...
...
Next Story

TG Govt Hate Speech Bill : సెలెక్ట్‌ కమిటీకి 'హేట్‌ స్పీచ్‌' బిల్లు - ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేస్తున్నాయి..?

TG Govt Hate Speech and Hate Crimes Bill : తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్వేష ప్రసంగాలు, నేరాల నిరోధక బిల్లు–2026పై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బిల్లును సమీక్షించేందుకు సెలెక్ట్‌ కమిటీకి పంపారు.

Published on: Apr 02, 2026 06:17 PM IST
Advertisement

విద్వేష ప్రసంగాలకు చెక్ పెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం.. విద్వేష ప్రసంగాలు- విద్వేష నేరాల నియంత్రణ చట్టం - 2026 పేరుతో బిల్లును ప్రతిపాదించింది. ఈ బిల్లును ఇటీవలే జరిగిన అసెంబ్లీలో సమావేశంలో ప్రవేశపెట్టగా… పలు పార్టీలు అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఈ బిల్లుపై అనేక అభ్యంతరాలున్నాయని… తక్షణమే ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

సెలెక్ట్‌ కమిటీకి 'హేట్‌ స్పీచ్‌' బిల్లు (image source istock)
సెలెక్ట్‌ కమిటీకి 'హేట్‌ స్పీచ్‌' బిల్లు (image source istock)

ఈ సరికొత్త బిల్లుపై సభ్యుల నుంచి అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో…. శాసనసభ కీలక నిర్ణయం తీసుకుంది. సెలెక్ట్‌ కమిటీకి సిఫార్సు చేసింది.కేవలం అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు మాత్రమే ఈ బిల్లుకు మద్దతు పలకగా.. బీజేపీ వ్యతిరేకించింది. సీపీఐ, ఎంఐఎం సభ్యులు కూడా వ్యతిరేకిస్తూనే…. పలు సవరణలు సూచించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులను సభ నుంచి బహిష్కరించడంతో వారి తరఫున ఎవరూ మాట్లాడలేదు. కానీ కేటీఆర్ ఈ బిల్లుపై స్పందిస్తూ… తీవ్రంగా ఖండించారు. భావ ప్రకటన స్వేచ్ఛను హారించేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చిందని ఆరోపించారు. అయితే ఈ బిల్లుపై ఎందుకు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి..? అసలు ఇందులో ఏముందనే వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

హేట్ స్పీచ్ బిల్లులో ఏముంది..?

  • ముఖ్యంగా సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో పెరుగుతున్న విద్వేషపూరిత కంటెంట్‌ను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం “విద్వేష ప్రసంగాలు- విద్వేష నేరాల నియంత్రణ - 2026” పేరుతో బిల్లును సిద్ధం చేసింది.
  • కులం, మతం, ప్రాంతం, లింగం, సమూహాల మధ్య శతృత్వం, ద్వేషం, విభేదాలను ప్రోత్సహించటం వంటి సున్నితమైన అంశాలతో పాటు ఇతర విషయాల్లో విద్వేషపూరితమైన ప్రసంగాలకు చెక్ పెట్టాలని తెలంగాణ సర్కార్ భావించింది. ఇందుకోసం ‘తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగం, ద్వేషపూరిత నేరాల నివారణ బిల్లు-2026’ను మార్చి 30వ తేదీన శాసనసభ ముందుకు తీసుకువచ్చింది.
  • ఒక వర్గం లేదా వ్యక్తుల సమూహం లేదా సముదాయానికి హాని కలిగించేలా, వారిపై విరోధ భావం, శతృత్వభావం, దురభిప్రాయం కల్పించేలా మాట్లాడినా, పోస్టులు చేసినా, ఎలక్ట్రానిక్‌ మాధ్యమం ద్వారా వ్యాప్తిచేసినా, ప్రచురించినా నేరంగా పరిగణిస్తారు.
  • ఈ బిల్లు చట్టంగా మారితే విద్వేషపూరితం ప్రసంగాలపై కఠిన చర్యలుంటాయి. ఏవరైనా ఈ చట్టం నేరానికి ఏడాదికి తక్కువ కాకుండా గరిష్ఠంగా 7 ఏళ్ల పాటు జైలుశిక్ష ఉంటుంది. అంతేకాకుండా రూ.50 వేల జరిమానా విధిస్తారు.
  • నేరం రెండోసారి చేసినట్లు రుజువైతే రెండేళ్లకు తక్కువ కాకుండా గరిష్ఠంగా పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తారు. బాధితులకు భౌతికంగా లేదా ఆర్థికంగా జరిగిన నష్టం తీవ్రతను అంచనా వేసి పరిహారం చెల్లించే అవకాశం ఉంటుంది.
  • బెయిల్‌ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తీవ్రతను బట్టి నాన్ బెయిల్(సెక్షన్‌-3 (3)) సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేస్తారు.
  • మొదటి తరగతి జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌చే విచారణ జరుపుతారు. చట్టంలోని సెక్షన్‌-5 ప్రకారం.. నేరం చేసినది ఒక సంఘం లేదా ఒక సంస్థ అయితే, నేరం జరిగిన సమయంలో కార్యకలాపాలకు బాధ్యత వహించే వ్యక్తులందరూ బాధ్యులు అవుతారు.
  • రాష్ట్రప్రభుత్వం ఈ చట్టం కింద నియమించే అధికారికి ఎలక్ట్రానిక్ మీడియాలో లేదా ఏదేని సంస్థలో విద్వేష పూరిత ప్రసంగానికి సంబంధించిన సమాచారం ఉంటే దాన్ని తొలగించాలని ఆదేశించే అధికారం సదరు ఆఫీసర్ కు ఉంటుంది.

తీవ్ర అభ్యంతరాలు…!

ఎంఐఎం సభ్యులు మాట్లాడుతూ… విస్తృత లక్ష్యాల దృష్ట్యా మద్దతు తెలిపుతున్నామని చెప్పారు. అయితే ఈ బిల్లులను కొన్ని అంశాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అన్నారు. మత ప్రచారాన్ని విద్వేషపూరిత ప్రసంగంగా లేదా నేరంగా పరిగణించకూడదన్నారు. అవాంఛనీయ పరిణామాలు ఎదురుకాకుండా నివారించడానికి జాగ్రత్తగా ముసాయిదా రూపొందించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని సూచించారు.

సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ… ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒక వ్యక్తి చర్యలు, ప్రకటనలకు మొత్తం రాజకీయ పార్టీ, సంస్థ లేదా సంస్థను బాధ్యులుగా చేసే నిబంధనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపాదిత బిల్లును పునఃపరిశీలించాలని కోరారు.

తెలంగాణ విద్వేష ప్రసంగాలు- విద్వేష నేరాల నియంత్రణ - 2026 బిల్లుపై సెలక్ట్ కమిటీ సమీక్షించనుంది. సభ్యుల అభిప్రాయలను స్వీకరించనుంది. ఆపై ఓ నివేదికను సిద్ధం చేసి… ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఏమైనా సవరణలు చేస్తుందా..? లేక యథావిధిగా ముందుకెళ్తుందా అనేది చూడాలి…!

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe