తెలంగాణలో నాలుగు నేషనల్ హైవే ప్రాజెక్టులకు టెండర్లు.. ఫిబ్రవరిలో పనులు ప్రారంభం!

భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) తెలంగాణలోని నాలుగు జాతీయ రహదారి ప్రాజెక్టులకు టెండర్లు ఆహ్వానిస్తోంది. ఫిబ్రవరి 2026లో గ్రౌండ్ వర్క్ ప్రారంభం కానుంది.

Published on: Nov 23, 2025 9:31 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) తెలంగాణలోని నాలుగు జాతీయ రహదారి ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది. వాటిలో మూడు జగిత్యాల మీద నుంచి ఉండగా.. నాల్గోది మంత్రాలయం, గోవా యాత్రను రాష్ట్ర ప్రజలకు ప్రయాణం సులభతరం చేస్తుంది. ఆర్మూర్-జగిత్యాల, జగిత్యాల-కరీంనగర్, జగిత్యాల-మంచిర్యాల కారిడార్లకు, 167వ జాతీయ రహదారిలోని మహబూబ్‌నగర్-గుడేబల్లూర్ నుండి ఒకదానికి డిసెంబర్‌లో టెండర్లు ఖరారు అవుతాయి. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఫిబ్రవరి 2026లో గ్రౌండ్ వర్క్ ప్రారంభం కానుంది. ఈ పని మొత్తం 271 కి.మీ.లు ఉంటుంది. బడ్జెట్ రూ.10,034 కోట్లు ఉంటుందని అంచనా.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలోని NH-63 ఆర్మూర్-మంచిర్యాల విస్తరణను నాలుగు లేన్ల కారిడార్‌గా అప్‌గ్రేడ్ చేయడానికి జగిత్యాల కేంద్రంగా ఉన్న మూడు విభాగాలు, రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ప్రయాణాన్ని మెరుగుపరుస్తాయి. అప్‌గ్రేడ్ చేసిన నెట్‌వర్క్ నాగ్‌పూర్-బెంగళూరు, హైదరాబాద్-మంచిర్యాల జాతీయ రహదారి వ్యవస్థలతో కలిసిపోతుంది.

NH-167గా మహబూబ్‌నగర్-గూడేబల్లూర్ మార్గాన్ని భారత్‌మాల పరియోజన కింద 80 కి.మీ.ల విస్తీర్ణంలో నాలుగు లేన్‌లుగా విస్తరించడానికి ఆమోదం లభించింది. ఈ విభాగం హైదరాబాద్-పనాజీ కారిడార్‌లో భాగం. ఈ మార్గం మహబూబ్‌నగర్‌ను కర్ణాటక సరిహద్దు సమీపంలోని గూడెబల్లూర్‌కు కలుపుతుంది. రాయచూర్ వైపు విస్తరించి, తెలంగాణలోని మరికల్, కర్ణాటకలోని దేవ్‌సుగూర్ గుండా వెళుతుంది. హైదరాబాద్, వరంగల్, ఇతర తెలంగాణ నగరాల మధ్య కర్ణాటక, గోవాలోని గమ్యస్థానాలకు సజావుగా ప్రయాణించడానికి వీలు కల్పించడం, ఇంధన వినియోగం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.

ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్ నుండి గోవా, రాయచూర్, మంత్రాలయం, ఇతర కర్ణాటక పట్టణాలకు ప్రయాణికులు జడ్చర్ల, మహబూబ్ నగర్ మీదుగా రెండు లేన్ల రహదారిపై ప్రయాణిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని నాలుగు లేన్లుగా మార్చడం వలన ట్రాఫిక్ సులభతరం అవుతుందని, వేగవంతమైన రవాణా సాధ్యమవుతుందని, ప్రాంతీయ ఆర్థిక అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.

జగిత్యాల-మంచిర్యాల కారిడార్ ఇంజనీరింగ్, సేకరణ మరియు నిర్మాణం (EPC) నమూనా కింద అమలు చేస్తారు. ఆర్మూర్–జగిత్యాల, జగిత్యాల-కరీంనగర్, మహబూబ్‌నగర్-గుడేబల్లూర్‌లను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద అభివృద్ధి చేస్తారు. ఈ నమూనా ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కలిగి ఉంటుంది, దీనిలో నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ఎక్కువగా ప్రైవేట్ ఆపరేటర్లు నిర్వహిస్తారు.

జగిత్యాల-కరీంనగర్ హైవేను రూ.2,484 కోట్ల వ్యయంతో 59 కి.మీ. విస్తరించనున్నారు. ఆర్మూర్-జగిత్యాల స్ట్రెచ్ రూ2,338 కోట్లతో 64 కి.మీ. అత్యంత పొడవైన మహబూబ్‌నగర్-గూడేబల్లూర్ రూ.2,662 కోట్లతో 80 కి.మీ.లను కవర్ చేస్తుంది. జగిత్యాల-మంచిర్యాల 68 కి.మీ., అంచనా ప్రకారం రూ.2,550 కోట్లు. పర్యావరణ, అటవీ, రైల్వే సంబంధిత అనుమతులు వచ్చాయి. భూసేకరణ దశలవారీగా జరుగుతోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More