TG POLYCET 2026 Counselling : టీజీ పాలిసెట్ కౌన్సెలింగ్ - రిజిస్ట్రేషన్ కు ఇవాళే చివరి తేదీ
TG POLYCET 2026 Counselling : తెలంగాణ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తోన్న టీజీ పాలిసెట్-2026 మొదటి విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ల గడువు ఇవాళ్టితో ముగియనుంది. జూన్ 3 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది.
TG POLYCET 2026 Counselling : టీజీ పాలిసెట్-2026 మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థులు మొదటి విడత కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు విధించిన గడువు ఇవాళ్టితో ముగియనుంది. పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు…. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సాంకేతిక విద్యాశాఖ సూచించింది.

పాలిసెట్ ర్యాంకు సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ( https://tgpolycet.nic.in ) ద్వారా ఆన్‌లైన్ వేదికగా ప్రాసెస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపు పూర్తయిన తర్వాత, తమ ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన (సర్టిఫికెట్ వెరిఫికేషన్) కోసం తేదీ, సమయం, హెల్ప్ లైన్ కేంద్రాన్ని ఎంచుకుంటూ స్లాట్ బుకింగ్ చేసుకోవాలి.
జూన్ 3 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
ఇప్పటికే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని…. నిబంధనల ప్రకారం సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న వాళ్లు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సుల ప్రాధాన్యత క్రమాలను అనుసరించి జూన్ 3వ తేదీ వరకు వెబ్‌సైట్‌లో ఆప్షన్లను ఎంచుకోవచ్చు. అభ్యర్థులు తమ ర్యాంకుకు తగినట్లుగా ఎక్కువ సంఖ్యలో ఆప్షన్లను ఇచ్చుకుంటే మంచి కాలేజీల్లో సీటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని విద్యా నిపుణులు సూచిస్తున్నారు.
టీజీ పాలిసెట్ 2026 - కౌన్సెలింగ్ తేదీలు:
- జూన్ 1 వరకు : విద్యార్థులు బుక్ చేసుకున్న స్లాట్ ప్రకారం నిర్దేశిత హెల్ప్‌లైన్ కేంద్రాలలో ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది.
- జూన్ 3 వరకు : సర్టిఫికెట్ వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులు తమకు నచ్చిన కళాశాలలు, కోర్సుల ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
- జూన్ 6న: అభ్యర్థుల మెరిట్ ర్యాంకు, రిజర్వేషన్ల ఆధారంగా మొదటి విడత సీట్ల కేటాయింపు (సీట్ అలాట్‌మెంట్) చేపడతారు.
- జూన్ 6 నుంచి 9 వరకు: సీటు పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నిర్ణీత ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
- జూన్ 8 మరియు 9 తేదీల్లో: విద్యార్థులు తమకు సీటు వచ్చిన పాలిటెక్నిక్ కళాశాలలకు నేరుగా వెళ్లి, ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
- జూన్ 9న : రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ ప్రథమ సంవత్సరం కొత్త విద్యా సంవత్సరం (తరగతులు) ప్రారంభమవుతుంది.
- అధికారిక వెబ్ సైట్ - https://tgpolycet.nic.in/Default.aspx
మొదటి విడత సీట్ల భర్తీ ప్రక్రియ ముగిసిన అనంతరం…. మిగిలిపోయిన సీట్ల కోసం చివరి విడత (ఫైనల్ ఫేజ్) కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ చివరి విడత ప్రక్రియ జూన్ 15న ప్రారంభమై జూన్ 22వ తేదీతో ముగుస్తుంది.
ఆ తర్వాత కూడా విద్యార్థులకు అంతర్గత మార్పుల కోసం జూన్ 27 నుంచి జూన్ 30 వరకు ఇంటర్నల్ స్లైడింగ్ (Internal Sliding) అవకాశం కల్పించారు. దీని ద్వారా విద్యార్థులు తాము చేరిన కళాశాలలోనే ఒక బ్రాంచ్ నుంచి (ఉదాహరణకు మెకానికల్ బ్రాంచ్ నుంచి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌కు) మారడానికి వీలుంటుంది.
ఇక ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత కూడా మిగిలిపోయే సీట్లను భర్తీ చేయడానికి జూలై 1 నుంచి జూలై 8వ తేదీల మధ్య స్పాట్ ప్రవేశాలు (Spot Admissions) నిర్వహించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది.
ఇటీవలనే తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పాలిసెట్) 2026 ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే . మెుత్తం 82.94 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 86.38 శాతం, బాలురు 79.92 శాతంగా ఉత్తీర్ణత సాధించారు.
పాలిసెట్ 2026 ఎంపీసీ స్ట్రీమ్‌లో మొత్తం 98,029 మంది అభ్యర్థులు హాజరు కాగా, 81,307 మంది (82.94 శాతం) అర్హత సాధించారు. MBiPC స్ట్రీమ్‌లో 98,029 మంది విద్యార్థులు హాజరు కాగా, 79,652 మంది (81.25 శాతం) అర్హత పొందారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

