జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనపై అభ్యంతరాలు.., హైకోర్టులో పిటిషన్!

జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనపై భారీగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో హైదరాబాద్‌కు చెందిన నేతలు సమావేశం అయ్యారు.

Published on: Dec 15, 2025 3:31 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై అనేక అభ్యంతరాలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో హైదరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సమావేశం అయ్యారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, ప్రకాశ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో కలిసి కార్పొరేటర్లు మేయర్‌ను కలిశారు. డివిజన్ల పునర్విభజనపై చర్చించారు.

తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌.. కార్పొరేటర్లు అభిప్రాయాన్ని తీసుకోనున్నారు. ఇప్పటిదాకా 13 వందలకుపైగా అభ్యంతరాలు వచ్చాయి. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. డిసెంబర్ 17వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. డిసెంబర్ 18వ తేదీన డివిజన్ల పునర్విభజనకు తుది ఆమోదం తెలపాలని జీహెచ్ఎంసీ అనుకుంటోంది.

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో మేయర్ గద్వాల విజయలక్ష్మి సమావేశమయ్యారు. వార్డుల పునర్విభజన శాస్త్రీయంగా చేయాలని మేయర్‌కు వినతిపత్రం అందించారు. డివిజన్ల పునర్విభజన సరిగా లేదని చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఏ ప్రాంతం డివిజన్‌లో కలుస్తుందనే విషయంపై గందరగోళం నెలకొన్నది. కొత్తగా డివిజన్ల హద్దులు, పేర్లు మార్చడంపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు జీహెచ్ఎంసీలోని డివిజన్ల పెంపును సవాల్ చేస్తూ.. వినయ్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసరంగా విచారణ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. డివిజన్ల పునర్విభజనలో తన అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు.

జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. డీ లిమిటేషన్ మీద అభ్యంతరం తెలిపేందుకు కమిషనర్‌ను కలిశామన్నారు. కనీసం తమకు సమాచారం లేకుండానే.., ఎమ్మెల్యేల అభిప్రాయం లేకుండానే.. డివిజన్ల పునర్విభజన చేశారని పేర్కొన్నారు. తమ అభ్యంతరాలను మేయర్, కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఇచ్చామన్నారు.

డివిజన్ల విభజనపై ఎటువంటి సమస్యలు ఉన్నాయనే అంశాలను గుర్తించామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చెప్పారు. కొన్ని డివిజన్లలో ఎక్కువ ఓట్లు మరికొన్ని డివిజన్లలో తక్కువ ఓట్లు గుర్తించామని వెల్లడించారు. అన్ని విషయాలను మేయర్, కమిషనర్లకు వివరించామన్నారు. హద్దులు తెలియకుండా అధికారులు వాటిని ఖరారు చేశారని చెప్పారు.