Indian Student death in UK : లండన్‌లో కామారెడ్డి విద్యార్థి అనుమానాస్పద మృతి..! విషాదంలో కుటుంబం
Indian Student death in UK : ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన తెలంగాణకు చెందిన 25 ఏళ్ల విద్యార్థి ఎస్. శ్రీనాథ్ రెడ్డి అక్కడ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
లండన్‌లో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న తెలంగాణకు చెందిన ఒక యువ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన 25 ఏళ్ల ఎస్. శ్రీనాథ్ రెడ్డి లండన్‌లో విగతజీవిగా పడి ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ విషాద వార్తను అతడి కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు.

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం తలమడ్ల గ్రామానికి చెందిన శ్రీనాథ్ రెడ్డి, ఉన్నత విద్యను అభ్యసించేందుకు 14 నెలల క్రితం లండన్‌కు వెళ్లాడని అతని తండ్రి మధుసూదన్ రెడ్డి కన్నీటిపర్యంతమవుతూ తెలిపారు. తన కుమారుడు ఎలా చనిపోయాడనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు, పరిస్థితులు ఇప్పటివరకు తమకు తెలియరాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విదేశాల్లో ఉన్న కొడుకు అకాల మరణంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని వాపోయారు. శ్రీనాథ్ రెడ్డి భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకువచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి, బ్రిటన్ అధికారులతో మాట్లాడి సహాయం చేయాలని ఆయన చేతులు జోడించి వేడుకున్నారు.
బర్త్‌డే పార్టీకి వెళ్లిన తర్వాతే ఘోరం….
జూన్ 22వ తేదీ రాత్రి శ్రీనాథ్ రెడ్డి తమతో ఫోన్లో మాట్లాడాడని, అప్పుడు అతను చాలా సాధారణంగా, సంతోషంగానే ఉన్నాడని తండ్రి మధుసూదన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆ రోజే రాత్రి లండన్‌లో జరిగిన ఒక స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు (బర్త్‌డే పార్టీ) శ్రీనాథ్ హాజరైనట్లు తమకు సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు.
లండన్‌లోనే నివసిస్తున్న శ్రీనాథ్ రెడ్డి బంధువుల కుమారుడు అందించిన వివరాల ప్రకారం.. జూన్ 23వ తేదీ ఉదయం శ్రీనాథ్ గదిలోనే అతను శవమై కనిపించాడు. శ్రీనాథ్‌తో కలిసి ఒకే రూమ్‌లో ఉంటున్న రూమ్‌మేట్ ఉదయం లేచి చూసేసరికి అతను అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని కనిపించినట్లు సమాచారం.
ఈ మరణం సంభవించిన వెంటనే కాకుండా, కాస్త ఆలస్యంగా రూమ్‌మేట్ ఇతర స్నేహితులకు ఈ విషయాన్ని తెలియజేశాడని శ్రీనాథ్ బంధువులు చెబుతున్నారు. దీంతో ఈ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లండన్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన యువకుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో తలమడ్ల గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

