అజ్ఞాతం వీడి జన జీవనంలోకి...! మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల
మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఆయుధాలను వీడారు. 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు
మావోయిస్టు పార్టీ ఉద్యమ చరిత్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ పార్టీలో దశాబ్ధాలుగా పని చేస్తూ, కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్న సీనియర్ నేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ భూపతి లొంగిపోయారు. బుధవారం గడ్చిరోలి జిల్లాలో మరో 60 మంది కార్యకర్తలతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఈ లొంగుబాటు జరిగింది.
మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మల్లోజుల
అత్యంక కీలక నేతగా…
లొంగిపోయిన నక్సల్స్ 54 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఇందులో ఏడు ఏకే -47, తొమ్మిది ఇన్సాస్ రైఫిల్స్ ఉన్నాయి. భూపతి అలియాస్ సోనూ మావోయిస్టు సంస్థలో అత్యంత ప్రభావవంతమైన వ్యూహకర్తలలో ఒకరిగా పరిగణించబడ్డారు. మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దులో ప్లాటూన్ కార్యకలాపాలను సుదీర్ఘంగా పర్యవేక్షించాడు. మల్లోజులపై రూ.6 కోట్ల రివార్డు ఉన్నట్లు గడ్చిరోలి పోలీసులు ప్రకటించారు. పార్టీలో అభయ్, సోను, భూపతి, వివేక్ పేర్లతో పిలిచేవారు.
మావోయిస్టు పార్టీలో దాదాపు రెండో స్థానంలో చలామణి అవుతున్న మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవటం ఆ పార్టీ అతిపెద్ద ఎదురుదెబ్బ అని పోలీసులు భావిస్తున్నారు. వరుస ఎన్ కౌంటర్లలో కీలక నేతలు చనిపోవటంతో పాటు వరుసగా లొంగుబాటులు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టు ఉద్యమం బలహీనపడుతోందన్న ప్రచారం తీవ్రస్థాయికి చేరుతోంది.
మల్లోజుల వేణుగోపాల్ 1981లో తాను ఎంచుకున్న సిద్దాంతం కోసం అడవి బాట పట్టారు. మొదటగా ఏటూరు నాగారం దళం సభ్యుడిగా ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1982లో మహదేవపూర్ పోలీసులు మల్లోజులను అరెస్టు చేయగా, 1983లో విడుదల కావడంతో తిరిగి దళంలోకి వెళ్లారు. 1993లో డీకేఎస్ఆర్సీ సెక్రటరీగా ఎన్నికయ్యారు. 1995లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో పొలిట్ బ్యూరో మెంబర్ గా పదోన్నతి లభించింది. పార్టీలో అంచలంచెలుగా ఎదుగుతూ కీలకంగా మారారు.
ఇక గత కొన్నిరోజుల కిందటే మల్లోజుల మావోయిస్టు పార్టీకి రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆయుధాలను వదులుకుని ప్రధాన స్రవంతిలో కలవాలని, తమను తాము రక్షించుకోవాలని, అర్థరహిత త్యాగాలు చేయవద్దని కార్యకర్తలకు ఆయన ఒక లేఖలో పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఇకపై సాయుధ పోరాటాన్ని కొనసాగించలేనని సోను తన సహచరులకు లేఖలో చెప్పారు.
మావోయిస్టులు అనుసరించిన మార్గం పూర్తిగా తప్పు అని అంగీకరిస్తున్నట్టుగా ఇటీవల లేఖలో పేర్కొన్నారు. ఇన్ని రోజులు పార్టీ తప్పులకు, ఉద్యమం ఓడిపోకుండా కాపాడలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ.. పొలిట్ బ్యూరో సభ్యుడిగా క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. పదే పదే నాయకత్వ తప్పిదాలతో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బలు తగిలాయని కూడా ఆయన అన్నారు.
వందల మంది మావోయిస్టులు కోల్పోతున్న పరిస్థితుల్లో పార్టీ అతివాద విధానాల నుంచి మిగిలిన వారినైనా కాపాడుకోవాలన్నారు. 28 ఏళ్లు కేంద్ర కమిటీ, 18 ఏళ్లు పొలిట్ బ్యూరో సభ్యుడిగా పార్టీలో అనేక లోపాలను గమనించినట్టుగా వెల్లడించారు. లేఖలో అనేక విషయాలను వెల్లడించారు. మరోవైపు మల్లోజుల విడుదల చేసిన ఈ లేఖను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆయుధాలను సరెండర్ చేయాలని తెలిపింది.
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లోజుల వేణుగోపాల్ కుటుంబ నేపథ్యం కూడా పోరాటాలకు కేరాఫ్ అనే చెప్పొచ్చు. వెంకటయ్య, మధురమ్మ దంపతులకు వేణుగోపాల్‌రావు మూడో సంతానం. తండ్రి వెంకటయ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పని చేశారు. అంతేకాకుండా ఆయన సోదరుడైన మల్లోజుల కిషన్ జీ కూడా మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా కొనసాగారు. 24 నవంబర్ 2011 న పశ్చిమబెంగాల్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మల్లోజుల కిషన్ జీ (కోటేశ్వర్ రావు) ప్రాణాలు కోల్పోయారు.
News/Telangana/అజ్ఞాతం వీడి జన జీవనంలోకి...! మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల
News/Telangana/అజ్ఞాతం వీడి జన జీవనంలోకి...! మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల