తెలంగాణ రైతులు పత్తిని అమ్ముకోలేకపోతున్నారు: ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతుల సమస్యలను పట్టించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కనీస మద్దతు ధర కూడా పత్తి రైతుకు దక్కడం లేదన్నారు.

Published on: Nov 16, 2025, 19:31:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి రైతులు సంక్షోభంలో ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్రలో ఉన్నాయన్నారు. పత్తి రైతుల సమస్యలను పట్టించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ అంశంలో వెంటనే కేంద్రంపైన ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పత్తి కొనుగోళ్లపై కేటీఆర్
పత్తి కొనుగోళ్లపై కేటీఆర్

రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు వెంటనే కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలన్నారు కేటీఆర్. తేమశాతం, కపాస్ మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్, జిన్నింగ్ మిల్లుల అవినీతి అంటూ కుంటి సాకులతో సీసీఐ కొనుగోలుకు నిరాకరిస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో పత్తి రైతులకు భారీ నష్టం కలుగుతుందన్నారు. కనీస మద్దతు ధర కూడా పత్తి రైతుకు దక్కడం లేదని కేటీఆర్ ఆరోపించారు.

'నెల రోజుల్లో కేవలం 1.12 లక్షల టన్నుల పత్తి కొనుగోలు, 28 లక్షల టన్నుల లక్ష్యం కంటే కొనుగోళ్లు అతి తక్కువగా ఉండటం రాష్ట్రంలో నెలకొన్న పత్తికొనుగుల సంక్షోభానికి నిదర్శనం. ఈ అంశంలో వెంటనే కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు కార్యాచరణ చేపట్టాలి. తెలంగాణ రాష్ట్రంలోని పత్తి రైతులు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి దిక్కులేని పరిస్థితి నెలకొన్నది.'అని కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని రైతుల కష్టాలను తీర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల ఉమ్మడి నిర్లక్ష్యమేనని మండిపడ్డారు. ఈ రెండు ప్రభుత్వాల నిర్లక్ష్యం పత్తి రైతులకు శాపంగా మారిందని పేర్కొన్నారు. దాదాపు 50 లక్షల ఎకరాల పత్తి పంట పండించిన రైతన్నలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రభుత్వాలు మొద్దు నిద్రలో ఉన్నాయని మండిపడ్డారు.

ఇప్పటికైనా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, ఎంపీలు ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకురావాలన్నారు కేటీఆర్. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చొరవ చూపించి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చర్చించి రాష్ట్ర రైతన్నల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు. అడ్డగోలు నిబంధనలతో, కుంటి సాకులతో కొనుగోలు ఆపివేసిన సీసీఐ వైఖరిని కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.

'కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వలన రైతన్నకు కనీస మద్దతు ధర కూడా దొరకడం లేదు. తీవ్రమైన వర్షాల వలన ఇప్పటికే పంట నష్టంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మిగిలిన పంటను కూడా అమ్ముకోలేక నష్టాల పాలవుతున్నారు. రాష్ట్రంలోని దాదాపు 50 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తున్న రైతన్నలను పట్టించుకోకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 60 సార్లు ఢిల్లీకి వెళ్లినా, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎవరూ కూడా తెలంగాణ పత్తి రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లలేదు.' అని కేటీఆర్ అన్నారు.

రైతులకు అండగా నిలబడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు కేటీఆర్. రాష్ట్రంలోని లక్షల మంది రైతన్నలు తమ పత్తిని కొనుగోలు చేసే దిక్కులేక ఆందోళన చేస్తున్నా.. రేవంత్ రెడ్డి ఇప్పటివరకు కనీసం స్పందించకపోవడం దారుణం అన్నారు. ప్రస్తుతం పత్తికి క్వింటాల్‌కు రూ. 8,110 కనీస మద్దతు ధర (MSP) ఉన్నప్పటికీ, బహిరంగ మార్కెట్‌లో రైతులు కేవలం రూ. 6,000 నుండి రూ. 7,000 రూపాయలు దక్కడం అత్యంత కష్టంగా మారిందన్నారు. దీనివల్ల ప్రతి క్వింటాల్‌పై రైతులు దాదాపు రూ. 2,000 వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More