కోటి కుటుంబాలకు రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా.. రేపే శ్రీకారం

తెలంగాణలోని కోటి కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించేలా ‘ఇందిరమ్మ కుటుంబ బీమా’ పథకాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నవంబర్ 19న సిద్దిపేట సభలో ఈ దరఖాస్తుల ప్రక్రియతో పాటు ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించనున్నారు.

Published on: Nov 18, 2026, 06:43:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హైదరాబాద్: తెలంగాణలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా కోటి కుటుంబాలకు రూ.5 లక్షల బీమా కవరేజీ అందించే ‘ఇందిరమ్మ కుటుంబ బీమా’ పథకాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో వేర్వేరుగా అమలవుతున్న బీమా పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు.

కోటి కుటుంబాలకు రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా.. రేపే శ్రీకారం
కోటి కుటుంబాలకు రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా.. రేపే శ్రీకారం

రాష్ట్రంలో ఇప్పటివరకు వివిధ వర్గాలకు, కార్మికులకు వేర్వేరు శాఖల ద్వారా బీమా పథకాలు అమలవుతున్నాయి. వీటన్నింటినీ ఏకీకృతం చేయడం వల్ల పరిపాలనాపరమైన జాప్యం తగ్గి, అర్హులైన ప్రతి కుటుంబానికి సమగ్ర రక్షణ లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ‘ఇందిరమ్మ బీమా’ పథకం, ‘ఇందిరమ్మ చీరల’ పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

నవంబర్ 19న సిద్దిపేట సభలో శ్రీకారం

కోటి కుటుంబాలకు రూ.5 లక్షల బీమా ప్రయోజనం అందేలా తక్షణమే అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) వెల్లడించిన వివరాల ప్రకారం, నవంబర్ 19న సిద్దిపేటలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ‘ఇందిరమ్మ బీమా’ దరఖాస్తు ప్రక్రియను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఉపాధి హామీ పథకం కూలీలతో సహా రాష్ట్రంలోని లక్షలాది మంది పేదలకు ఈ కొత్త పథకం ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న బీమా పథకాల తీరుతెన్నులను అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుత పథకాల కింద రూ. 2 లక్షల వరకు జీవిత బీమా, రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా సదుపాయం అందుబాటులో ఉందని తెలిపారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి, వివిధ శాఖలు అమలు చేస్తున్న బీమా పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తూనే, ప్రస్తుతం ఉన్న ప్రమాద బీమా ప్రయోజనాలు యథాతథంగా కొనసాగేలా చూడాలని స్పష్టం చేశారు.

రూ. 5 లక్షలకు జీవిత బీమా పెంపు.. గ్రామస్థాయిలో దరఖాస్తులు

ఇందిరమ్మ బీమా పథకం కిందకు తీసుకురావడం ద్వారా ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల జీవిత బీమా కవరేజీని రూ.5 లక్షలకు పెంచాలని సీఎం ప్రతిపాదించారు. "ప్రస్తుతం ప్రభుత్వం నుంచి బీమా భద్రత పొందుతున్న ఏ ఒక్కరినీ ఈ పథకం నుంచి మినహాయించకూడదు" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అర్హులందరికీ పథకం ఫలాలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు.

ఈ పథకంపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. బీమా దరఖాస్తు ఫారాలను గ్రామస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పారు. పథకం ఉద్దేశం, దరఖాస్తు విధానంపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించే బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని సూచించారు.

అర్హులైన ప్రతి మహిళకూ ఇందిరమ్మ చీర.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

కొత్త బీమా పథకం ప్రారంభోత్సవంతో పాటే నవంబర్ 19న సిద్దిపేట బహిరంగ సభలో ‘ఇందిరమ్మ చీరల’ పంపిణీని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి మహిళకూ చీర అందేలా చర్యలు తీసుకోవాలని, వెంటనే అన్ని జిల్లాలకు చీరలను పంపించాలని అధికారులను ఆదేశించారు.

ఇందిరమ్మ బీమా, చీరల పంపిణీ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజుకు సీఎం సూచించారు. "చీరల పంపిణీ ప్రక్రియలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా అధికారులపై కఠిన చర్యలు తప్పవు" అని సీఎం హెచ్చరించారు.

ఈ సమీక్షా సమావేశంలో సీఎంవో ముఖ్య కార్యదర్శులు శేషాద్రి, శ్రీధర్, సీఎంవో కార్యదర్శి మాణిక్ రాజ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, సీఎంవో ఓఎస్‌డీ వేముల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More