ముందుగా సర్పంచ్ ఎన్నికలు.. పాత రిజర్వేషన్లే.. కేబినెట్ కీలక నిర్ణయాలు!
తెలంగాణ స్థానిక సంస్థలపై కీలక అప్డేట్ వచ్చింది. డిసెంబర్‌లో ప్రజాపాలన వారోత్సవాల తర్వాత నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కొంతకాలంగా సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ వారోత్సవాలు డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు జరుగుతాయి. తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే డిసెంబర్ రెండోవారం లేదంటే మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసిందనే విషయాలను ప్రజాపాలన వారోత్సవాల్లో వివరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేసి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని అనుకుంటోంది. జూబ్లీహిల్స్ విజయంతో కేడర్ జోష్‌లో ఉంది. ఇదే ఊపులో గ్రామస్థాయి కార్యకర్తల్లో ఉత్సాహం నింపి స్థానిక ఎన్నికల్లో జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.
పాత రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. చట్టపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యం కావడం లేదు. దీంతో పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో సీట్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే చర్యకు చట్టపరమైన అడ్డంకులు ఎదుర్కొంటున్నందున, తెలంగాణ ప్రభుత్వం త్వరలో గ్రామ పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు తర్వాత నిర్వహించాలనుకుంటోంది. 15వ ఆర్థిక సంఘం కింద స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన నిధులు (సుమారు రూ. 3,000 కోట్లు) మార్చి, 2026 నాటికి ముగుస్తాయని మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. గ్రామ పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించిందని అన్నారు.
అయితే స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం కోటాలను అధికారికంగా కేటాయించాలనే తమ ప్రయత్నాలు ఫలించకపోవడంతో పార్టీ తరఫున సీట్లు కేటాయిస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రిజర్వేషన్ మీద కోర్టులు నిర్ణయం తీసుకున్న తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుదంని మంత్రి స్పష్టం చేశారు.
జయజయహే తెలంగాణ గీతాన్ని ప్రతీ పాఠ్యపుస్తకంలో ముందు ముద్రించేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2047 ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు మంత్రి పొంగులేటి. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీకి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
మరోవైపు సౌదీ అరేబియాలో మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైన దుర్ఘటన గురించి మంత్రి మండలిలో చర్చించారు. మృతుల కుటుంబాలకు మంత్రివర్గం ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. మరణించిన బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది.
మంత్రి అజారుద్దీన్ నేతృత్వంలో ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీ అరేబియాకు పంపించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. చనిపోయిన వారి కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు మృతదేహాలను మత సంప్రదాయాల ప్రకారం అక్కడే అంత్యక్రియలు చేయాలని పేర్కొంది. అందుకోసం బాధిత కుటుంబ సభ్యులను ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరిని సౌదీ అరేబియా తీసుకెళ్లడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


