'బనకచర్లకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దు' - కేంద్రానికి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు
బనకచర్ల ప్రాజెక్ట్ పై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఆ ప్రాజెక్ట్ కు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కోరారు. విభజన చట్టాన్ని ఉల్లంఘించేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి - బనకచర్లప్రాజెక్టు ప్రీ - ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను తిరస్కరించాలని కేంద్రానికి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖను అందజేశారు.

బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ -1980 (జీడబ్ల్యూడీటీ), ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం – 2014 లకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు. బనకచర్లపై అభ్యంతరాలతో పాటు నీటి వాటాలకు సంబంధించి అనేక అంశాలను కేంద్రమంత్రికి వివరించారు.
ఫిర్యాదులోని ముఖ్యమైన అంశాలు:
- “బనకచర్ల ప్రాజెక్ట్ అనుమతుల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ, పర్యావరణ శాఖ వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. గోదావరి వరద జలాల ఆధారంగా బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదిస్తున్నామని ఏపీ చెబుతోంది. జీడబ్ల్యూడీటీ - 1980లో వరద జలాలు, మిగులు జలాల ప్రస్తావనే లేదు.
- 2014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా నూతన ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటే ముందు ఆ నదీ యాజమాన్య బోర్డు, సీడబ్యూసీ, జల్‌శక్తి మంత్రి అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే ఎపెక్స్ కౌన్సిల్‌లో చర్చించి అనుమతి పొందాలి. బనకచర్ల విషయంలో ఏపీ వీటన్నింటిని ఉల్లంఘిస్తోంది.
- ఏ నిబంధనలు పాటించకుండా వరద జలాల ఆధారంగా ప్రాజెక్ట్ చేపడుతున్నామని చెబుతుండడం తీవ్ర అభ్యంతరకరం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, జల్‌శక్తి మంత్రిత్వ శాఖ తక్షణమే జోక్యం చేసుకొని బనకచర్ల ప్రాజెక్ట్ ముందుకెళ్లకుండా చూడాలి.
- సీడబ్ల్యూసీ పరిధిలోని సాంకేతిక సలహా మండలి నుంచి అనుమతులు పొందకుండానే వరద జలాల పేరుతో పోలవరం కింద పురుషోత్తపట్నం, వెంకటనగరం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలను ఏపీ చేపట్టింది. GWDT -1980 నిబంధనల ప్రకారం పోలవరం డిజైన్లు మార్పు చేసింది. పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా పనులు చేపడుతోంది. తాము అభ్యంతరాలు లేవనెత్తినా పనులు మాత్రం కొనసాగిస్తూనే ఉంది.
- జాతీయ ప్రాజెక్టు పోలవరంవిషయంలో ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. గోదావరిలో వరద జలాలున్నాయని నిజంగా ఏపీ భావిస్తే.. పోలవరం - బనకచర్లకు బదులు కేంద్రం నిధులు ఇచ్చి ఇచ్చంపల్లి - నాగార్జున సాగర్ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్‌కు నీళ్లు తీసుకెళ్లే విషయంలో చర్చకు తాము సిద్ధం.
- కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-2 తీర్పు త్వరగా వెలువడేలా చూడాలి. తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోం. అన్ని వేదికల ద్వారా సమస్యలు సామరస్య పూర్వకంగా పరిష్కారానికి ప్రయత్నిస్తాం. కేంద్ర స్పందన అనుకూలంగా లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం.” అని వివరించారు.
ఆ అనుమతులు ఇవ్వండి - సీఎం రేవంత్ రెడ్డి
“తెలంగాణకు గోదావరి నదిలో 1000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీలు మొత్తంగా 1500 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) జారీ చేయాలి. దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి. 1500 టీఎంసీల నీటితో కోటిన్నర ఎకరాలకు నీరు అందుతుంది. ఆ తర్వాత ఏపీ చేపట్టే ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను పరిశీలిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదు” అని సీఎం రేవంత్ తెలిపారు.
"ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు అనుమతుల ప్రక్రియలో సత్వరం స్పందిస్తూ… తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మాత్రం అలసత్వం ప్రదర్శించడం తగదు. ఏపీ వైఖరితో ఇరు రాష్ట్రాల మధ్య పలు అపోహలు, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. పాలమూరు - రంగారెడ్డి, సమ్మక్క- సారక్క, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులతో పాటు అన్ని రకాల అనుమతులు వెంటనే మంజూరు చేయాలి. గంగా, యమునా నదుల ప్రక్షాళనకు నిధులిచ్చినట్లే మూసీ పునరుజ్జీవనానికి నిధులు కేటాయించాలి” అని కేంద్రమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
తెలంగాణ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని సమావేశం అనంతరం ఉత్తమ్కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు. బనకచర్లకు సంబంధించిన డీపీఆర్ తమకు అందలేదని కేంద్ర మంత్రి చెప్పారని వివరించారు. త్వరలోనే ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారని మంత్రి వివరించారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper


