Telangana ICET Counselling 2026 : రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో చేరేందుకు ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. టీజీ ఐసెట్ - 2026 కౌన్సెలింగ్ ప్రక్రియలో అత్యంత కీలకమైన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది.

ఇప్పటికే కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు మొదలు కావడంతో… అధికారులు తాజాగా వెబ్ ఆప్షన్ల లింక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఐసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్న అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 8వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
ఈనెల 8 వరకు ఛాన్స్…
విడుదల చేసిన ప్రవేశాల షెడ్యూల్ ప్రకారం…. ప్రాథమికంగా నమోదు చేసుకున్న విద్యార్థులకు ఆగస్టు 5వ తేదీ వరకు నిర్దేశిత హెల్ప్‌లైన్ కేంద్రాల్లోధ్రువపత్రాల పరిశీలన చేపడతారు. ఈ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన అభ్యర్థులు మాత్రమే వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి అర్హత సాధిస్తారు. విద్యార్థులు ఆగస్టు 8వ తేదీ వరకు తమ ప్రాధాన్యతలను లాక్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించారు.
అభ్యర్థులు నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లు, మెరిట్ మరియు రిజర్వేషన్ల ఆధారంగా ఆగస్టు 11వ తేదీన లేదా అంతకంటే ముందే మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను అధికారులు వెల్లడిస్తారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో సీటు పొందిన అభ్యర్థులు ఆగస్టు 11 నుంచి 14వ తేదీ మధ్య ఆన్‌లైన్ విధానంలో నిర్దేశిత ట్యూషన్ ఫీజు చెల్లించి, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలోగా ఫీజు చెల్లించని వారి సీటు రద్దయ్యే అవకాశం ఉంది.
టీజీ ఐసెట్ కౌన్సెలింగ్ - వెబ్ ఆప్షన్ల నమోదు ఇలా…
- మొదటగా తెలంగాణ ఐసెట్ అధికారిక వెబ్‌సైట్ https://tgicet.nic.in/default.aspx ను సందర్శించాలి.
- హోం పేజీలో కనిపించే 'Candidate Login' ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ రిజిస్ట్రేషన్ నంబర్, ఐసెట్ హాల్ టికెట్ నంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- లాగిన్ అయిన తర్వాత తెరపై కనిపించే కాలేజీల జాబితా ఆధారంగా మీకు ఇష్టమైన కోర్సులు, కళాశాలల ప్రాధాన్యతలను ఎంచుకోవాలి.
- మీరు ఎంచుకున్న ప్రాధాన్యతలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని, చివరగా సేవ్ లేదా సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తవుతుంది.