TG DOST Special Phase Allotment 2026 : దోస్త్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ కు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. అర్హులైన అభ్యర్థులకు సీట్లను కేటాయించారు. ఈ విడతలో మొత్తం 53,967 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి.

ఈ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో సీటు దక్కించుకున్న విద్యార్థులందరూ ఆగస్టు 01, 2026 వరకు ఆన్‌లైన్ పద్ధతిలో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (TC)తో పాటు ఇతర అవసరమైన ధృవీకరణ పత్రాలను కేటాయించిన కళాశాలలో సమర్పించాలి. ఈ నిర్దేశిత గడువులోగా కళాశాలలో రిపోర్ట్ చేయని అభ్యర్థుల సీటు కేటాయింపు రద్దవుతుంది. అందువల్ల అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే తమ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ స్పెషల్ ఫేజ్‌లో కేటాయించిన సీట్లలో బీకామ్‌లో 17,335 మంది, బీఎస్సీ (ఫిజికల్ సైన్స్)లో 10,894 మంది, బీఎస్సీ (లైఫ్ సైన్స్)లో 9,592 మంది, బీఏలో 9,073 మంది, బీబీఏలో 4,411 మంది, బీసీఏలో 1,734 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి.
దోస్త్ ప్రత్యేక విడత - అలాట్‌మెంట్ డౌన్లోడ్ ఇలా:
దోస్త్ ప్రత్యేక విడతలో సీటు పొందిన విద్యార్థులు తమ అడ్మిషన్ వివరాలు తెలుసుకోవడానికి, అలాట్‌మెంట్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి క్రింది ప్రక్రియను అనుసరించాలి.
- మొదటగా విద్యార్థులు దోస్త్ అధికారిక వెబ్‌సైట్ https://dost.cgg.gov.in ను సందర్శించాలి.
- మీ వద్ద ఉన్న దోస్త్ ఐడీ (DOST ID) మరియు పాస్‌వర్డ్ వివరాలను నమోదు చేసి సిస్టమ్‌లోకి లాగిన్ కావాలి.
- లాగిన్ విజయవంతమైన తర్వాత, మీకు సీటు ఖరారైతే స్క్రీన్‌పై సీటు కేటాయింపు లెటర్ ప్రత్యక్షమవుతుంది.
- స్క్రీన్‌పై కనిపిస్తున్న ప్రింట్ లేదా డౌన్‌లోడ్ ఆప్షన్‌ను ఎంచుకుని అలాట్‌మెంట్ ఆర్డర్ కాపీని సేవ్ చేసుకోవాలి.
- కళాశాలలో నేరుగా చేరేటప్పుడు ఈ అలాట్‌మెంట్ లెటర్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి విద్యార్థులు ఈ ప్రింటవుట్ కాపీని భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.