హైదరాబాద్‌కు ఐఐఎం ఇవ్వండి: కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్‌లతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటుతో పాటు కొత్త జిల్లాల్లో కేంద్రీయ, నవోదయ విద్యాలయాల మంజూరుకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ విద్యా రంగంలో కీలక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన విద్యా సంస్థలు, పెండింగ్‌లో ఉన్న నిధులపై సుదీర్ఘంగా చర్చించారు.

హైదరాబాద్‌కు ఐఐఎం.. స్థలం కూడా సిద్ధం
భారతదేశంలో సాంకేతికత, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి రంగాల్లో హైదరాబాద్ నగరం శరవేగంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో నగరానికి ఒక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) అత్యవసరమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు సీఎం వివరించారు.
దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో 21 ఐఐఎంలు ఉన్నాయని, తెలంగాణలో కూడా ఒక మేనేజ్‌మెంట్ సంస్థను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. "ఐఐఎం ఏర్పాటుకు కావాల్సిన 200 ఎకరాల భూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (UoH) క్యాంపస్‌లోనే గుర్తించాం. వెంటనే తరగతులు ప్రారంభించడానికి ట్రాన్సిట్ క్యాంపస్ సౌకర్యం కూడా సిద్ధంగా ఉంది. దీనికి కావాల్సిన అన్ని అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ఇస్తుంది" అని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఐఐఎం అందుబాటులోకి వస్తే తెలంగాణలోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.
కొత్త జిల్లాలకు కేంద్రీయ, నవోదయ పాఠశాలలు
తెలంగాణలో జిల్లాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో, దానికి అనుగుణంగా విద్యా మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం కోరారు. రాష్ట్రానికి కొత్తగా 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్రీయ విద్యాలయాలు కోరిన జిల్లాలు: కొమురం భీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, వికారాబాద్, నిర్మల్.
నవోదయ విద్యాలయాలు కోరిన జిల్లాలు: హన్మకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, ములుగు, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి, నిర్మల్, ఆదిలాబాద్.
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఈ పాఠశాలలు ఎంతో దోహదపడతాయని ఆయన నొక్కి చెప్పారు. వీటికి అవసరమైన భూమిని, ఇతర సౌకర్యాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
ఈ సమావేశాల్లో సీఎం వెంట ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మందాడి అనిల్ కుమార్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


