...
...
Next Story

22-ఏ సమస్యలపై ఉపశమనం.. అనుమతులున్న ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు మార్గం సుగమం

దశాబ్దాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న 22-ఏ సమస్యలకు ఒక్కొక్కటిగా పరిష్కారం చూపుతూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

Published on: Sep 24, 2026, 20:52:07 IST
Advertisement

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు సహచర మంత్రులతో చర్చించి 22-ఏ సమస్యలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

పొంగులేటి శ్రీనివాస రెడ్డి
పొంగులేటి శ్రీనివాస రెడ్డి

22 ఏ లో ఉన్నప్పటికీ సంబంధిత ప్రభుత్వ సంస్థల నుంచి చట్టబద్ధమైన అనుమతులు పొంది అభివృద్ధి చేసిన ఓపెన్ ప్లాట్లు, ఇళ్లు, ఫ్లాట్లకు నిర్దేశిత నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పిస్తూ రెవెన్యూ శాఖ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.

జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పురపాలక సంస్థలు, డీటీసీపీ లేదా ఇతర పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల నుంచి చెల్లుబాటు అయ్యే లేఅవుట్, భవన నిర్మాణం లేదా అపార్ట్‌మెంట్ అనుమతులు పొందిన ఆస్తులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని చెప్పారు.

అనుమతి పొందిన అనంతరం జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఏదో ఒక లింక్ డాక్యుమెంట్ తప్పనిసరిగా దరఖాస్తుదారులు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

జిల్లా స్థాయిలో సమస్యల పరిష్కారానికి కమిటీ

ఈ ప్రక్రియలో ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిశీలించి పరిష్కరించేందుకు జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

ఈ కమిటీలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా రిజిస్ట్రార్, హెచ్ఎండీఏ/పురపాలక సంస్థ/గ్రామీణ స్థానిక సంస్థల ప్రతినిధి సభ్యులుగా ఉంటారని తెలిపారు.

22-ఏ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇప్పటికే అమలులోకి వచ్చిన నిర్ణయాలే నిదర్శనమని మంత్రి తెలిపారు.

రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాల్లోని దాదాపు 64 కాలనీల ఇళ్ల క్రమబద్ధీకరణ సమస్యకు జీవో 118కు అనుగుణంగా మెమో జారీ, దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న సింగరేణి కార్మికుల ఇళ్ల క్రమబద్ధీకరణ సమస్యను కూడా ప్రభుత్వం జీవో 76 ద్వారా పరిష్కరించే దిశగా కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు.

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను కేవలం ఫైళ్లకే పరిమితం చేయకుండా, ప్రజలకు ప్రత్యక్షంగా ఉపశమనం కలిగేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

22-ఏలోని అన్ని భూములను ఒకే గాటన కట్టకుండా, భూమి స్వభావం, అందుబాటులో ఉన్న రికార్డులు, చట్టబద్ధమైన అనుమతులు, న్యాయపరమైన అంశాలను పరిశీలించి అర్హమైన సమస్యలకు సత్వర పరిష్కారం చూపుతామని మంత్రి స్పష్టం చేశారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks