TG Fee Reimbursement : ఇక విద్యార్థి ఖాతాలోకే ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు - 75 శాతం హాజరు తప్పనిసరి, కొత్త రూల్స్ ఇవే

Telangana Fee Reimbursement New Rules : ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక సంస్కరణలు చేపట్టింది. పాత జీవో నం.7ను రద్దు చేస్తూ….. కొత్త నిబంధనలతో కూడిన జీవో నం.9ను విడుదల చేసింది. ఇకపై  ఫీజుల మొత్తాన్ని నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే డీబీటీ (DBT) పద్ధతిలో జమ చేయనుంది.

Published on: Jun 10, 2026, 09:10:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Fee Reimbursement New Rules : గత కొంతకాలం రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల చెల్లింపుల విషయంలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రైవేట్ కాలేజీలు హైకోర్టును కూడా ఆశ్రయించాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ సర్కార్… కీలక సంస్కరణలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గతంలో ఉన్న జీవోను రద్దు చేసి… కొత్త నిబంధనలను అమలు చేయనుంది.

ఫీజు రీయింబర్స్‌మెంట్ - కొత్త నిబంధనలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ - కొత్త నిబంధనలు

గతంలో మాదిరిగా కాలేజీల ఖాతాలోకి కాకుండా…. విద్యార్థుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకే నేరుగా నగదు బదిలీ (Direct Benefit Transfer - DBT) చేయనున్నారు. ఇందుకోసం గతంలో అమలులో ఉన్న జీవో నం.7ను రద్దు చేస్తూ…. కొత్త నిబంధనలతో బోధన ఫీజుల నోడల్‌ విభాగమైన ఎస్సీ సంక్షేమశాఖ సరికొత్త ఉత్తర్వులు (జీవో నం.9) జారీ చేసింది. ఈ మార్పులు రాబోయే 2026-27 విద్యాసంవత్సరం నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నాయి.

ఏడాదంతా దరఖాస్తుల స్వీకరణ..

కొత్త నిబంధనల ప్రకారం.. రాష్ట్రంలో సంక్షేమ విద్యార్థులకు బోధన ఫీజులు, స్కాలర్‌షిప్‌ల మంజూరు కోసం ఏడాది పొడవునా ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించనుంది. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు కొత్తవాటితో పాటు రెన్యువల్‌ దరఖాస్తులను ఎప్పుడైనా సమర్పించుకోవచ్చు. ఇందుకోసం ఈ-పాస్ (e-PASS) పోర్టల్‌ ఏడాదంతా తెరిచే ఉంటుంది.

దరఖాస్తు చేయడంలో ఆలస్యం చేసినకొద్దీ ఫీజుల విడుదల కూడా ఆలస్యమవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ముందు దరఖాస్తు చేసిన వారికి ముందుగా మంజూరు’విధానాన్ని అవలంబిస్తారు. అలాగే…. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఏడాది ఫీజును ఒకేసారి చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాల మంజూరులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధివిధానాలనే ఇకపై రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో అమలు చేయనుంది. ఈ పథకం కింద ఫీజుల మొత్తాన్ని విద్యార్థుల ఖాతాల్లోకి విడుదల చేసిన వారం రోజుల్లో (7 రోజులు) ఆ నిధులను విద్యార్థులు తాము చదువుతున్న కళాశాలలకు చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తుల పరిశీలన ఇలా:

  • ఏప్రిల్‌ 1 నుంచి జులై 31 వరకు : ఈ కాలంలో అందిన దరఖాస్తులను పరిశీలించి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించిన రాష్ట్ర వాటాను ఆగస్టు 15 నాటికి ప్రభుత్వం విడుదల చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం తన వాటాను విడుదల చేసిన వెంటనే ఆ మొత్తాన్ని కూడా విద్యార్థుల ఖాతాలో జమ చేస్తారు. ఇక బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు ఆగస్టు 15నే ఒకే విడతగా చెల్లిస్తారు.
  • ఆగస్టు 1 నుంచి నవంబరు 30 వరకు : ఈ గడువులో దరఖాస్తు చేసుకున్న వారికి డిసెంబరు 30 నాటికి నిధులు అందుతాయి.
  • డిసెంబరు 1 నుంచి జనవరి 31 వరకు : ఈ సమయంలో దరఖాస్తు పూర్తి చేసిన వారికి ఫిబ్రవరి 28న నిధులు విడుదలవుతాయి.
  • ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు : విద్యాసంవత్సరం చివర్లో దరఖాస్తు చేసుకున్న వారికి 75 రోజుల్లోగా నిధులను ఖాతాల్లో జమ చేస్తారు.

కొత్త మార్గదర్శకాలు.. నిబంధనలు ఇవే!

2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఇకపై ప్రతి ఏటా దరఖాస్తును రెన్యువల్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి చేరిన వారికి ఆటోమేటిక్‌ రెన్యువల్‌ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.

  • ఆదాయ పరిమితి : కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల లోపు ఉన్న విద్యార్థులు మాత్రమే ఈ బోధన ఫీజుల రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు. అలాగే అభ్యర్థులు కచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉంటున్నవారైఉండాలి.
  • ఆధార్ హాజరు తప్పనిసరి : అన్ని విద్యాసంవస్థలు బయోమెట్రిక్ లేదా ఆధార్ ఆధారిత హాజరు వ్యవస్థను పక్కాగా అమలు చేయాలి.
  • స్కాలర్‌‌షిప్ కావాలంటే విద్యార్థికి బయోమెట్రిక్ హాజరు 75 శాతం ఉండాల్సిందే.
  • ఫీజులు, ఉపకార వేతనాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం సోషల్ ఆడిట్ నిర్వహించనుంది.
  • ఈ-పాస్ పోర్టల్‌లో విద్యార్థుల సమస్యల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు లేవనెత్తిన సాంకేతిక లేదా ఇతర సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సి ఉంటుంది.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More