హైకోర్టు తీర్పు తర్వాత స్థానిక ఎన్నికలపై నిర్ణయం.. క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర మంత్రివర్గం చాలా సేపు చర్చించింది. హైకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలని నిర్ణయించింది.
స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై నవంబర్ 3న హైకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇద్దరు పిల్లల నియమాన్ని రద్దు చేయడం, కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంలాంటి వాటికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కేసు నవంబర్ 3న హైకోర్టులో విచారణకు రానుంది. ఈ ప్రక్రియల ఫలితాల ఆధారంగా, ఎన్నికలు నిర్వహించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వివరాలు తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే హైకోర్టు మధ్యంతర తీర్పు, సుప్రీం కోర్టు తీర్పుల నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహాలు, సూచనలతో ముందుకు వెళ్లాలని క్యాబినెట్ నిర్ణయించింది. వచ్చే నెల 7వ తేదీన మరోసారి సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోనుంది.
ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే నిబంధనను రద్దు చేయడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిని ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. ఈ సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పునరుద్ధరణ చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. మిగిలిన సొరంగం పనులు అత్యాధునిక డ్రిల్లింగ్ నైపుణ్యంతో చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. గ్రావిటీ ద్వారా 3.50 లక్షల ఎకరాలకు నీరు అందించడంతోపాటుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత గ్రామ ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించే ఈ ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని క్యాబినెట్ తీర్మానించింది.
ఎల్బీ నగర్, సనత్ నగర్, అల్వాల్, వరంగల్‌లలో నిర్మిస్తున్న నాలుగు సూపర్-స్పెషాలిటీ ఆసుపత్రులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. యుద్ధప్రాతిపదికన టిమ్స్ ఆసుపత్రు నిర్మాణం కావాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది.
రామగుండంలో 50 ఏళ్లకు పైగా పనిచేస్తున్న 62.7 మెగావాట్ల థర్మల్ యూనిట్‌ను కూల్చివేయడం, 1,500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న విద్యుత్ అవసరాలు, రాబోయే పదేళ్ల విద్యుత్ డిమాండ్ అంచనాలకు అనుగుణంగా భవిష్యత్ ప్రణాలిక తయారు చేయాలని విద్యుత్ శాఖను మంత్రివర్గం ఆదేశించింది. యదాద్రి పవర్ ప్లాంటులో బూడిద హ్యాండిలింగ్‌కు రైల్వే ట్రాక్ కోసం రూ.540 కోట్ల వ్యయానికి ఆమోదం లభించింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


