ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త స్కీమ్ - త్వరలోనే ప్రకటన..! అమలు ఇలా
ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో కొత్త హెల్త్ స్కీమ్ రానుంది. ఇదే విషయంపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కొత్త ఆరోగ్య పథకం అమలు చేస్తారు.
ప్రభుత్వ ఉద్యోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త ఆలోచన చేస్తోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులకు త్వరలోనే కొత్త హెల్త్ స్కీమ్ ను అమలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ప్రాథమికంగా కసరత్తు పూర్తి కాగా…. ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయాన్ని ప్రకటించనుంది.

సీఎస్ నేతృత్వంలో కీలక భేటీ…!
ఫిబ్రవరి 12వ తేదీన(గురువారం) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో ఇతర ఉన్నతాధికారులతో పాటు పలు ఉద్యోగ సంఘాలు ఈ భేటీకి హాజరుకానున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పథకంలో ఉన్న ఇబ్బందులను చర్చించి…. కొత్త పథకంలో తీసుకురావాల్సి మార్పులపై చర్చిస్తారు.
ప్రభుత్వ ఉద్యోగుల కోసం అమలు చేయబోయే ఈ పథకాన్ని ‘న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్’గా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఎంప్లాయ్ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్‌సీటీ) ఏర్పాటవుతుందని తెలుస్తోంది. అధికారిక ప్రకటనలో వీటిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగ హెల్త్ స్కీమ్ సేవలను రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో ఉద్యోగుల కార్డులు ఆసుపత్రుల్లో సరిగా చెల్లుబాటు కావడం లేదు. ఈ విషయంలో ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. రీయింబర్స్‌మెంట్ కూడా ఆశించిన స్థాయిలో కావటం లేదు. ఈ విషయాలపై రాత పూర్వకంగా కూడా ఉద్యోగ సంఘాలు… ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. డీఏలు, పీఆర్సీ వంటి అంశాలతో పాటు హెల్త్ స్కీమ్ కూడా ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లలో ఒకటిగా ఉంది.
ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదిస్తున్న హెల్త్ స్కీమ్ పథకంలో ఉద్యోగుల బేసిక్ నుంచి ఒకటి లేదా ఒకటిన్నర శాతం నగదుతో భాగస్వామ్యం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నెల జీతాన్ని బట్టి ఈ చెల్లింపు ఉంటుంది. అయితే ఈ విషయంపై ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయనేది తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి 12వ తేదీన జరగబోయే సమావేశంలో…. కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.

E-Paper












