృతి!

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద తీవ్ర విషాదం నెలకొంది. కొత్త కారు పూజ సమయంలో ఎక్సలేటర్ తొక్కడంతో కారు దూసుకెళ్లి ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు.

Published on: Aug 29, 2026, 15:37:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొత్తగా కారు కొనుగోలు చేశామన్న ఆనందం ఆ కుటుంబంలో కొద్దిసేపు కూడా నిలవలేదు. వాహనానికి పూజ చేయించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుందామని ఆలయానికి వస్తే, ఊహించని ప్రమాదం కొంపముంచింది. మేనల్లుడు చేసిన చిన్న పొరపాటు కన్న సొంత మామ ప్రాణాలనే బలితీసుకుంది. హైదరాబాద్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి దేవాలయం ఆవరణలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది.

జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం వద్ద విషాదం
జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం వద్ద విషాదం

అసలేం జరిగిందంటే...?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలానికి చెందిన తుమ్ములపల్లి రామచంద్రరావు (70) తన భార్య గంగాభవానితో కలిసి వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చారు. ప్రస్తుతం వారు నగరంలోని మియాపూర్‌లో నివాసముంటున్న తమ మేనల్లుడు సాయికుమార్ ఇంట్లో ఉంటున్నారు. అయితే, సాయికుమార్ ఇటీవల ఒక కొత్త కారును కొనుగోలు చేశాడు. కారుకు శాస్త్రోక్తంగా పూజ చేయించాలని భావించిన సాయికుమార్, కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి ఆలయానికి వెళ్లాడు.

ఆలయం వద్ద వాహన పూజ జరుగుతున్న సమయంలో, కారును కాస్త ముందుకు జరపాలని అర్చకుడు సాయికుమార్‌కు సూచించారు. దీంతో డ్రైవింగ్ సీట్లో కూర్చున్న సాయికుమార్ కారును ముందుకు తీసేందుకు ప్రయత్నించాడు. అయితే…. కంగారులో లేదా తొందరపాటులో బ్రేక్ వేయడానికి బదులుగా ఒక్కసారిగా ఎక్సలేటర్‌ను గట్టిగా తొక్కేశాడు. దీంతో కారు తీవ్ర వేగంతో ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది.

చికిత్స పొందుతూ కన్నుమూత

సరిగ్గా అదే సమయంలో కారుకు ముందు భాగంలో నిలబడి ఉన్న రామచంద్రరావును ఈ కారు బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో కిందపడిపోయిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే తేరుకుని, అత్యవసరంగా ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చేర్చి వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆయన చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.

ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మేనల్లుడు కొత్త కారు కొన్నాడన్న సంతోషంతో పూజకు వచ్చిన కుటుంబంలో, అదే కారు తగిలి మామ ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More